బొడ్డు క్లీవేజ్ క‌నిపించేట్టు కాస్ట్యూమ్ వేసుకోను అన్నందుకు!

తెలుగు తెరపై తనదైన అందం అభినయంతో ఒక వెలుగు వెలిగిన నటి ఇంద్రజ కేవలం 14-15 ఏళ్ల వయసులోనే అంటే తొమ్మిదో తరగతి మధ్యలోనే సినీ రంగంలోకి అడుగుపెట్టారు.

Update: 2026-09-15 04:11 GMT

తెలుగు తెరపై తనదైన అందం అభినయంతో ఒక వెలుగు వెలిగిన నటి ఇంద్రజ కేవలం 14-15 ఏళ్ల వయసులోనే అంటే తొమ్మిదో తరగతి మధ్యలోనే సినీ రంగంలోకి అడుగుపెట్టారు. అప్పట్లో టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న స‌మ‌యంలోనే ఇతర హీరోయిన్లలాగే త‌ను కూడా గ్లామర్ కాస్ట్యూమ్స్ ధరించాల్సి వచ్చింది. అయితే కాలం మారుతున్న కొద్దీ ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది. ప‌రిణ‌తితో పాటు సిగ్గు కూడా పెరిగింది. గ

వయసు 19-20 సంవత్సరాలు దాటేసరికి కెమెరా ముందు గ్లామర్ దుస్తులు వేసుకోవడంపై త‌న‌లో లోలోపల ఒకరకమైన అసౌకర్యం మొదలైంది. బొడ్డు లేదా క్లీవేజ్ కనిపించేలా ఉండే దుస్తులు ధరించి నృత్యాలు చేయడం.. వందలాది మంది సిబ్బంది మధ్య నిలబడటం తీవ్రమైన సిగ్గును తెప్పించేదిట‌. ఎవరూ తనను ఉద్దేశపూర్వకంగా తప్పుగా చూడకపోయినా.. తన అంతరాత్మ మాత్రం ఆ రకమైన ప్రదర్శనను అస్సలు అంగీకరించలేకపోయింది.

ఈ కారణంగా తాను ఇక‌ గ్లామర్ పాత్రలకు పూర్తిగా స్వస్తి పలికి.. నిండుగా ఉండే సాంప్రదాయ దుస్తులనే ధరిస్తానని ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు ఖ‌రాకండిగా స్పష్టం చేశారు. అలా నిర్ణయించుకోవడం వల్ల తెలుగు చిత్ర పరిశ్రమలో ఆమెకు రావాల్సిన కొన్ని అవకాశాలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. గ్లామర్ పాత్రలకు నో చెప్పడం వల్ల కెరీర్ నెమ్మ‌దించినా కానీ.. తన వ్యక్తిగత విలువల విషయంలో ఎక్కడా రాజీ పడలేదు.

అయితే టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గిన ఆ క్లిష్ట సమయంలో ఈ ప్ర‌తిభావ‌నికి మలయాళ చిత్ర పరిశ్రమ ఒక సువర్ణావకాశాన్ని అందించింది. మలయాళంలో త‌న‌ను ఒక మహారాణిలా గౌరవించడమే కాకుండా.. ఒక్క ఇంచ్ కూడా గ్లామర్ లేకుండా కేవలం చీరలు, లంగా వోణీలు ధరించే అచ్చమైన హోమ్లీ పాత్రలనే ఇచ్చారు. తాను మనస్ఫూర్తిగా కోరుకున్న ఆ పద్ధతైన పాత్రలు మలయాళం, తమిళ పరిశ్రమల్లో దక్కడం తన సంకల్ప బలం, మానిఫెస్టేషన్ ఫలితమేనని ఈ సీనియ‌ర్ న‌టి ఓ ఇంట‌ర్వ్యూలో గర్వంగా చెప్పుకొచ్చారు.

2006లో వివాహం తర్వాత సినిమాలకు దూరమైన ఇంద్రజ.. సెలబ్రిటీ హోదాను పూర్తిగా పక్కన పెట్టి ఒక సాధారణ మధ్యతరగతి మహిళలా జీవితాన్ని గడుపుతున్నారు. ఇంట్లో పని మనుషులు లేకుండా ఇల్లు ఊడ్చడం.. అంట్లు తోమడం... మూడు పూటలా వంట చేసుకోవడం వంటి పనులను తానే స్వయంగా చేసుకుంటారు. టూ వీలర్‌పై బయటకు వెళ్లడం.. చుట్టూ చేరే తాత్కాలిక జనాన్ని నమ్మకుండా ప్రశాంతంగా జీవించడం ఈ న‌టి నైజం. గ్లామర్ హంగులకు లొంగకుండా తన పద్ధతులను నమ్ముకున్న ఇంద్రజ ప్రయాణం నేటితరానికి ఒక చక్కటి స్ఫూర్తి. ఇంద్ర‌జ చాలా గ్యాప్ త‌ర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్ట‌ర్ న‌టిగా కొన‌సాగుతున్నారు. తెలుగు బుల్లితెర జ‌డ్జిగాను కొన‌సాగుతూ అభిమానుల‌ను అల‌రిస్తున్నారు. అచ్చ తెలుగు అమ్మాయి ఆత్మ‌గౌర‌వం.. హ‌ద్దులు మీర‌ని త‌న ట్రెడిష‌న‌ల్ లుక్ నేటిత‌రానికి గొప్ప స్ఫూర్తి అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.

Tags:    

Similar News