ఇండియన్ సినిమాకు క్యాపిటల్ హైదరాబాద్!: తెలంగాణ సర్కార్

ఈ మేరకు ఇటీవల చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధిపై జరిగిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు.;

Update: 2025-06-11 04:30 GMT

హైదరాబాద్‌ ను ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి రాజధానిగా అభివృద్ధి చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించుకుంది. ఈ మేరకు ఇటీవల చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధిపై జరిగిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ప్రతిభను ఆకర్షించే ప్రధాన చలనచిత్ర నగరంగా హైదరాబాద్‌ ను మార్చడానికి వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (DPR)ను రూపొందించాలని ఆదేశించారు.

దేశ, విదేశాల నుంచి సినిమా రంగ ప్రముఖులను ఆకర్షించడమే తమ ప్రభుత్వ లక్ష్యంగా తెలిపారు భట్టి విక్రమార్క. తెలంగాణలో చిత్ర నిర్మాతలు ఎదుర్కొంటున్న ప్రస్తుత సవాళ్లను గుర్తించారు. వాస్తవానికి.. రాష్ట్రంలో షూటింగ్ చేయాలంటే పోలీసు శాఖ, అగ్నిమాపక శాఖ, మున్సిపల్ శాఖ వంటి పలు శాఖల నుంచి అనుమతులు తీసుకోవాలి. దీంతో చిత్రనిర్మాతలకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆ సమస్యలను పరిష్కరించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించగా, భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు.

ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (FDC) కింద సింగిల్- విండో క్లియరెన్స్ వ్యవస్థను అమలు చేయాలని, అన్ని అనుమతులు త్వరగా సమన్వయం చేయడానికి అధికారిని నియమించాలని భట్టి అధికారులను ఆదేశించారు. తెలంగాణలోని అన్ని పర్యటక ప్రాంతాల్లో షూటింగ్ లు జరగడం వల్ల పర్యాటక రంగం అభివృద్ధికి అవకాశం ఉందని తెలిపారు.

సినిమా థియేటర్ క్యాంటీన్లలో తినుబండారాల అధిక ధరలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ప్రయోజనం కోసం ధరలు నియంత్రించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గతంలో FDC కి కేటాయించిన 50 ఎకరాల భూమి గురించి సమాచారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. తదుపరి సమావేశంలో దాని ప్రస్తుత స్థితిపై వివరణాత్మక నివేదిక ఇవ్వాలని కోరారు.

చిత్రపురి కాలనీలో నివసిస్తున్న సినీ కార్మికుల సంక్షేమానికి బాధ్యత వహించే RCS కమిటీని రాబోయే చర్చలకు ఆహ్వానించాలని ఆయన సూచించారు. జూన్ 14న జరగనున్న తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహించాలని నిర్వాహకులను కోరారు. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులను ఆహ్వానించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధిపై జరిగిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, FDC చైర్మన్ దిల్ రాజు, హోం శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్తా, సమాచార శాఖ కమిషనర్ హరీష్, FDC ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిషోర్ బాబుతోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News