దీపికా పదుకొణేపై కొంప ముంచిన జోక్!
ఓ ఇంటర్వ్యూలో ఇంతియాజ్ అలీ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారడంతో ఆయన స్పందించి వివరణ ఇవ్వాల్సి వచ్చింది.
సెలబ్రిటీల మధ్య ఉండే సంబంధాలు.. వారు ఒకరిపై ఒకరు చేసే వ్యాఖ్యలు తరచూ వార్తల్లో నిలుస్తుంటాయి. కొన్నిసార్లు సరదాగా అన్న మాటలు కూడా మీడియాలో వివాదాలుగా మారుతుంటాయి. ఇటీవల ప్రముఖ దర్శకుడు ఇంతియాజ్ అలీ- స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె విషయంలో కూడా ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. ఓ ఇంటర్వ్యూలో ఇంతియాజ్ అలీ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారడంతో ఆయన స్పందించి వివరణ ఇవ్వాల్సి వచ్చింది.
విషయంలోకి వెళ్తే.. 2012లో రిలీజ్ అయిన `కాక్‌టైల్` సినిమాలో దీపికా పదుకొణె పోషించిన వెరోనికా పాత్ర గురించి ఇంతియాజ్ అలీ ఆ సమయంలో దీపికకు సమాజంలో సాఫ్ట్ లేదా మంచి అమ్మాయి అనే ఇమేజ్ ఉండేదని.. కానీ తనతో కలిసి పార్టీల్లో పాల్గొన్నప్పుడు ఆమెలోని అసలైన అల్లరి కోణాన్ని తాను చూశానని పేర్కొన్నారు. బయటకు కనిపించే దీపిక ఇమేజ్ ఒక ముసుగు మాత్రమేనని, ప్రస్తుతం ప్రేక్షకులు కూడా ఆమెలోని విభిన్న కోణాలను అర్థం చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలను కొన్ని మీడియా సంస్థలు వివాదంగా చిత్రీకరించాయి.
ఇంతియాజ్ అలీ నేరుగా దీపికా పదుకొణె వ్యక్తిత్వాన్ని విమర్శించారనే కోణంలో వార్తా కథనాలు వెలువడ్డాయి. ఇంటర్నెట్ వేదికగా విషయంపై భిన్నమైన చర్చలు ప్రారంభమవడంతో? వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయనే ప్రచారం జోరందుకుంది. దర్శకుడు ఉద్దేశ పూర్వకంగానే దీపికను తక్కువ చేసి మాట్లాడారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ ప్రచారంపై ఇంతియాజ్ అలీ త్వరితగతిన స్పందించారు. దీపికతో తనకున్న స్నేహబంధాన్ని గౌరవిస్తూ సోషల్ మీడియా వేదికగా సుదీర్ఘమైన భావోద్వేగ లేఖను పంచుకున్నారు.
దీపిక ప్రియమైన స్నేహితురాలిగా సంబోధిస్త, తాను సరదా కోసమే ఆ వ్యాఖ్యలు చేశానని స్పష్టం చేశారు. తన మాటలను దీపిక తప్పుగా అర్థం చేసుకోదని తనకు తెలుసని కానీ ఇతరులు చెప్పిన దాన్ని బట్టి ఆమె ఎక్కడ బాధపడుతుందోననే ఉద్దేశంతోనే ఈ వివరణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంతియాజ్ అలీ- దీపికా పదుకొణె మధ్య మంచి అనుబంధం ఉంది. గతంలో ఇద్దరి కలయికలో రిలీజ్ అయిన `లవ్ ఆజ్ కల్`, `తమాషా` వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.
ఈ సుదీర్ఘ ప్రయాణంలో వారి మధ్య ఏర్పడిన పరస్పర గౌరవం, నమ్మకం వల్లే ఇంతియాజ్ అంతటి చొరవతో వివరణను బహిరంగంగా పంచుకోగలిగారు. ప్రస్తుత కాలంలో సెలబ్రిటీల చిన్న మాట కూడా పెద్ద వివాదానికి దారితీసే అవకాశం ఉన్నందున పరస్పర అవగాహనతో పరిష్కరించుకోవడం ముఖ్యం. ఇంతియాజ్ అలీ తీసుకున్న నిర్ణయం వారి మధ్య ఉన్న పరిణతి చెందిన స్నేహానికి అద్దం పడుతోంది. మీడియా సృష్టించే హడావుడికి లోనుకాకుండా బంధాన్ని కాపాడుకోవడంలో సెలబ్రిటీలు చూపే ఇలాంటలి చొరవ అభినందనీయం.