మూవీ ఈవెంట్లో 'సీఎం' కామెంట్.. పవన్ ఎలా ఫీలయ్యారు?
డిప్యూటీ ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అవుతారని కోలీవుడ్ యాక్టర్ ఆర్. పార్తీబన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.;
సినిమా వేడుకలో చేసిన ఒక్క కామెంట్.. ఇప్పుడు రాజకీయ చర్చకు దారి తీసింది. డిప్యూటీ ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అవుతారని కోలీవుడ్ యాక్టర్ ఆర్. పార్తీబన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఆ వ్యాఖ్యలు పవర్ స్టార్ అభిమానుల్లో జోష్ నింపగా.. మరోవైపు రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమయ్యాయి.
పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ఆదివారం జరిగిన ఆ కార్యక్రమానికి సినీ ప్రముఖులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆ సమయంలో చిత్రంలో కీలక పాత్ర పోషించిన నటుడు ఆర్.పార్తీబన్ తన ప్రసంగంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
సినిమాలో నల్ల నాగప్ప అనే పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్న పార్తీబన్.. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని ప్రశంసిస్తూ మాట్లాడారు. ఆయనను యుగానికి ఒక్కడుగా అభివర్ణించారు. సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా పవన్ రియల్ హీరో అని కొనియాడారు. ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చి తన జీవితాన్ని అంకితం చేసిన నాయకుడిగా పవన్ కళ్యాణ్‌ను తాను గౌరవిస్తానని చెప్పారు.
"ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం పవన్ కళ్యాణ్ ఎన్నో త్యాగాలు చేశారు. ఆయనకు ఉన్న పట్టుదల, కష్టపడే తత్వం చూస్తే.. భవిష్యత్తులో ఆయన ముఖ్యమంత్రి అవడం ఖాయం అని నాకు అనిపిస్తోంది " అని పార్తీబన్ వ్యాఖ్యానించారు. ఒక దర్శకుడిగా ఆ దృశ్యాన్ని ఇప్పుడే తన మనసులో ఊహించుకుంటున్నానని, ఆ రోజు ప్రజలంతా బొకేలు పట్టుకుని ఆయనకు స్వాగతం పలుకుతారని కూడా అన్నారు.
పార్తీబన్ చేసిన కామెంట్స్ తో ఈవెంట్ గ్రౌండ్ అంతా ఒక్కసారిగా కేకలతో మార్మోగిపోయింది. అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తూ చప్పట్లు కొట్టారు. అయితే ఆ సమయంలో పవన్ కళ్యాణ్ మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా నిశ్శబ్దంగా ఉండిపోయారు. స్టేజ్ పై చిరునవ్వుతో స్పందించినప్పటికీ, రాజకీయ వ్యాఖ్యలపై ప్రత్యేకంగా రెస్పాండ్ అవ్వకపోవడాన్ని పలువురు గమనించారు.
ఏదేమైనా ఓ సినిమా వేదికపై రాజకీయ అంశాలు ప్రస్తావించడంతో పవన్ కళ్యాణ్ కొద్దిగా ఇబ్బంది పడినట్లు కనిపించిందని ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లు చెబుతున్నారు. అభిమానులు నినాదాలు చేస్తూ హర్షం వ్యక్తం చేసినప్పటికీ పవన్ మాత్రం కూల్ గా కార్యక్రమాన్ని కొనసాగించారని అంటున్నారు. ఆ సంఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అదే సమయంలో ఇప్పుడు ఒక సినిమా వేడుకలో పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తు గురించి మాట్లాడటం సరైందా అనే అంశంపై చర్చ జరుగుతోంది. అయితే పవర్ స్టార్ అభిమానులు మాత్రం ఆయన వ్యాఖ్యలను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మొత్తానికి ఉస్తాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన ఒక వ్యాఖ్య.. ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.