వందల కోట్లు ఆర్జించిన ఆ నలుగురు స్టార్ల తండ్రులు ఏం చేసేవారో తెలుసా?
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అజేయుడిగా కొనసాగుతున్న మెగాస్టార్ చిరంజీవి ప్రయాణం కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు.
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్, వారసత్వం లేకుండా కేవలం తమ స్వయంకృషినే నమ్ముకుని పైకి వచ్చిన సినీతారలు ఎందరో ఉన్నారు. నేడు వెండితెరపై వందల కోట్ల పారితోషికాలు అందుకుంటూ కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఓ నలుగురు అగ్ర హీరోల తండ్రుల కథ నిజంగా ఆశ్చర్యపరుస్తుంది.
వారి తండ్రుల వెనుక ఉన్నది అత్యంత సాదాసీదా నేపథ్యం. ఒకరు క్యాంటీన్ ఓనర్, ఇద్దరు సాధారణ పోలీస్ కానిస్టేబుళ్లు, మరొకరు బస్సు డ్రైవర్.. ఇలా సామాన్య జీవితాన్ని గడిపిన తండ్రులకు వారసులు అయినా, గ్లామర్ రంగంలో ప్రవేశించి హీరోలుగా రాణిస్తూ.. నేడు దేశవ్యాప్తంగా అసాధారణ స్టార్‌డమ్‌తో దూసుకుపోతున్నారు.
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ఈరోజు వేల కోట్ల సామ్రాజ్యాన్ని విస్తరించారు. ఫోర్బ్స్ గుర్తించిన ప్రపంచ కుభేరుల జాబితాలో ఆయన ఉన్నాడు. అయితే ఖాన్ బాల్యం అత్యంత సాధారణంగా గడిచింది. ప్రముఖ సీనియర్ నటుడు పంకజ్ కపూర్ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (NSD) లో చదువుకునే రోజుల్లోని పాత జ్ఞాపకాలను ఒక ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో బ్రేక్స్ దొరికినప్పుడు పంకజ్, ఆయన స్నేహితులు అంతా కలిసి సమోసాలు తింటూ టీ కొడుతూ బ్యాక్‌స్టేజ్ వద్ద సమయం గడిపేవారట. అయితే వారికి ఆ సమోసాలను అందించింది మరెవరో కాదు.. అప్పుడు కేవలం పదేళ్ల వయసున్న బాలుడు షారుఖ్ ఖాన్ అని పంకజ్ కపూర్ సంచలన విషయాన్ని వెల్లడించారు. షారుఖ్ ఖాన్ తండ్రి ఆ సమయంలో అక్కడ ఒక క్యాంటీన్ నిర్వహించేవారని.. బాల్యంలో షారుఖ్ తన తండ్రికి క్యాంటీన్ పనిలో సహాయం చేస్తూ జీవనోపాధి పొందేవారని చెప్పుకొచ్చారు.
ఇక ఇండియన్ సినిమా హిస్టరీలోనే తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ (తలైవా) నటుడు కాకముందు ఒక సాధారణ బస్సు కండక్టర్‌గా పనిచేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆయన తండ్రి రామోజీరావ్ గైక్వాడ్ ఆ రోజుల్లో ఒక పోలీస్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించేవారు. ఆ కానిస్టేబుల్ ఉద్యోగంలో వచ్చే చాలీచాలనీ జీతంతోనే ఆయన ఎన్నో ఆర్థిక ఇబ్బందుల మధ్య తన కుటుంబాన్ని వెళ్లదీసేవారు. అటువంటి కఠిన పరిస్థితుల నుండి వచ్చిన రజనీకాంత్ చిత్ర పరిశ్రమలో అసాధారణ స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుని రారాజుగా వెలుగుతున్నారు.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అజేయుడిగా కొనసాగుతున్న మెగాస్టార్ చిరంజీవి ప్రయాణం కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. చిరంజీవి తండ్రి కొణిదెల వెంకట్రావు ఒక సాధారణ పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేశారు. ఎలాంటి సినీ నేపథ్యం లేకపోయినా మెగాస్టార్ కేవలం తన స్వయంకృషిని, ప్రతిభను నమ్ముకుని ఇంతింతై వటుడింతై అన్న చందంగా టాలీవుడ్‌లో అగ్రస్థానానికి ఎదిగారు. చిరంజీవి పూర్వీకుల నేపథ్యం పరిశీలిస్తే.. ఆయన తాతగారు కొణిదెల వెంకటరత్నం పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు గ్రామానికి చెందిన ఒక సాధారణ వ్యవసాయ కుటుంబానికి చెందినవారు. ఆ పల్లెటూరి వాతావరణం, తండ్రి కానిస్టేబుల్ ఉద్యోగ నేపథ్యం నుండి వచ్చిన చిరంజీవి కమర్షియల్ హీరోగా టాలీవుడ్ చరిత్రను తిరగరాశారు.
`కేజీఎఫ్` (KGF) ఫ్రాంచైజీతో అంతర్జాతీయ స్థాయిలో సంచలనాలు సృష్టించిన కన్నడ సూపర్ స్టార్ యశ్ కుటుంబ నేపథ్యం కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. యశ్ తండ్రి అరుణ్ కుమార్ మొదట్లోకే.ఎస్.ఆర్.టి.సి (కర్ణాటక స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్) లో ఆ తర్వాత బీఎంటీసీ (బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్) లో ఒక సాధారణ బస్సు డ్రైవర్‌గా పనిచేశారు. అలాంటి సాధారణ డ్రైవర్ కొడుకుగా ప్రస్థానం ప్రారంభించిన యశ్.... నేడు వందల కోట్ల పారితోషికాలు, ప్యాకేజీలు అందుకునే రేంజ్‌కు ఎదిగాడు. రాకింగ్ స్టార్ కేవలం కఠోర శ్రమను నమ్ముకున్న నటుడిగానే కాకుండా... సినిమాల్లో తెలివైన పెట్టుబడులు పెడుతూ... బాక్సాఫీస్ వద్ద మైండ్ గేమ్ ఆడే సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్‌గా కూడా తనను తాను నిరూపించుకుంటున్నారు.