సెన్సార్ బోర్డు ఔట్ డేటెడ్.. ఆర్జీవీ ఘాటు విమర్శలు!
దళపతి విజయ్ నటించిన `జననాయగన్` రిలీజ్ కి తీవ్ర అడ్డంకులు ఎదురవుతున్న సంగతి తెలిసిందే.;
దళపతి విజయ్ నటించిన `జననాయగన్` రిలీజ్ కి తీవ్ర అడ్డంకులు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. అంతా సవ్యంగా సాగితే ఈ సంక్రాంతి బరిలో విడుదల కావాల్సి ఉంది. కానీ ఈ సినిమా రిలీజ్ వ్యవహారం కోర్టుల పరిధిలోకి వెళ్లడంతో జాప్యం తప్పలేదు. జననాయగన్ అన్ని సమస్యలను పరిష్కరించుకుని జనవరి చివరిలో విడుదలయ్యేందుకు ఆస్కారం ఉందని కొందరు వాదిస్తుండగా, మరికొందరు వేసవికి వాయిదా పడేందుకు ఆస్కారం ఉందని కూడా వాదిస్తున్నారు.
అయితే జననాయగన్ పై రాజకీయ కుట్రలు ఎక్కువయ్యాయని, విడుదలకు కొందరు అడ్డు పడుతున్నారంటూ విజయ్ రాజకీయ పార్టీ టీవీకేకు చెందిన కార్యకర్తలు విరుచుకుపడుతున్నారు. ఈ విషయంలో పరిశ్రమ యావత్తూ విజయ్ కి మద్ధతుగా నిలుస్తోంది. తాజాగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విజయ్ కి మద్ధతుగా మాట్లాడుతూ.. మరోసారి సెన్సార్ బోర్డు (CBFC)పై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. జన నాయగన్ విడుదలలో సెన్సార్ బోర్డు అడ్డంకులు సృష్టించడంపై ఆయన తీవ్రంగా స్పందించారు.
ఎక్స్ ఖాతాలో ఆర్జీవీ ఒక సుదీర్ఘ పోస్ట్ లో సెన్సార్ బోర్డ్ పై విమర్శలు గుప్పించారు. ప్రస్తుత కాలంలో సెన్సార్ బోర్డు అనేది అసంబద్ధమైన (సంబంధం లేని) వ్యవస్థ అని పేర్కొన్నారు. ఇది కేవలం విజయ్ సినిమా విషయంలోనే కాదు.. అసలు సెన్సార్ బోర్డు అనేది నేటి కాలానికి ఏమాత్రం పనికిరాని ఒక పాత చింతకాయ పచ్చడి లాంటి వ్యవస్థ. ఇది ఇప్పటికీ ఉందంటే అది కేవలం దానిపై చర్చించడానికి మనకున్న బద్ధకమే కారణం! అని వర్మ విమర్శించారు. ఈ డిజిటల్ యుగంలో 12 ఏళ్ల పిల్లాడు తన ఫోన్‌లో ఉగ్రవాదుల హత్యలు, అడల్ట్ కంటెంట్ లేదా ఇంకేదైనా చూడగలిగే ఈ రోజుల్లో.. సినిమాలో ఒక డైలాగ్ లేదా సిగరెట్ పొగను బ్లర్ చేయడం ద్వారా సమాజాన్ని రక్షిస్తున్నామని అనుకోవడం ఒక పెద్ద జోక్ అని ఆయన ఎద్దేవా చేశారు.
సెన్సార్ బోర్డ్ కట్స్ చెప్పడానికి బదులు తెలివితేటలు వాడాలని సూచించారు ఆర్జీవీ. బోర్డు తన అధికారాన్ని ప్రదర్శించడం కోసం చేసే పనులను వర్మ `థియేట్రిక్స్` అంటూ కామెంట్ చేసారు. నైతికత ముసుగులో బాధ్యతారహితంగా వ్యవహరిస్తోంది! అని ఆయన విమర్శించారు. సినిమా అనేది ఒక క్లాస్‌రూమ్ కాదని, అది సమాజానికి అద్దం పట్టే మాధ్యమమని, ప్రేక్షకులు దేనిని చూడాలో వారికే వదిలేయాలని వర్మ క్లాస్ తీస్కున్నారు.
మద్రాస్ హైకోర్టు సింగిల్ జడ్జి ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలని ఆదేశించినా బోర్డు అప్పీల్ చేయడంతో డివిజన్ బెంచ్ దానిపై స్టే విధించింది. ఈ కేసు తదుపరి విచారణ జనవరి 21 నాటికి వాయిదా పడింది. దీనివల్ల విజయ్ సంక్రాంతి రేసు నుండి పూర్తిగా తప్పుకోవాల్సి వచ్చింది. అయితే పండగ సీజన్ ని మిస్ చేసుకోవడంతో తమకు 100 కోట్ల నష్టం వాటిల్లిందని నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేసారు. కమల్ హాసన్, ఆర్జీవీ సహా మారి సెల్వరాజ్ తదితరులు విజయ్ కి అండగా నిలిచారు.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఈ విషయంలో స్పందిస్తూ.. సెన్సార్ బోర్డు కేంద్రం చేతిలో ఒక `కీలుబొమ్మ`లా మారిందని విమర్శించడం ఇప్పుడు రాజకీయంగా కూడా దుమారం రేపుతోంది.