'ఐకాన్' మూవీ సంగతేంటి? కచ్చితంగా ఉంటుందా?
'ఐకాన్' ప్రాజెక్ట్ గుర్తుందా? అల్లు అర్జున్ హీరోగా ఆ సినిమాను వేణు శ్రీరామ్ తెరకెక్కించాలని అనుకున్నారు.;
'ఐకాన్' ప్రాజెక్ట్ గుర్తుందా? అల్లు అర్జున్ హీరోగా ఆ సినిమాను వేణు శ్రీరామ్ తెరకెక్కించాలని అనుకున్నారు. స్క్రిప్ట్ వర్క్ కూడా చేశారు. భారీ బడ్జెట్ తో దిల్ రాజు సినిమాను నిర్మించేందుకు సిద్ధమయ్యారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా నిర్వహించారు. కానీ ఆ సినిమా మాత్రం ఇప్పటికీ పట్టాలెక్కలేదు. ఎలాంటి అప్డేట్ కూడా లేదు.
ముఖ్యంగా.. వేణు శ్రీరామ్ వకీల్ సాబ్ కోసం పవన్ కళ్యాణ్ నుంచి కాల్ రావడంతో అటు వెళ్లిపోయారు. ఆ తర్వాత ఐకాన్ మూవీ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ ఈ లోపు సుకుమార్ తో పుష్ప సిరీస్ చిత్రాలకు గాను బన్నీ బిజీ అయిపోయారు. ఇప్పుడు అట్లీతో భారీ బడ్జెట్ తో రానున్న పాన్ ఇండియా మూవీకి గాను వర్క్ చేస్తున్నారు.
మరోవైపు, వేణు శ్రీరామ్.. ఇప్పుడు యంగ్ హీరో నితిన్ తో తమ్ముడు మూవీ చేశారు. దిల్ రాజు నిర్మించిన ఆ సినిమా.. జులై 4వ తేదీన వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. అయితే ఐకాన్ కథతోనే తమ్ముడు తెరకెక్కించారనే సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగింది. ఆ విషయంపై ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో వేణు శ్రీ రామ్ రెస్పాండ్ అయ్యారు.
వకీల్ సాబ్ తర్వాత తాను ఐకాన్ స్క్రిప్టుపై వర్క్ చేశానని తెలిపారు. ఆ తర్వాత తమ్ముడు కథ రాశానని అన్నారు. ఆ స్టోరీని కొందరు హీరోలకు చెబితే.. నటించేందుకు నో చెప్పారని, నితిన్ మాత్రం కథను అర్థం చేసుకుని పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని పేర్కొన్నారు. స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుందని, ఐకాన్- తమ్ముడు వేర్వేరు కథలుగా చెప్పారు.
దీంతో రూమర్స్ కు చెక్ పెట్టినట్టైంది. అదే సమయంలో ఐకాన్ స్క్రిప్ట్ ఇంకా అలాగే ఉందని.. వదిలేయలేదని క్లియర్ గా తెలుస్తోంది. ఐకాన్‌లో ప్రధాన పాత్ర పోషించడానికి సరైన నటుడి కోసం నిర్మాణ సంస్థ వెతుకుతోందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఆ తర్వాత మళ్ళీ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేస్తారని ఇప్పుడు టాక్ వినిపిస్తోంది.
అయితే ఐకాన్ టైటిల్ ను దిల్ రాజు ఎప్పుడో రిజిస్టర్ చేసుకోగా.. దాన్ని ఇప్పుడు అల్లు అర్జున్ మూవీ కోసం అట్లీ యూజ్ చేస్తారని కొద్ది రోజులుగా ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ ఇప్పుడు వేణు శ్రీరామ్ ఆన్సర్ తో అవి కూడా రూమర్సేనని అర్థమవుతోంది. మరి ఐకాన్ లో ఎవరు నటిస్తారో.. సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో అంతా వేచి చూడాలి.