ఇళయరాజాకు భారతరత్న ఇవ్వాలి
తనవైన అద్భుత స్వరాలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియులను అలరించిన లెజెండరీ సంగీత దర్శకుడు ఇళయరాజా.;
తనవైన అద్భుత స్వరాలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియులను అలరించిన లెజెండరీ సంగీత దర్శకుడు ఇళయరాజా. 7000 పైగా పాటలకు సంగీతం అందించిన మ్యాస్ట్రో ఇళయరాజా 1000 పైగా సినిమాలకు పని చేసారు. దశాబ్ధాలుగా ఆయన స్వరపరిచిన సినిమా పాటలు ప్రజల్ని అలరిస్తూనే ఉన్నాయి. భాషతో సంబంధం లేకుండా సరిహద్దులు దాటి ఆయన సంగీతం ఆదరణ దక్కించుకుంది. వేలాది పాటలకు ఆయన స్వరాలు జీవం పోసాయి.
అందుకే ఒక అభిమానిగా, ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే స్టాలిన్ నేరుగా స్వరమాంత్రికుడు ఇళయరాజాకు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఇళయరాజా పేరుతో ఒక సంగీత పురస్కారాన్ని ఏర్పాటు చేసి ప్రతిభావంతులైన సంగీత కారులను ప్రతియేటా సత్కరిస్తామని వెల్లడించారు. ఇళయరాజా 50 ఏళ్ల సినీప్రయాణాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ప్రభుత్వ సన్మాన సభలో సీఎం స్టాలిన్ చేసిన ఈ ప్రకటన సముచితమైనదని ప్రశంసలు కురుస్తున్నాయి. ఒక లెజెండరీ సంగీత దర్శకుడికి ఇలాంటి గౌరవం దక్కాలని ఆయన అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
సంగీతం ఆయనకు జీవితం.. జీవితంలోని భావోద్వేగాలను మేల్కొలిపే శక్తి ఆయన పాటలకు ఉంది. భారతరత్నకు ఆయన అర్హుడు అని కూడా అభిమానులు కొనియాడుతున్నారు. ఈ వేడుకలో ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, మంత్రి స్వామినాథన్, లెజెండరీ నటులు రజనీకాంత్, కమల్ హాసన్ కూడా పాల్గొన్నారు. వేదికపై ఇళయరాజాను కమల్ హాసన్ అన్నా అని పిలవడం వారి మధ్య అనుబంధాన్ని ఆవిష్కరించింది. కమల్ హాసన్ సినిమాల కోసం ఇళయరాజా అదనంగా శ్రమిస్తారని సూపర్ స్టార్ రజనీకాంత్ సరదాగా వ్యాఖ్యానించడం అహూతులను నవ్వించింది. ఈ కార్యక్రమంలో ఇళయరాజా ఘనతను సినీరాజకీయ ప్రముఖులు కొనియాడారు.
మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఇళయరాజాకు ఇళయజ్ఞాని (సంగీత పండితుడు) అనే బిరుదును ఎలా ఇచ్చారో కమల్ హాసన్ ఈ వేదికపై రివీల్ చేయడం విశేషం. ఇళయరాజా కారణంగా తమిళుల స్వరం ప్రపంచవ్యాప్తంగా వినిపించిందని ప్రముఖులు రాజాను ప్రశంసించారు