ప్రేక్షకులను ఆకర్షించడానికి కల్చర్ గిమ్మిక్కు?
దర్శకరచయితలు ఇలాంటి సన్నివేశాలను సృష్టించినప్పుడు అవి కచ్ఛితంగా ప్రజల్లో ఉద్వేగాన్ని రేకెత్తిస్తాయి.;
భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను వెండి తెరపై ఆవిష్కరిస్తే దానిని ప్రజలు ఎప్పుడూ హర్షిస్తారు. ప్రజలు ఎప్పుడూ తమ సంస్కృతికి కనెక్ట్ అయి ఉంటారు. స్థానికంగా గ్రామాల్లో జరిగే అమ్మవారి జాతరలు కావొచ్చు.. పూర్వీకుల ఆచారాలతో ముడిపడిన సమకాలీన అంశాలు కావొచ్చు.. లేదా మహిళల సెంటిమెంట్ కథలు కావొచ్చు.. భాష-వేషధారణలు, వ్యవహార శైలి ప్రతిదీ ప్రజల్లో భావోద్వేగాల్ని సృష్టించే పరిభాషగా చూడాలి. దర్శకరచయితలు ఇలాంటి సన్నివేశాలను సృష్టించినప్పుడు అవి కచ్ఛితంగా ప్రజల్లో ఉద్వేగాన్ని రేకెత్తిస్తాయి.
పరిమిత బడ్జెట్ తో తెరకెక్కి పాన్ ఇండియాలో సంచలన విజయం సాధించిన కాంతార దీనికి పెద్ద ఉదాహరణ. కర్నాటకలోని ఒక ప్రాంతం జానపద కథను అద్భుతంగా తెరపైకి తేవడంలో దర్శక రచయితలు, హీరో సక్సెసయ్యారు. గ్రామీణ వాతావరణంలో ప్రజల నమ్మకాలు, దేవతలు ప్రార్థనలు ప్రతిదీ ప్రజలకు కనెక్టయ్యాయి. పురాతన కాలం నుంచి ప్రజలకు తెలిసిన కథనే వారు తెరపై అందంగా చూపించారు.
అయితే పుష్ప 2లో గంధపు చెక్కల స్మగ్లర్, ఒక మాస్ హీరోని అమ్మవారు పూనడం, అతడు కూతురు సెంటిమెంటుతో రగిలిపోవడం వగైరా వగైరా సన్నివేశాలపై కొన్ని విమర్శలు ఉన్నాకానీ.. ఆయా సన్నివేశాలు అడవి బిడ్డలకు కనెక్టివిటీ ఎలిమెంట్ అని అర్థం చేసుకున్నారు. అడవిలో గిరిజనులు గంగమ్మ జాతరకు ఇచ్చే ప్రాధాన్యత ఎంతో గొప్పది. జాతరలో అమ్మవారి పూనకాన్ని ప్రత్యక్షంగా చూసిన వారికి ఆ విషయం అవగతమవుతుంది. సన్నివేశాన్ని కొంత అతిశయోక్తిగా చూపించినా కానీ, అది వాస్తవికతతో కూడుకున్న ప్రతిబింబంగా కనిపించింది. అందుకే ప్రజలకు అది బాగా కనెక్టయింది. తెలుగు సంస్కృతిలో పల్లె పట్టు సంస్కృతిలో అమ్మవారి జాతరలకు చాలా ప్రాధాన్య ఉండటం మాస్ కి కనెక్టింగ్ ఎలిమెంట్.
ఇటీవల `కేసరి 2` లో అక్షయ్ కుమార్ కథకళి గెటప్‌లో కనిపించారు. కేరళ సంస్కృతిలో కథకళి ఒక భాగం. కానీ శంకర్ నారాయణన్ పాత్రకు కథకళితో సంబంధం ఏమిటి? అతడి జీవితకథలో అలాంటి ఆధారాలేవీ లేవు కదా! అని విమర్శలు వచ్చాయి. కానీ కథకళి గెటప్ లో అక్షయ్ ప్రయత్నాన్ని అభినందించని వారు లేరు. పుష్ప 2లో గంగమ్మ జాతరలో అమ్మవారి గెటప్ మాస్ ని ఆకర్షించినంతగా అక్షయ్ కథకళి గెటప్ ఆకర్షించకపోవడానికి వాస్తవికత లేకపోవడం ఒక కారణం. కొన్నిసార్లు సన్నివేశాన్ని ప్రజలకు కనెక్ట్ చేయడానికి ఫిక్షనల్ గా ఇలాంటివి సృష్టించడం సృజనాత్మక స్వేచ్ఛగా భావించాలి. దీనికి మేకర్స్ ని నిందించాల్సిన పని లేదు. సినిమా అనేది ఫక్తు వ్యాపారం. దీనికి మార్కెటింగ్ జిమ్మిక్కులు అవసరం. అందుకే కేసరి 2లో ఇలాంటి ఒక సన్నివేశాన్ని దర్శకుడు జోడించారు. అయితే ఆ సన్నివేశాన్ని సందర్భానికి తగ్గట్టుగా అతికేలా రూపొందించడంలో విఫలమైతే ఇబ్బంది ఎదురవుతుంది. మునుముందు సంస్కృతి సాంప్రదాయాలను మరింతగా ఎలివేట్ చేసే సినిమాలను దర్శకరచయితలు రూపొందించాల్సి ఉంది.