పెద్ది కోసం జగ్గూభాయ్ స్పీడ్.. రీజనేంటి?
అదే సమయంలో మరో విషయం కూడా హాట్ టాపిక్ గా మారింది. అదే.. ప్రమోషన్లలో జగపతిబాబు స్పీడ్.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిన పెద్ది మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తూ సందడి చేస్తోంది. అదే సమయంలో మరో విషయం కూడా హాట్ టాపిక్ గా మారింది. అదే.. ప్రమోషన్లలో జగపతిబాబు స్పీడ్. నిజానికి జగపతిబాబు ఎక్కువగా ప్రమోషన్లలో కనపడరు. సినిమా విడుదల సమయంలో ఒకటి రెండు కార్యక్రమాలకు మాత్రమే వస్తారు.
కానీ పెద్ది విషయంలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపించింది. సినిమా విడుదలకు ముందు నుంచే ప్రమోషన్లలో యాక్టివ్ గా పాల్గొన్నారు. రిలీజ్ తర్వాత కూడా బిజీబిజీగా గడుపుతున్నారు. దీంతో జగ్గూభాయ్ ఇంతగా ప్రమోషన్ల బాధ్యత తీసుకోవడానికి కారణమేంటనే చర్చ మొదలైంది. దీనికి ప్రధాన కారణం ఆయన పోషించిన అప్పలసూరి పాత్రేనని టాక్ వినిపిస్తోంది.
సినిమాలో ఆయన గుబురు గడ్డం, కొత్త మేకోవర్ తో గుర్తుపట్టలేని విధంగా కనిపించారు. కేవలం లుక్ మాత్రమే కాదు.. యాక్టింగ్ పరంగా కూడా ఆ రోల్ ఆయనకు స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిందని తెలుస్తోంది. లెజెండ్ తర్వాత ఎక్కువగా విలన్ పాత్రలు, సీరియస్ క్యారెక్టర్లు చేశానని జగపతిబాబు పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. కానీ పెద్దిలో మాత్రం ప్రేక్షకుల హృదయాలను తాకే ఎమోషన్స్ ఉన్న పాత్ర దొరికిందని వెల్లడించారు.
ఒక నటుడిగా తనలోని మరో యాంగిల్ చూపించే అవకాశం రోల్ ఇచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే ఆ పాత్రను ప్రేక్షకుల్లోకి మరింత గట్టిగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రమోషన్లలో పాల్గొంటున్నారని తెలుస్తోంది. మరోవైపు హీరో రామ్ చరణ్ పై ఉన్న ఒత్తిడిని తగ్గించాలనే ఆలోచన కూడా కనిపించింది. సినిమా కోసం చరణ్ ఎంతో కష్టపడ్డారని, షూటింగ్ సమయంలో గాయాలైనా వెనక్కి తగ్గకుండా పనిచేశారని జగపతిబాబు చెప్పారు.
విడుదల సమయానికి డబ్బింగ్, సెన్సార్, ఇతర పనులతో చరణ్ బిజీగా ఉండటంతో ప్రమోషన్ల బాధ్యతలో కొంత భాగాన్ని ఆయన తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. పెద్దన్నలా మూవీ టీమ్ కు అండగా నిలిచినట్లు తెలుస్తోంది. సినిమా విడుదల తర్వాత వచ్చిన కొన్ని నెగటివ్ కామెంట్లు, సోషల్ మీడియా ట్రోల్స్ పై కూడా జగపతిబాబు తనదైన శైలిలో స్పందించారు. విమర్శలకు భయపడకుండా సినిమా టీమ్ కు మద్దతుగా నిలబడ్డారు.
అవసరమైన ప్రతిసారి ఓపెన్ గానే మాట్లాడారు. సినిమాపై ఎక్కడైనా నెగిటివ్ క్యాంపెయిన్ జరిగినా, దానికి ఆన్సర్ చెప్పడంలో వెనుకడుగు వేయలేదు. అయితే అన్నింటికంటే ముఖ్యమైన కారణం వర్క్ పై ఆయనకున్న లవ్ అని చెప్పాలి. ఖాళీగా ఉండటం తనకు ఇష్టం ఉండదని, ప్రతిరోజూ ఏదో ఒక సినిమా పనిలో ఉండాలని అనిపిస్తుందని జగపతిబాబు గతంలో చెప్పిన మాటలు ఇప్పుడు గుర్తుకు వస్తున్నాయి.
ఇప్పుడు పెద్ది విజయం ఆయనలో మరింత జోష్ నింపింది. అందుకే వయసుతో సంబంధం లేకుండా అదే ఎనర్జీతో ప్రమోషన్లలో పాల్గొంటూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ఏదేమైనా పెద్ది ప్రమోషన్లలో జగపతిబాబు తీరు చూస్తే.. తనకు ఎంతో నచ్చిన అప్పలసూరి పాత్రపై ఉన్న ప్రేమ, చరణ్ తోపాటు టీమ్ కు అండగా నిలవాలనే బాధ్యత, వర్క్ పై డెడికేషన్.. ఆ మూడు కారణాలే ఆయనను సినిమాకు మెయిన్ పిల్లర్ మార్చాయని చెప్పాలి. అందుకే పెద్ది ప్రమోషన్లలో జగ్గూభాయ్ వన్ మ్యాన్ షో చేస్తున్నట్లు వినికిడి.