ఇళయరాజా నోటీసులపై మైత్రీ నిర్మాత క్లారిటీ.. ఏమన్నారంటే..

అజిత్ కుమార్ హీరోగా రూపొందిన తమిళ చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ ఇటీవల థియేటర్లలో విడుదలై మంచి వసూళ్లు రాబడుతోంది.;

Update: 2025-04-16 05:17 GMT

అజిత్ కుమార్ హీరోగా రూపొందిన తమిళ చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ ఇటీవల థియేటర్లలో విడుదలై మంచి వసూళ్లు రాబడుతోంది. ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పైన మిక్స్ డ్ టాక్ వచ్చినా, అజిత్ అభిమానుల నుండి భారీ స్పందన లభిస్తోంది. అయితే సినిమా హిట్ అవుతోందన్న వార్తల మధ్య ఓ వివాదం తెరపైకి వచ్చింది. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా.. ఈ సినిమాలో తన పాటలు అనుమతి లేకుండా వాడినందుకు నోటీసులు జారీ చేశారు.

ఇళయరాజా ఆరోపణల ప్రకారం, ఈ చిత్రంలో తను కంపోజ్ చేసిన మూడు పాటలను అనుమతి లేకుండా వాడటం తప్పు అని పేర్కొన్నారు. తన మ్యూజికల్ క్రియేషన్స్ ను అనుమతి లేకుండా, వికృతీకరించి వాడటమని, ఇది తన కాపీరైట్ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని లీగల్ నోటీసులో వివరించారు. అంతేకాదు, తగిన నష్టపరిహారం చెల్లించాలని, సదరు పాటల వినియోగాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ స్పందించారు. ప్రొడ్యూసర్ నవీన్ మాట్లాడుతూ.. “మేము గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో వాడిన పాటల కోసం అవసరమైన మ్యూజిక్ లేబల్స్ నుండి అధికారిక అనుమతులు తీసుకున్నాం. ఆ పాటల ఆడియో రైట్స్ మేము లేబల్స్ నుండి పొందాం. మేము అనుకున్న అన్ని నిబంధనలు పాటించాం. ఎలాంటి చట్ట విరుద్ధ చర్య మేము చేయలేదు. అన్ని అవసరమైన ఎన్ఓసీలను (NOCs) సేకరించాం,” అని స్పష్టం చేశారు.

ఇళయరాజా మాత్రం తన సాంగ్స్ ను ఎవరు ఎలా వాడినా, తన అనుమతి తప్పనిసరి అనే స్థానం నుంచి మాట్లాడుతున్నారు. గతంలో కూడా పలు సందర్భాల్లో మ్యూజిక్ షోలు, పబ్లిక్ స్టేజీలపై తాను కంపోజ్ చేసిన పాటలు వాడినప్పుడల్లా నోటీసులు పంపిన రికార్డు ఉంది. ఆయన తన సంగీతానికి గౌరవం, ప్రాముఖ్యత ఎంత ఉందో చాటేలా ఈ లీగల్ యాక్షన్లు చూపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ లేబల్స్ కంపోజర్ మధ్య సంబంధాలపై స్పష్టత రావాల్సి ఉంది.

ఇక ఈ వివాదం సినిమాపై ఎంత ప్రభావం చూపుతుందో చూడాలి. అభిమానులు మాత్రం ఈ సాంగ్స్ వినిపించినప్పటి నుంచే థియేటర్లలో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. మరి లీగల్ విషయాలు ఎలా పరిష్కారమవుతాయో వేచి చూడాలి. మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పటికే తమ వైపు నుంచి క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో, ఇళయరాజా తదుపరి స్పందన ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News