కామెరూన్ 'అవ‌తార్ Vs టెర్మినేట‌ర్' తీస్తే కిక్కో కిక్కు

డిస్నీ సంస్థ అవతార్ 4 , అవ‌తార్ 5 సినిమాల నుండి వెనక్కి తగ్గుతోందనే వార్తలు కొత్త ఏడాది ప్రారంభంలో సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.;

Update: 2026-01-18 18:30 GMT

డిస్నీ సంస్థ అవతార్ 4 , అవ‌తార్ 5 సినిమాల నుండి వెనక్కి తగ్గుతోందనే వార్తలు కొత్త ఏడాది ప్రారంభంలో సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. అయితే ఇది పూర్తిగా రద్దు చేయడం కంటే బడ్జెట్ నియంత్రణ, వ్యూహాత్మక మార్పులకు సంబంధించిన చర్చగా కనిపిస్తోంది. అవ‌తార్ 4, 5 భాగాల కోసం 600 మిలియ‌న్ డాల‌ర్లు, అంటే దాదాపు 5500 కోట్లు ఖ‌ర్చు చేసేందుకు ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేసారు. కానీ పెరిగిన ఖ‌ర్చుల‌తో ఈ బడ్జెట్ స‌రిపోద‌ని ఇంచుమించు డ‌బుల్ అవుతుంద‌ని కామెరూన్ ఆందోళ‌న చెందారు ఒకానొక ద‌శ‌లో.

అవ‌తార్ 3 - ఫైర్ అండ్ యాష్ ఆశించిన స్థాయి విజ‌యం సాధించ‌క‌పోవ‌డంతో ఇప్పుడు డిస్నీ స్టూడియోస్ నిర్మాణ‌ సంస్థ‌ త‌దుప‌రి రెండు సీక్వెల్స్ విష‌యంలో పున‌రాలోచ‌న‌లో ప‌డింద‌నే టాక్ బ‌లంగా వినిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి స‌ద‌రు సంస్థ ఆలోచ‌న ఎలా ఉంది? అంటే...జనవరి 2026లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ద‌ర్శ‌కుడు జేమ్స్ కామెరూన్ స్వయంగా ఈ ప్రాజెక్టుల భవిష్యత్తు గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బ‌హుశా అది డిస్నీ ఆలోచ‌న‌ల‌ను అద్దం ప‌ట్టింద‌ని భావించాల్సి ఉంది.

అవతార్ 3 నిర్మాణానికి భారీ ఖర్చయ్యింది. మేము ముందడుగు వేయాలంటే, తర్వాతి భాగాలను తక్కువ ఖర్చుతో నిర్మించే మార్గాలను వెతకాలి! అని కామెరూన్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులు ముందుకు సాగాలంటే `అవతార్: ఫైర్ అండ్ యాష్` బాక్సాఫీస్ వద్ద అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడం చాలా కీలకమ‌ని అప్ప‌ట్లో అన్నారు. కానీ అవ‌తార్ 3తో ఆశించిన‌ది జ‌ర‌గ‌లేదు. ఇది కేవ‌లం 11వేల కోట్ల వ‌సూళ్ల‌తో స‌రిపెట్టింది. నిజానికి డిసెంబర్ 2025లో విడుదలైన `అవతార్: ఫైర్ అండ్ యాష్` ఇప్పటికే 1.2 బిలియన్ డాల‌ర్ల(11,000 కోట్లు)కు పైగా వసూలు చేసింది. ఇది భారీ విజయమే అయినా కానీ, మునుపటి రెండు భాగాలతో పోలిస్తే కొంత తక్కువ వసూళ్లను సాధించింది. డిస్నీ యాజమాన్యం దీనిని నిశితంగా గ‌మ‌నించింది.

ప్ర‌స్తుతం పెరిగిన బ‌డ్జెట్లు, ఖ‌ర్చుల రీత్యా, డిస్నీ సంస్థ తన స్ట్రీమింగ్ , సినిమా వ్యూహాలను పునర్నిర్మించుకుంటోంది. కంటెంట్ రీసెట్ కి ట్రై చేస్తోంది. కేవలం `స్క్రీన్ గ్రాండియారిటీ` కోసం వందల మిలియన్ల డాలర్లు ఖర్చు చేసే బదులు, లాభదాయకతకు ప్రాధాన్యతను ఇస్తోంది. అవతార్ 4 , అవ‌తార్ 5 సినిమాల మొత్తం బడ్జెట్ 1 బిలియన్ డాల‌ర్ల (సుమారు 10,000 కోట్లు) ను దాటే అవకాశం ఉండటంతో, డిస్నీ బోర్డ్ మీటింగ్‌లలో దీనిపై తీవ్రమైన చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. గ‌తంలో అంచ‌నా 600 మిలియ‌న్ డాల‌ర్లు (5500 కోట్లు)కు మించిపోయింది కాబ‌ట్టి ఈ చ‌ర్చ‌లు వేడెక్కిస్తున్నాయ‌ని తెలిసింది.

