ఐబొమ్మ: ఇండస్ట్రీకి మళ్ళీ తలనొప్పేనా?
దాంతో ఇండస్ట్రీ కాస్త ఊపిరి పీల్చుకుంది. పైరసీ భూతం వదిలిందని చిన్న నిర్మాతలు సంబరపడ్డారు.
ఐబొమ్మ పేరు వినగానే తెలుగు నిర్మాతలకు గుండె ఆగినంత పనవుతుంది. రిలీజ్ రోజే HD ప్రింట్ తో సినిమాలు అప్‌లోడ్ చేసి థియేట్రికల్ రన్ ని దెబ్బకొట్టిన సైట్ అది. చిన్న సినిమాల నుంచి స్టార్ హీరోల మూవీస్ వరకు ఏదీ వదలకుండా ఫ్రీగా పంచేసింది. ఇటీవల ఆ సైట్ ని నడిపిస్తున్నాడనే ఆరోపణలతో రవి అనే వ్యక్తిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సైట్‌ని పూర్తిగా మూసేశామని, ఇక ఐబొమ్మ కథ క్లోజ్ అని అధికారికంగా ప్రకటన కూడా వచ్చింది.
దాంతో ఇండస్ట్రీ కాస్త ఊపిరి పీల్చుకుంది. పైరసీ భూతం వదిలిందని చిన్న నిర్మాతలు సంబరపడ్డారు. కానీ ఆ ఆనందం రెండు నెలలు కూడా నిలవలేదు. ఎందుకంటే ఇప్పుడు అదే ఐబొమ్మ మళ్లీ ప్రత్యక్షమైంది. కొత్త డొమైన్ తో, కొత్త లుక్‌తో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ‘Movies New Bappam TV’ అనే పేరుతో రివ్యూ సైట్ ముసుగు వేసుకున్నా, లోపల మాత్రం పాత పైరసీ కథే నడుస్తోంది. లేటెస్ట్ సినిమాలు కూడా అప్‌లోడ్ అవుతున్నాయనే టాక్ గట్టిగా వినిపిస్తోంది.
అరెస్ట్ అయిన రవి బెయిల్‌పై బయటికి వచ్చి మళ్లీ స్టార్ట్ చేశాడా లేక అతని టీమ్‌లోని వేరే వాళ్లు రీ లాంచ్ చేశారా అనేది ఇంకా క్లారిటీ లేదు. అసలు ఐబొమ్మ ఎందుకు అంత ఫాస్ట్‌గా జనాలకు దగ్గరైందంటే.. 300MB సైజ్‌లో క్లియర్ HD ప్రింట్, డైరెక్ట్ డౌన్‌లోడ్ లింక్, తక్కువ యాడ్స్. టెక్నాలజీ పెద్దగా తెలియని వాళ్లు కూడా ఈజీగా సినిమా చూసేలా సింపుల్ ఇంటర్‌ఫేస్ ఉండేది.
దీంతో లీగల్ OTTలు నాలుగు వారాలు వెయిట్ చేయిస్తే, ఐబొమ్మ మాత్రం ఫస్ట్ డేనే ఫ్రీగా ఇచ్చేసింది. ఈ లెక్కన చిన్న సినిమాల కలెక్షన్స్ 40% వరకు పైరసీ తినేస్తుందని ట్రేడ్ వర్గాల లెక్క. పోలీసులు ఒక డొమైన్ బ్లాక్ చేస్తే మరో పది డొమైన్‌లు రెడీగా ఉంటాయి. సర్వర్లు విదేశాల్లో ఉండటంతో పూర్తిగా కంట్రోల్ చేయడం కష్టం అవుతోంది. పైగా టెలిగ్రామ్, VPN ద్వారా లింకులు ఈజీగా షేర్ అవుతున్నాయి.
అందుకే ఒక్కరిని అరెస్ట్ చేసినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదని మరోసారి ప్రూవ్ అయింది. పోలీసు వ్యవస్థ ఎంత సీరియస్ గా యాక్షన్ లోకి దిగుతున్నా లెక్క మారడం లేదు. ఎన్నిసార్లు పట్టుకున్నా దొంగలు దొంగలే అన్నట్లుగా మారిపోయింది. ఇక చివరికి నష్టపోయేది మాత్రం నిర్మాత. ఐబొమ్మ రీ ఎంట్రీ ఇచ్చిన తరువాత మళ్ళీ హాట్ టాపిక్ గా మారింది. ఏదేమైనా పైరసీని చట్టంతో పాటు ఆడియన్స్ మైండ్‌సెట్ మార్చి కూడా ఆపాలి. థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌కు ఉన్న విలువ, ఒక సినిమా వెనుక వందలాది మంది కష్టం ఉందనే స్పృహ జనాల్లోకి రానంతవరకు ఏదో ఒక రూపంలో ఐబొమ్మ బతికే ఉంటుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.