'ఇండస్ట్రీకి పెద్ద దిక్కు పెద్ది'.. జగ్గూభాయ్ ఓపెన్ స్టేట్మెంట్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న ఆ భారీ పాన్ ఇండియా మూవీపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్నంటుతుండగా.. తాజాగా సీనియర్ యాక్టర్ జగపతి బాబు చేసిన వ్యాఖ్యలు మరింత హైప్ తీసుకొచ్చాయి

Update: 2026-05-28 04:00 GMT

టాలీవుడ్‌ లో ఇప్పుడు అందరి చూపు పెద్ది మీదే ఉంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న ఆ భారీ పాన్ ఇండియా మూవీపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్నంటుతుండగా.. తాజాగా సీనియర్ యాక్టర్ జగపతి బాబు చేసిన వ్యాఖ్యలు మరింత హైప్ తీసుకొచ్చాయి. సాధారణంగా తన పాత్రల గురించి తక్కువగానే మాట్లాడే జగ్గూభాయ్.. ఈసారి మాత్రం పెద్దిని ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా చెప్పడం ఆసక్తికరంగా మారింది.

అంతేకాదు.. రంగస్థలం కంటే కూడా పెద్ది తనకు స్పెషల్ అని చెప్పడం ఇంకా చర్చనీయాంశంగా మారింది. సినిమాలో అప్పలసూరి పాత్రలో కనిపించనున్న జగపతి బాబు.. తాజాగా ప్రమోషన్స్‌లో పాల్గొంటూ పెద్ది గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 'పెద్ది రిలీజ్ ఇండస్ట్రీకి పెద్ద దిక్కు లాంటిది. సినిమా పాజిటివ్‌ గా ఎక్కడికో వెళ్లిపోతుంది' అంటూ ఆయన చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. థియేటర్ల పరిస్థితి, పెద్ద సినిమాలపై ఉన్న ఒత్తిడి మధ్య జగపతి బాబు ఆ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

అంతేకాదు.. తన కెరీర్‌ లో క్యారెక్టర్ రోల్స్ పరంగా చూసుకుంటే పెద్దినే నంబర్ వన్ మూవీ అని చెప్పడం కూడా సినిమాపై మరింత హైప్ తీసుకొచ్చింది. 'రంగస్థలం నాకు చాలా ఇష్టం. కానీ దానికి మించిన సినిమా పెద్ది. రంగస్థలంలో జగపతి బాబు కనిపిస్తాడు. కానీ పెద్ది సినిమాలో నేను కనిపించను' అని తెలిపారు. తన గొంతు వినకపోతే గుర్తుపట్టలేరని, పాత్రలో పూర్తిగా లీనమైపోయానని చెప్పడం సినిమాపై ఉన్న నమ్మకాన్ని చూపిస్తోంది.

ఇప్పటికే పెద్ది నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి కలిగించాయి. రామ్ చరణ్‌ ను కంప్లీట్ డీగ్లామర్, రస్టిక్ అవతార్‌ లో చూపిస్తున్న బుచ్చిబాబు.. మరోసారి ఎమోషనల్ కంటెంట్‌ తో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉప్పెన తర్వాత బుచ్చిబాబు నుంచి వస్తున్న సినిమా కావడంతో ముందు నుంచే అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా విలేజ్ ఎమోషన్స్, స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్, భారీ విజువల్స్ కలిసి సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాయనే టాక్ వినిపిస్తోంది.

సినిమాలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే దివ్యేందు శర్మ, జగపతి బాబు, ఉపేంద్ర లిమయే, కృతిశెట్టి, జాన్ విజయ్, చమ్మక్ చంద్ర, దయానంద్ రెడ్డి తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా.. ఆర్ రత్నవేలు సినిమాటోగ్రఫీ హైలెట్ కానుందనే అభిప్రాయం ఉంది.

నవీన్ నూలి, ఆంటోని రుబెన్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టగా.. కొల్లా అవినాష్ ప్రొడక్షన్ డిజైన్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారనుంది. ఏదేమైనా ఇప్పుడు జగపతి బాబు చేసిన వ్యాఖ్యల తర్వాత పెద్దిపై అంచనాలు మరింత పెరిగాయి. ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అంటూ ఆయన చేసిన కామెంట్స్ చూస్తుంటే.. సినిమా కమర్షియల్ ఎంటర్టైనర్ మాత్రమే కాకుండా ఎమోషనల్ గా మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News