ఇన్‌స్టాగ్రామ్ లీకులు కొత్త శాపం… సినిమా సీక్రెట్స్ సేఫ్ కావా?
ఈ లీకుల బాధ కేవలం చిన్న సినిమాలకే కాదు, ఇండస్ట్రీలోని టాప్ స్టార్స్‌కు కూడా తప్పడం లేదు.
ఒకప్పుడు సినిమా రిలీజ్ అయ్యాక పైరసీ రూపంలో ఇండస్ట్రీకి పెద్ద తలనొప్పి ఉండేది. కానీ ఇప్పుడు సోషల్ మీడియా విస్తృతి వల్ల సినిమా షూటింగ్ దశలోనే మేకర్స్‌కు గుండెనొప్పి మొదలవుతోంది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ పుణ్యమా అని హీరోల లుక్స్, కీలకమైన సీన్లు సెట్స్ నుంచే ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమవుతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, కెమెరా ఫోన్ల దెబ్బకు సినిమా రహస్యాలు కాస్తా బజార్న పడుతున్నాయి. తాజాగా పలు చిత్రాల లీకులు ఇండస్ట్రీని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.
మౌలి 'లిటిల్ హార్ట్' సినిమాకు లీకుల సెగ:
'లిటిల్ హార్ట్స్' సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన యంగ్ హీరో మౌలి, ప్రస్తుతం వైజాగ్‌లో తన కొత్త సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అయితే ఈ సినిమా టీమ్‌కు ఇన్‌స్టాగ్రామ్ పెద్ద షాక్ ఇచ్చింది. వైజాగ్ షెడ్యూల్‌కు సంబంధించిన షూటింగ్ దృశ్యాలు పెద్ద ఎత్తున లీక్ అయ్యాయి. ఇక అక్కడితో ఆగకుండా టాకీ సీన్లు, డ్యాన్స్ బిట్లు కూడా డజన్ల కొద్దీ వీడియోల రూపంలో నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.
సినిమా షూటింగ్ బిట్లు ఇన్‌స్టాగ్రామ్‌లోనే:
షూటింగ్ స్పాట్‌లో ఉన్న జనాలు దొంగచాటుగా తీసిన వీడియోల వల్ల, దాదాపు సినిమా కథ ఏంటో ముందే తెలిసిపోయేలా ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ లీకేజీలను అరికట్టడంలో చిత్ర బృందం పూర్తిగా విఫలమవ్వడం గమనార్హం. సినిమా అసలు ఫుటేజ్ కాకపోయినా, లొకేషన్ వీడియోలు ఇలా బయటకు రావడం వల్ల సినిమాపై ఉండాల్సిన సస్పెన్స్, కుతూహలం దెబ్బతింటున్నాయి.
పెద్ద సినిమాలకు తప్పని తలనొప్పి:
ఈ లీకుల బాధ కేవలం చిన్న సినిమాలకే కాదు, ఇండస్ట్రీలోని టాప్ స్టార్స్‌కు కూడా తప్పడం లేదు. కింగ్ నాగార్జున నటిస్తున్న మైల్‌స్టోన్ మూవీ 'కింగ్ 100' షూటింగ్ జరుగుతుండగా కొన్ని కీలకమైన సీన్లు లీక్ అయి గందరగోళం సృష్టించాయి. అలాగే రామ్ చరణ్, జాన్వీ కపూర్ కాంబినేషన్‌లో వస్తున్న 'పెద్ది' సినిమా షూటింగ్ స్పాట్ నుండి జాన్వీ కపూర్ లుక్స్, పిక్స్ లీక్ అవ్వడం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది.
ప్రభాస్ 'ఫౌజీ' చిత్ర యూనిట్ అలర్ట్:
రెబల్ స్టార్ ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్‌లో వస్తున్న భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ 'ఫౌజీ' కి కూడా ఈ లీకుల సెగ తగిలింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ లేదా కొన్ని కీలక సమాచారాలు ముందే లీక్ అవ్వడంతో చిత్రబృందం ఒక్కసారిగా అప్రమత్తమైంది. ఇక సెట్స్‌పై మరింత కఠినమైన నిబంధనలు విధిస్తూ, ఎవరూ ఫోన్లు వాడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీసే నిర్మాతలకు ఈ ఇన్‌స్టాగ్రామ్ లీకులు పెద్ద శాపంగా మారాయి. షూటింగ్ స్పాట్‌లో నో-ఫోన్ పాలసీ పెట్టినా, బౌన్సర్లను పెట్టినా ఈ లీకులను ఆపడం ఎవరితరం కావడం లేదు. ఇక సినిమాను థియేటర్లలో చూసి ఆనందించాలనే బాధ్యతను ప్రేక్షకులు కూడా గుర్తించనంత కాలం.. ఈ లీకుల సమస్యకు ముగింపు దొరకడం కష్టమే అనిపిస్తోంది. ఇక దీనిపై ఇండస్ట్రీ పెద్దలు కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.