‘వారణాసి’ సెకండ్ యూనిట్ డైరెక్టర్‌గా జేమ్స్ కామెరూన్
ప్రపంచ సినీ చరిత్రలోనే అత్యంత గొప్ప దర్శకుల జాబితా తీస్తే.. అందులో జేమ్స్ కామెరూన్ పేరు ముందు వరుసలో ఉంటుంది. ఆయన తీసిన సినిమాలు తక్కువే.;
ప్రపంచ సినీ చరిత్రలోనే అత్యంత గొప్ప దర్శకుల జాబితా తీస్తే.. అందులో జేమ్స్ కామెరూన్ పేరు ముందు వరుసలో ఉంటుంది. ఆయన తీసిన సినిమాలు తక్కువే. కానీ వాటితో మామూలు సంచలనం రేపలేదు. కెరీర్ ఆరంభంలో పిరానా-2, టెర్మినేటర్ చిత్రాలతో బ్లాక్‌బస్టర్లు అందుకున్నారాయన. ఐతే కామెరూన్ నుంచి అసలు సిసలైన సంచలనం 1997లో వచ్చింది. ఎన్నో ఏళ్ల పాటు కష్టపడి ఆయన తీసిన ‘టైటానిక్’ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఉర్రూతూలగించి ఆల్ టైం బ్లాక్ బస్టర్ అయింది.
దీన్ని మించి సినిమా తీయడం అసాధ్యం అనుకున్నారంతా. కానీ ఆ తర్వాత ఏకంగా పన్నెండేళ్ల పాటు గ్యాప్ తీసుకుని ఆయన తీసిన ‘అవతార్’ రేపిన సంచలనం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇలాంటి గొప్ప దర్శకుడు మన డైరెక్టర్ తీసిన ఒక సినిమా చూసి అబ్బురపడడం.. దాని మీద విశ్లేషణ చేయడం.. ఆ దర్శకుడి మీద అమితమైన అభిమానం చూపించడం అనూహ్యం. ఆ అరుదైన ఘనతను రాజమౌళి దక్కించుకున్నాడు. ఆయన తీసిన ‘ఆర్ఆర్ఆర్’ చూసి కామెరూన్ ఎంతగా ఆశ్చర్యపోయాడో తెలిసిందే.
ఇప్పుడు రాజమౌళితో ఆయన వీడియో కాల్ మాట్లాడుతూ.. మీరు తీస్తున్న ‘వారణాసి’ సినిమా సెట్‌కు రావచ్చా.. దానికి సెకండ్ యూనిట్ డైరెక్టర్‌గా పని చేస్తూ కొన్ని సీన్లు తీయొచ్చా అని అడగడం విశేషం. కామెరూన్ కొత్త చిత్రం ‘అవతార్-3’ ఇండియాలో సినీ ప్రముఖులకు స్పెషల్ ప్రిమియర్ వేశారు. అందులో రాజమౌళి కూడా ఉన్నారు. ఆ షో చూశాక ఒక ప్రమోషనల్ ఈవెంట్లోనూ పాల్గొన్నాడు జక్కన్న. ఈ సందర్భంగా కామెరూన్‌తో ఆయన వీడియో కాల్ మాట్లాడడాన్ని స్క్రీన్ మీద చూపించారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ సాగింది.
‘అవతార్-3’ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుతమని.. ఈ ఫ్రాంఛైజీ వరల్డ్ ఫిలిం ఇండస్ట్రీలో ఒక బెంచ్ మార్క్ అని జక్కన్న కొనియాడాడు. అనంతరం కామెరూన్ ‘వారణాసి’ షూట్ గురించి రాజమౌళి అడిగాడు. ఆ సినిమా సెట్‌కు రావచ్చా అని కోరాడు. మీరు వస్తే తమ టీంతో పాటు ఇక్కడి ఫిలిం ఇండస్ట్రీ అంతా గర్విస్తుందని రాజమౌళి చెప్పాడు. అనంతరం కామెరూన్ కొనసాగిస్తూ.. ‘‘పులులతో షూటింగ్ చేస్తుంటే చెప్పు. సెకండ్ యూనిట్‌కైనా వచ్చి కెమెరా పట్టుకుని కొన్ని సీన్లు తీస్తా’’ అంటూ నవ్వేశారు. కామెరూన్ లాంటి ఆల్ టైం గ్రేట్ హాలీవుడ్ డైరెక్టర్.. రాజమౌళితో ఇలా సంభాషించం టాలీవుడ్‌కు గర్వకారణం అనడంలో సందేహం లేదు.