రజినీ సినిమా.. ఎందుకు కొనట్లేదు?

సీక్వెల్‌లో కూడా అదే స్థాయి ఇంటెన్సిటీ ఉంటే తప్ప 60 కోట్ల బ్రేక్ ఈవెన్ సాధించడం అంత సులభం కాదు.;

Update: 2026-05-05 09:43 GMT

బాక్సాఫీస్ వద్ద రజనీకాంత్ మేజిక్ చేస్తే ఎలా ఉంటుందో మూడేళ్ళ క్రితం ‘జైలర్’ సినిమా నిరూపించింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రం అప్పట్లో ఒక సంచలనం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో జైలర్ సృష్టించిన వండర్స్ అంతా ఇంతా కాదు. ఆ సినిమా ఇచ్చిన జోష్‌తోనే ఇప్పుడు ఈ క్రేజీ కాంబినేషన్‌లో సీక్వెల్ రాబోతోంది. అయితే ‘జైలర్ 2’ అనౌన్స్‌మెంట్ వచ్చిన దగ్గరి నుంచి బిజినెస్ లెక్కల విషయంలో ట్రేడ్ వర్గాల్లో పెద్ద చర్చే నడుస్తోంది. సీక్వెల్ అనగానే రేట్లు పెరగడం సహజమే కానీ, ఈసారి మేకర్స్ కోట్ చేస్తున్న తెలుగు స్టేట్స్ ఫిగర్ చూసి బయ్యర్లు కొంత వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.

తెలుగు రాష్ట్రాలకు సంబంధించి జైలర్ 2 రైట్స్ కోసం దాదాపు 60 కోట్ల రూపాయల వరకు మేకర్స్ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. గతంలో జైలర్ మొదటి భాగం కేవలం 12 కోట్ల బిజినెస్ చేసి, తెలుగులో ఏకంగా 50 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఆ లెక్కన చూస్తే 60 కోట్లు పెద్ద విషయం కాదనిపించవచ్చు. కానీ జైలర్ తర్వాత రజనీకాంత్ నుంచి వచ్చిన లాల్ సలామ్, వేట్టయన్, కూలీ వంటి సినిమాలు తెలుగులో బయ్యర్లకు నష్టాలను మిగిల్చాయి. అందుకే ఈసారి అంత భారీ మొత్తాన్ని పెట్టి రిస్క్ చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదని ఇండస్ట్రీ టాక్.

మరోవైపు ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ ఒక కీలక పాత్రలో కనిపిస్తారనే ప్రచారం జోరుగా సాగింది. ఒకవేళ బాలయ్య కన్ఫర్మ్ అయితే తెలుగులో 60 కోట్లు వసూలు చేయడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ బాలయ్య ఈ ప్రాజెక్ట్‌కు నో చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో బిజినెస్ డీల్స్ మళ్ళీ మొదటికి వచ్చాయి. కేవలం రజనీకాంత్ ఇమేజ్ మీద మాత్రమే ఆధారపడి ఇంత భారీ రేటు చెల్లించడం కంటే, సినిమాపై బజ్ పెరిగే వరకు వేచి చూడాలని బయ్యర్లు డిసైడ్ అయ్యారట.

ఒకవేళ అనుకున్న రేటుకు రైట్స్ అమ్ముడుపోకపోతే, గతంలో లాగే సన్ పిక్చర్స్ సంస్థ దిల్ రాజు లేదా సురేష్ బాబు వంటి పెద్ద డిస్ట్రిబ్యూటర్ల ద్వారా కమిషన్ బేసిస్ మీద రిలీజ్ చేసే అవకాశం ఉంది. రజనీకాంత్ సినిమాకు తెలుగులో మంచి మార్కెట్ ఉన్నప్పటికీ, అది కంటెంట్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. జైలర్ మొదటి భాగం ట్రిపుల్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడానికి కారణం అందులోని మ్యూజిక్, ఎలివేషన్స్.

సీక్వెల్‌లో కూడా అదే స్థాయి ఇంటెన్సిటీ ఉంటే తప్ప 60 కోట్ల బ్రేక్ ఈవెన్ సాధించడం అంత సులభం కాదు. ఆగస్టులో రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి అఫీషియల్ అప్‌డేట్ లేకపోవడం కూడా బయ్యర్లలో కొంత అయోమయాన్ని కలిగిస్తోంది. రజనీ నెల్సన్ కాంబో మళ్ళీ మ్యాజిక్ రిపీట్ చేస్తుందని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నా, వ్యాపార పరంగా మాత్రం లెక్కలు తేలడం లేదు. రైట్స్ కోసం కోట్ చేసిన ఆ డీల్ వర్కవుట్ అవుతుందా లేక మేకర్స్ కొంత తగ్గుతారా అనేది చూడాలి.

Tags:    

Similar News