'డూడ్' మేకర్స్‌పై ఇళయరాజా విక్టరీ
ప్రదీప్ రంగరాజన్ కథానాయకుడిగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన `డూడ్` ఇటీవలి బ్లాక్ బస్టర్ హిట్స్ లో ఒకటి.;
ప్రదీప్ రంగరాజన్ కథానాయకుడిగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన `డూడ్` ఇటీవలి బ్లాక్ బస్టర్ హిట్స్ లో ఒకటి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 100కోట్లు వసూలు చేయడం ఒక సంచలనం. ప్రదీప్ రంగరాజన్ అజేయమైన కెరీర్ లో డూడ్ ఒక మెరుపు. అయితే ఈ సినిమా కోసం ఉపయోగించిన ఓ రెండు ట్యూన్లు కాపీ క్యాట్ ట్యూన్లు అంటూ ఇళయరాజా కోర్టుకు ఎక్కారు. తన ఓల్డ్ క్లాసిక్స్ నుంచి ట్యూన్లు కాపీ కొట్టారని ఇళయరాజా వాదించారు.
ఇటీవల కొంత కాలంగా ఇళయరాజా వర్సెస్ మైత్రి మూవీ మేకర్స్ కోర్ట్ ఫైట్ గురించి తెలిసిందే. కోర్టు విచారణలో తొలుత ఇళయరాజాను న్యాయమూర్తి ప్రశ్నిస్తూ.. 30ఏళ్ల క్రితం వచ్చిన పాటలను ఇప్పటి ప్రజలకు మళ్లీ వినిపిస్తే తప్పేంటి? అని అడిగారు. దానికి సమాధానంగా, కాపీ రైట్స్ లేకుండా, అనుమతి లేకుండా ఈ పాటలను ఉపయోగించారని ఇళయరాజా లాయర్ వాదించారు. సోని నుంచి ఈ పాటల హక్కులను పొందామని మైత్రి అంటోంది. కానీ మైత్రి సంస్థకు ఎలాంటి హక్కులు దఖలు పడలేదని ఇళయరాజా లాయర్ వాదించారు.
అయితే అన్ని వాదోపవాదాలు విన్న తర్వాత అంతిమంగా జడ్జి ఒక తీర్పును వెలువరించారు. ఈ తీర్పు మైత్రి మూవీ మేకర్స్ కి ఊహించని షాక్. కాపీరైట్ పోరాటంలో ఇళయరాజాకు అనుకూలంగా మద్రాస్ హైకోర్టు తీర్పు వెలువరించింది. `డ్యూడ్` సినిమా నుండి రెండు పాటలను వెంటనే తొలగించాలని ఆదేశించింది. నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ 7 రోజుల సమయం కోరినా దానిని కూడా కోర్టు తిరస్కరించింది. తీర్పు అనంతరం కోర్టు కేసు తదుపరి విచారణను జనవరి 7కి వాయిదా వేసింది. పాత పాటలను స్ఫూర్తిగా తీసుకున్నా కానీ, పాటల `పవిత్రత` దెబ్బతింటుందని కోర్టు తన ఉత్తర్వులో కారణాన్ని కూడా పేర్కొంది.
ఇళయరాజా అనుమతి లేకుండానే కార్తు మచాన్ (పుదు నెల్లు పుదు నాతు) , 100 వరుషం ఇందా మాప్పిలైక్కు పాటలను సినిమాలో ఉపయోగించుకున్నారనేది ప్రధాన అభియోగం. పాటలను ఇష్టానుసారం మార్చేసి కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించారని ఇళయరాజా న్యాయవాది వాదించారు. చివరికి ఈ పోరాటంలో ఇళయరాజా పంతం నెగ్గింది.ఆ రెండు పాటలను తక్షణమే తొలగించాలని డ్యూడ్ నిర్మాతలను కోర్టు ఆదేశించింది.
కీర్తిశ్వరన్ దర్శకత్వం వహించిన డ్యూడ్ అక్టోబర్ 17న సినిమాల్లో విడుదలైంది. ఈ చిత్రం అగన్ (ప్రదీప్), కురల్ (మమిత) ప్రేమ కథను చెబుతుంది. ఈ చిత్రం నవంబర్ 14 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో తమిళం, తెలుగు, హిందీ, కన్నడ , మలయాళ భాషలలో ఇంగ్లీష్ సబ్‌టైటిళ్లతో పాటు ప్రసారం కానుంది.