పదికి సిద్ధం అవుతోన్న సీనియర్‌ స్టార్‌...!

2021లో ఇంద్రాన్స్‌ నటించిన హోమ్‌ సినిమాకు నేషనల్‌ అవార్డ్‌ దక్కింది. 2018లో ఆలోరుక్కం సినిమాలో చూపిన ప్రతిభకు గాను కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పురస్కారం దక్కించుకున్నాడు.;

Update: 2026-04-21 08:10 GMT

మలయాళ ప్రేక్షకులకు మాత్రమే కాకుండా సౌత్‌ ఇండియన్‌ భాషల ప్రేక్షకులందరికీ సుపరిచితుడు ఇంద్రాన్‌ అలియాస్ కే సురేంద్రన్‌. ఆరు పదుల వయసు దాటినప్పటికీ వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉండే ఇంద్రాన్‌ మరోసారి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఈసారి సినిమాలతో కాకుండా పరీక్షలకు సిద్ధం అవుతున్న కారణంగా వార్తల్లో నిలిచాడు. ఇటీవల ఇంద్రాన్‌ ఏడో తరగతి పరీక్ష రాయడం ద్వారా వార్తల్లో నిలిచాడు. ఇప్పుడు ఇంద్రాన్‌ పదవ తరగతి పరీక్షలకు సిద్ధం అవుతున్నట్లుగా మలయాళ మీడియాలో ప్రముఖంగా కథనాలు వస్తున్నాయి. ఏడు పదుల వయసులో ఇంద్రాన్‌ పదో తరగతి పరీక్షలు రాయబోతున్నాడు అంటూ ప్రముఖంగా వార్త కథనాలు వస్తున్నాయి. కేరళలో విద్యకు ఉన్న ప్రాధాన్యత ఏంటి అనేది ఇంద్రాన్‌ పట్టుదలను చూస్తే అర్థం చేసుకోవచ్చు అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.

68 ఏళ్ల వయసులో 7వ తరగతి పరీక్ష...

కేరళ ప్రభుత్వం వచ్చే ఏడాది నిర్వహించబోతున్న టెన్త్‌ పరీక్షలకు ఇంద్రాన్స్‌ రెడీ అవుతున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సమయంలో ఆయన తన పేరును మాత్రమే రాయగలడు. ఆ తర్వాత చాలా నేర్చుకున్నాడు. చదవడం, రాయడం ఇంతకు ముందే వచ్చిన కారణంగా ఏడో తరగతి పరీక్ష రాయాలని నిర్ణయించుకున్నాడు. 68 ఏళ్ల వయసులో కేరళ ప్రభుత్వం నిర్వహించే 7వ తరగతి పరీక్షకు హాజరు అయ్యాడు. ఆ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంతో అందరి దృష్టిని ఇంద్రాన్స్‌ తనవైపు తిప్పుకున్నాడు. అదే సమయంలో ఆయన పదవ తరగతి పరీక్షలు రాయాలనే నిర్ణయానికి వచ్చాడు. గత కొన్నాళ్లుగా ఇంద్రాన్స్‌ పరీక్షలకు సిద్ధం అవుతున్నాడట. ఒకవైపు నటనతో బిజీగా ఉన్నా మరో వైపు చదువుపై ఆసక్తితో ఈయన చదువుకుంటున్నాడు.

మలయాళ సినిమా ఇండస్ట్రీలో స్టార్‌ కమెడియన్‌..

నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఇంద్రాన్స్‌ నాల్గవ తరగతి వరకు చదివాడు. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి కారణంగా నాలుగో తరగతిలోనే చదువు ఆపేసిన ఇంద్రాన్స్‌ చిన్న వయసులోనే ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా మలయాళ సినిమాలకు వర్క్ చేసిన ఇంద్రాన్స్‌ నటుడిగా 1994 లో ఎంట్రీ ఇచ్చాడు. ఈయన కామెడీ టైమింగ్‌ బాగుండటంతో మలయాళంలో స్టార్‌ కమెడియన్‌ స్థాయికి చేరుకున్నాడు. తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమాలు చేశాడు. ఇప్పటి వరకు ఈయన అన్ని భాషల్లో కలిపి దాదాపుగా 550 సినిమాలు చేసి ఉంటాడు. 1981 లో కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. 13 ఏళ్ల తర్వాత సినిమాల్లో నటుడిగా కెరీర్‌ను ప్రారంభించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంద్రాన్స్‌ యాక్టింగ్‌ కెరీర్ కొనసాగుతూనే ఉంది. ఆయన నటుడిగా ఎన్నో అవార్డులు రివార్డ్‌లు దక్కించుకున్నాడు.

జాతీయ అవార్డ్‌ దక్కించుకున్న ఇంద్రాన్స్‌..

2021లో ఇంద్రాన్స్‌ నటించిన హోమ్‌ సినిమాకు నేషనల్‌ అవార్డ్‌ దక్కింది. 2018లో ఆలోరుక్కం సినిమాలో చూపిన ప్రతిభకు గాను కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పురస్కారం దక్కించుకున్నాడు. సింగపూర్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ 2019 లో ఉత్తమ నటుడిగానూ అవార్డ్‌ సొంతం చేసుకున్నాడు. నటుడిగా వందల సినిమాలు చేసినప్పటికీ, ఎన్నో అవార్డ్‌లు రివార్డ్‌లు అందుకున్నప్పటికీ 10వ తరగతి పూర్తి చేయలేదనే బాధ ఇంద్రాన్స్‌ ను తొలుస్తూ ఉండేదట. అందుకే వయసుతో సంబంధం లేకుండా 7వ తరగతి పరీక్ష పూర్తి చేసి ఇప్పుడు 10వ తరగతి పరీక్షలు రాసేందుకు గాను రెడీ అవుతున్నాడు. ఎంతో మందికి ఇంద్రాన్స్‌ ఆదర్శం అనడంలో సందేహం లేదు. కొందరు ఇప్పుడు ఈయన 10 పాస్ అయ్యి ఏం చేస్తాడు అంటూ సోషల్‌ మీడియాలో కామెంట్‌ చేస్తున్నారు. కానీ ఇంద్రాన్స్‌ ఎంతో మంది యువతతో పాటు, పెద్ద వారికి ఆదర్శంగా నిలుస్తూ, మనిషి తల్చుకుంటే ఏమైనా చేయగలడు అని నిరూపించబోతున్నాడు.

Tags:    

Similar News