అవతార్ 4 సినిమాలోని మొదటి భాగాన్ని జేమ్స్ కామెరూన్ ఇప్పటికే షూట్ చేశారు. ఇందులో పిల్లల పాత్రల వయస్సు పెరగాల్సి ఉండటంతో ఆ భాగాలను ముందే చిత్రీకరించారు. ప్రస్తుతం ఉన్న షెడ్యూల్ ప్రకారం `అవతార్ 4` డిసెంబర్ 2029 లో, అవతార్ 5 డిసెంబర్ 2031 లో విడుదల కావాల్సి ఉంది. కానీ ఆల‌స్య‌మ‌య్యే ఛాన్సుంద‌ని కూడా గుసగుస వినిపిస్తోంది.

కానీ కామెరూన్ లో ఎక్క‌డో కొన్ని సందిగ్ధ‌త‌లు అలానే ఉన్నాయి. దీంతో అత‌డు ఒక ప్ర‌క‌ట‌న చేసి ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. దాని ప్ర‌కారం.. ఒకవేళ డిస్నీ ఈ ప్రాజెక్టులను నిలిపివేస్తే, మిగిలిన కథను నవలల రూపంలో లేదా మరేదైనా ప్లాట్‌ఫారమ్ ద్వారా అభిమానులకు అందిస్తానని కామెరూన్ హామీ ఇచ్చారు. మిచెల్ యో వంటి నటులు అవతార్ 4లో నటించాల్సి ఉండ‌గా, ఈ స్టార్ కూడా ఈ ప్రాజెక్ట్ ఖరారవ్వ‌డం కోసం వేచి చూస్తున్నారు.

డిస్నీ ఈ సినిమాలను అధికారికంగా ఇంకా రద్దు చేయలేదు, కానీ నిర్మాణ వ్యయాలను తగ్గించుకోవాలని కామెరూన్‌పై ఒత్తిడి తెస్తోంది. `అవతార్ 3` లాంగ్ రన్ వసూళ్లు ఆశించినంత‌గా లేవు గ‌నుక 4 , 5 భాగాల కోసం పున‌రాలోచిస్తున్నార‌ని స‌మాచారం. అవతార్ 4 లో జరగబోయే `టైమ్ జంప్` ఎలా ఉంటుందో..!, అవతార్ 5 భూమి మీదకు షిఫ్ట‌యితే ఏం జ‌రుగుతుందో.. ఆలోచిస్తే.. బ‌డ్జెట్లు త‌గ్గే ఛాన్సుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

అయితే కామెరూన్ అనూహ్యంగా అవ‌తార్ క‌థ‌ల్ని మార్చాలని కోరుకునే అభిమానులు ఉన్నారు. అవ‌తార్ తెర‌కెక్కించిన టెర్మినేట‌ర్ ఫ్రాంఛైజీకి వీరాభిమానులున్నారు. అందువ‌ల్ల ఆయ‌న క్రాస్ ఓవ‌ర్ సినిమాల‌ను ప్ర‌య‌త్నించ‌వ‌చ్చ‌ని ఆశిస్తున్నారు. `అవ‌తార్ వ‌ర్సెస్ టెర్మినేట‌ర్‌` తీయాల‌ని డైహార్డ్ తెలుగు ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఒక‌వేళ ఇదే జ‌రిగితే ఈసారి అవ‌తార్ 4, అవ‌తార్ 5 చిత్రాలు క‌నీసం 20,000 కోట్లు (2.4 బిలియ‌న్ డాల‌ర్లు) వ‌సూలు చేయ‌డం ఖాయ‌మ‌ని విశ్లేషిస్తున్నారు. ఒక‌వేళ ఇలా జ‌ర‌గాలంటే ఇప్ప‌టివ‌ర‌కూ షూట్ చేసిన ఫీడ్ కొత్త సినిమాల‌కు స‌రిపోదు. ఇంకా చాలా మార్పుల‌తో రీషూట్లు చేయాల్సి రావొచ్చు. టెర్మినేట‌ర్ కి కామెరూన్ ద‌ర్శ‌క‌నిర్మాత కాబ‌ట్టి ఇది సాధ్య‌మ‌వ్వ‌డానికి ఆస్కారం లేకపోలేదు! కాపీ రైట్ స‌మ‌స్య‌లు కూడా ఉండ‌వు. ఒక్క ఐడియా చాలా స‌మీకర‌ణాల‌ను కూడా మార్చేయ‌వ‌చ్చు.

Tags:    

Similar News