పైరసీ రాకెట్ వెనక బెట్టింగ్ యాప్‌ల నిధులు!
పైరసీ కారణంగా టాలీవుడ్ సహా అన్ని సినీపరిశ్రమలు యేటేటా వేల కోట్ల నష్టాన్ని ఎదుర్కొంటున్నాయని అంచనా వేస్తున్నారు.;
పైరసీ కారణంగా టాలీవుడ్ సహా అన్ని సినీపరిశ్రమలు యేటేటా వేల కోట్ల నష్టాన్ని ఎదుర్కొంటున్నాయని అంచనా వేస్తున్నారు. ఆన్ లైన్ పైరసీ ముఠాల ఆగడాల్ని అరికట్టడంలో సైబర్ క్రైమ్ పోలీసుల ప్రయత్నాలు సఫలమవుతున్నా దీనిని పూర్తిగా నివారించడం సాధ్యపడటం లేదు.
తాజాగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దేశవ్యాప్తంగా ఉన్న సినిమా పైరసీ నెట్‌వర్క్ గుట్టు రట్టు చేశారు. థియేటర్లలో సెల్ కెమెరాలతో సినిమాలను రికార్డ్ చేసి టెలీగ్రామ్ చానెల్స్, ఇతర మార్గాల ద్వారా ఆన్ లైన్ లో అప్ లోడ్ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేసారు. ముఠాకు చెందిన ఆరుగురిని అరెస్ట్ చేసామని తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు తాజా మీడియా సమావేశంలో తెలిపారు. తెలుగు సహా పలు భాషల సినిమాలను ఈ ముఠా రికార్డ్ చేసి డబ్బు సంపాదిస్తోంది. పైరసీ వల్ల నిర్మాతలు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నారు. టెలిగ్రామ్ చానెల్స్, టొరెంట్ ల ద్వారా గతంలో సినిమాలను అప్ లోడ్ చేసేవారు. ఇప్పుడు కొత్త డిజిటల్ విధానంలో కూడా సినిమాలను అప్ లోడ్ చేస్తున్నారు. అంతేకాదు డిజిటల్ శాటిలైట్ ని కూడా హ్యాక్ చేసి సినిమా విడుదలకు ముందే తొలి ప్రింట్ ని కాపీ చేస్తున్నారని పోలీసులు షాకింగ్ విషయం చెప్పారు.
పైరసీకారులకు నిధులు ఎలా వస్తున్నాయి? అన్నదానికి కూడా పోలీసులు చెప్పిన వివరాలు షాకిస్తున్నాయి. బెట్టింగ్ యాప్ లు, గేమింగ్ యాప్ ల ద్వారా పైరసీ కారులు ఆదాయాన్ని పొందుతున్నారని పోలీసులు తెలిపారు.
థియేటర్ లలో కామ్ కార్డర్ ద్వారా సినిమాలను రికార్డింగ్ చేస్తున్నారు. ఆ తర్వాత వాటిని టొరెంట్లలో అప్ లోడ్ చేస్తున్నారు. రెండోది సర్వర్ ద్వారా లింక్ అయిన డిజిటల్ మీడియా హౌస్ హ్యాకింగ్ ద్వారా కూడా కొత్త సినిమాలను కాపీ చేస్తున్నారని షాకిచ్చే విషయం చెప్పారు.
ఇలాంటి దుష్టులకు గేమింగ్ - బెట్టింగ్ యాప్ లు నిధులు సమకూరుస్తున్నాయి. బెట్టింగ్- గేమింగ్ యాప్ లను ప్రచారం చేసుకోవడానికి ఈ పైరసీ సినిమాలు వారికి అడ్డాలాగా ఉపయోగపడుతున్నాయి. పైరసీలో సినిమా చూసిన జనం బెట్టింగులకు పాల్పడుతూ నాశనమవుతున్నారని పోలీసులు తెలిపారు.
తెలుగు సినీపరిశ్రమకు చెందిన కొందరు నిర్మాతలు ఫిర్యాదు చేసాక సైబర్ క్రైమ్ వింగ్ యాక్షన్ లోకి దిగింది. ఇటీవల విడుదలైన సింగిల్, హిట్ 3 చిత్రాల పైరసీపై ఫిర్యాదులు అందాయి. ఆ తర్వాత సైబర్ క్రైమ్ సెల్ విచారణ మొదలు పెట్టి ఆరుగురిని అరెస్ట్ చేసింది. హైదరాబాద్ కి చెందిన జానా కుమార్ అనే 24ఏళ్ల యువకుడిని మొదట అదుపులోకి తీసుకుని విచారించగా, దేశవ్యాప్తంగా ఉన్న పైరసీ నెట్ వర్క్ గుట్టు రట్టయంది. అతడు హైదరాబాద్ లోని ఓ థియేటర్ లో `సింగిల్` అనే మూవీని రికార్డ్ చేసాడు. సిరిల్ రాజు అనే వ్యక్తికి యాప్ ద్వారా అప్ లోడ్ చేసాడు. 40 సినిమాలను అతడు థియేటర్లలో రికార్డ్ చేసానని అతడు ఒప్పుకున్నాడు. 150 నుంచి 500 డాలర్ల వరకూ ఒక్కో సినిమాకి అందుతుంది. మూవీ రేంజును బట్టి ఆదాయం వస్తుందని జానా కుమార్ తెలిపాడు.
వీరంతా సెల్ ఫోన్ లను జేబులో కానీ పాప్ కార్న్ డబ్బాలో కానీ పెట్టి పైరసీ చేస్తున్నారని పోలీసులు తెలిపారు. రికార్డ్ చేసేప్పుడు సెల్ ఫోన్ స్క్రీన్ కూడా ఆఫ్ మోడ్ లో ఉంటుంది. దానివల్ల ఏం జరుగుతుందో పక్కవారికి తెలీదు. కేవలం తెలుగు సినిమాలనే కాదు, ఇతర భాషల సినిమాలను రికార్డ్ చేసేందుకు పైరేట్ కీలక సభ్యుడు సిరిల్ కు ఏజెంట్లు ఉన్నారు. పైరసీ ముఠా అరెస్ట్ సందర్భంగా ఎఫ్ డిసి ఛైర్మన్ దిల్ రాజు హర్షం వ్యక్తం చేసారు.