'జననాయగన్' రిలీజ్‌పై మద్రాస్ హైకోర్ట్ ఏం తేల్చింది?
ఈ సినిమాలో భారత సైన్యానికి సంబంధించిన చిహ్నాలు, కొన్ని మతపరమైన అంశాల చిత్రీకరణపై సెన్సార్ బోర్డు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. వీటన్నిటి పైనా ప్రస్తుతం కోర్టులో వాదోపవాదాలు సాగుతున్నాయి.;
దళపతి విజయ్ నటించిన `జన నాయగన్` విడుదల తేదీకి సంబంధించి మద్రాస్ హైకోర్టులో సాగుతున్న విచారణలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మద్రాస్ హైకోర్టు తాజా విచారణ సందర్భంగా సినిమా విడుదలకు సంబంధించిన సమయపాలనపై న్యాయవాదుల నడుమ తీవ్రమైన వాదన సాగింది.
ముఖ్యంగా జననాయగన్ రివైజింగ్ కమిటీ ఏర్పాటు విషయంలో ఆలస్యం ఇబ్బందికరంగా మారిందన్న వాదన తెరపైకొచ్చింది. సెన్సార్ బోర్డు తన `రివైజింగ్ కమిటీ`ని జనవరి 6 నాటికే ఏర్పాటు చేసి ఉంటే ప్రక్రియ వేగంగా పూర్తయ్యేది. ఒకవేళ ఈ కేసులో ఎటువంటి చట్టపరమైన చిక్కులు లేకపోయి ఉంటే గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న సినిమా విడుదలయ్యే అవకాశం ఉండేదని కోర్టు అభిప్రాయపడింది.
అయితే ప్రస్తుతం కేసు విచారణలో ఉండటం, సెన్సార్ బోర్డు అభ్యంతరాలు, సుప్రీం కోర్టు సూచనల నేపథ్యంలో ఈ తేదీపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. జననాయగన్ మొదట జనవరి 9న విడుదల కావాల్సి ఉంది. కానీ సెన్సార్ సర్టిఫికేట్ రాకపోవడంతో వాయిదా పడింది. సినిమా నిర్మాతలు సుప్రీం కోర్టును ఆశ్రయించగా, ఈ అంశాన్ని జనవరి 20 (మంగళవారం) లోపు తేల్చాలని మద్రాస్ హైకోర్టును సుప్రీం కోర్టు కోరింది. దీంతో హైకోర్ట్ డివిజన్ బెంచ్ లో దీనిపై విచారణ సాగుతోంది.
సెన్సార్ అభ్యంతరాలు..
ఈ సినిమాలో భారత సైన్యానికి సంబంధించిన చిహ్నాలు, కొన్ని మతపరమైన అంశాల చిత్రీకరణపై సెన్సార్ బోర్డు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. వీటన్నిటి పైనా ప్రస్తుతం కోర్టులో వాదోపవాదాలు సాగుతున్నాయి. ఇక చెప్పిన తేదీకి సినిమా విడుదలవ్వకుండా ఆలస్యం కావడం వల్ల ఇప్పటికే దాదాపు 100 కోట్ల రూపాయల వరకు అంతర్జాతీయ మార్కెట్‌లో నష్టం వాటిల్లిందని నిర్మాతలు కోర్టుకు తెలిపారు.
మద్రాస్ హైకోర్టు ఈ రోజు (జనవరి 20) ఇచ్చే తుది తీర్పు ఆధారంగా సినిమా జనవరి 26న విడుదలవుతుందా లేదా ఫిబ్రవరికి వాయిదా పడుతుందా అనేది అధికారికంగా వెల్లడవుతుంది. ప్రస్తుతం కోర్టు విచారణ ఇంకా సాగుతోంది. దీంతో జననాయగన్ ఎప్పటికి రిలీజవుతుందో ఇంకా తేలని పరిస్థితి ఉంది.
ఆగిపోయిన బుకింగులు:
సీబీఎఫ్‌సి చేసిన అప్పీలుపై మద్రాస్ హైకోర్టు తన తుది తీర్పును రిజర్వ్ చేసింది. ఆ నిర్ణయం వెలువడిన తర్వాత, సెన్సార్ సర్టిఫికేట్ జారీ చేయాలా వద్దా, అదనపు షరతులు వర్తిస్తాయా లేదా తదుపరి చట్టపరమైన చర్యలు సాధ్యమా అని స్పష్టం చేయాలి. అప్పటి వరకు విజయ్ పూర్తి రాజకీయ ప్రవేశానికి ముందు చివరి చిత్రంగా భావించిన జన నాయగన్ విడుదల భవితవ్యం అనిశ్చితంగానే ఉంది.
జన నాయగన్ ఇంకా తుది సెన్సార్ సర్టిఫికేట్ పొందలేదు. ఫలితంగా ఈ చిత్రం భారతదేశంలో ఇంకా విడుదల కాలేదు. దీని కారణంగా అనేక ప్రధాన నగరాల్లో ముందస్తు టికెట్ బుకింగ్‌లు నిలిచిపోయాయి.