జాట్.. ఆడియన్స్ ఒప్పుకునేలా లేరే!
ఈ మధ్య సౌత్ సినిమాలకు బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. మాస్ ఎలిమెంట్స్ ఉంటే చాలు ఆ సినిమాకు నార్త్ ఆడియన్స్ పట్టం కట్టేస్తున్నారు.;
ఈ మధ్య సౌత్ సినిమాలకు బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. మాస్ ఎలిమెంట్స్ ఉంటే చాలు ఆ సినిమాకు నార్త్ ఆడియన్స్ పట్టం కట్టేస్తున్నారు. పుష్ప, కెజిఎఫ్, సలార్, పుష్ప2 లాంటి సినిమాలు నార్త్ లో కలెక్షన్ల వర్షం కురిపించడానికి కారణం అందులోని మాస్ ఎలిమెంట్సే. ఆ సినిమాలన్నీ నార్త్ లో బ్లాక్ బస్టర్ అవడమే కాకుండా ఆయా హీరోలకు అక్కడ మంచి క్రేజ్ ఏర్పడ్డానికి కారణమైంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఓ టాలీవుడ్ డైరెక్టర్ కొత్త ప్రయోగం చేశాడు. బాలీవుడ్ హీరోతో సౌత్ కథను చేసి ఆ సినిమాతో అక్కడ సెటిలైపోదామనుకున్నాడు. కానీ ఆ ప్రయోగం బెడిసికొట్టినట్టే అనిపిస్తుంది. ఇదంతా దేని గురించో ఈపాటికే అర్థమై ఉంటుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సన్నీ డియోల్ హీరోగా వచ్చిన జాట్ మూవీ గురించే. ఏప్రిల్ 10న రిలీజైన ఈ సినిమాకు నార్త్ నుంచి మిక్డ్స్ రివ్యూలు వస్తున్నాయి.
జాట్ మూవీ పేరుకే బాలీవుడ్ సినిమా కానీ సౌత్ సినిమాలో ఉండే ఎలిమెంట్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. హీరో ఎంట్రీకి స్క్రీన్ పై దుమ్ము లేవడం, హీరో కొట్టినప్పుడు విలన్ గ్యాంగ్ లోని వాళ్లు పడిపోవడం, స్లో మోషన్ షాట్స్ అన్నీ ఉన్నాయి. హీరో మాత్రమే నార్త్ అతను. మిగిలినవన్నీ సౌత్ సినిమాలో ఉండేవే. సౌత్ మూవీని హిందీలోకి అక్కడి హీరోతో డబ్బింగ్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది జాట్ మూవీ.
90స్ కాలంలోని యాక్షన్ మూవీని చూపించి నార్త్ ఆడియన్స్ ను ఆకట్టుకుందామని గోపీచంద్ చేసిన ప్రయత్నం విఫలమయ్యేలానే కనిపిస్తుంది. గదర్2 తర్వాత సన్నీ డియోల్ నుంచి వచ్చిన మూవీ కాబట్టి సినిమాకు మంచి హైప్ దక్కి, ఓపెనింగ్స్ వచ్చాయి కానీ జాట్ లో సూపర్ హిట్ కంటెంట్ ఉండటం వల్ల ఆ హైప్ రాలేదనేది నిజం. సినిమాలో ఎక్కడా కొత్తదనం కనిపించకపోవడంతో పాటూ మొత్తం సౌత్ ఫ్లేవరే ఉండటాన్ని బాలీవుడ్ ఆడియన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.
జాట్ లాంటి ఎన్నో సినిమాలను చూసిన నార్త్ ఆడియన్స్ కు ఈ సినిమా పెద్దగా నచ్చే ఛాన్స్ లేదు. నార్త్ ఆడియన్స్ కు మాస్, యాక్షన్ అంటే ఇష్టమని సినిమా మొత్తాన్ని అవే సీన్లతో నింపేస్తే సినిమా హిట్ అవుతుందని డైరెక్టర్ జాట్ ను తెరకెక్కించినట్టున్నాడు. సౌత్ సినిమాలను ఆదరిస్తున్నారు కదా అని ఎలా పడితే అలా సినిమాను తీసేస్తే ఆడియన్స్ వాటిని యాక్సెప్ట్ చేసే రోజులు కావు ఇవి. అసలు సినిమా ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నాం? ఎందుకు ఈ సినిమా తీశాం ఈ మూవీ వల్ల ఏంటి ఉపయోగమనే మినిమం విషయాలనైనా డైరెక్టర్ దృష్టిలో పెట్టుకుని ఉంటే బావుండేదని జాట్ గురించి నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఏ మాత్రం లాజిక్స్ లేకుండా తెరకెక్కిన జాట్ రూపంలో 90స్ లో లాంటి యాక్షన్ మూవీ చేయాలనే సన్నీ డియోల్ కోరికైతే తీరింది తప్పించి అది తప్ప ఈ మూవీ వల్ల ఎవరికీ ఏం ఉపయోగం లేదని ఆడియన్స్ చేస్తున్న కామెంట్స్ చూస్తుంటే అర్థమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో జాట్‌కు ఫైనల్ రిజల్ట్ ఏమొస్తుందో చూడాలి. ఈ సినిమాతో ఇటు డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో పాటూ అటు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కూడా బాలీవుడ్ డెబ్యూ ఇచ్చిన సంగతి తెలిసిందే. మరి వారి డెబ్యూ రిజల్ట్ ఏంటనేది మరికొన్ని రోజుల్లో తెలియనుంది.