హృతిక్ కోరిక విన్నారా? డియ‌ర్ సౌత్ పాన్ ఇండియన్ డైరెక్ట‌ర్స్!

బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ వెండితెరపై తనకున్న పాత ఇమేజ్‌ను పూర్తిగా మార్చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు.

Update: 2026-06-07 00:30 GMT

బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ వెండితెరపై తనకున్న పాత ఇమేజ్‌ను పూర్తిగా మార్చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. కెరీర్ ప్రారంభం నుండి తను ఎక్కువగా పోషిస్తున్న `గుడ్ బోయ్‌` పాత్రల నుండి కాస్త విరామం తీసుకుని.. కొన్న‌యినా నెగెటివ్ షేడ్‌ లేదా డార్క్ క్యారెక్టర్లను చేయాల‌నే బలమైన కోరికను వ్యక్తం చేశారు. అయితే దర్శకులు తనను ఎప్పుడూ కేవలం పాజిటివ్ పాత్రల కోసమే సంప్రదిస్తుంటారని... ఇది తనకు కొంత నిరాశ కలిగిస్తోందని హృతిక్ రోషన్ బహిరంగంగానే అంగీకరించారు.

ఇటీవ‌ల‌ హృతిక్ రోషన్ తన ఇన్‌స్టాలో ఒక ఆసక్తికరమైన ఫోటోని షేర్ చేసి దానికి ఇచ్చిన‌ క్యాప్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. పారిస్ వీధుల్లో రాత్రి వేళ వెలిగిపోతున్న ఈఫిల్ టవర్ బ్యాక్‌డ్రాప్‌లో బ్లాక్ క్యాప్, డార్క్ జాకెట్ ధరించి దిగిన ఒక సెల్ఫీని హృతిక్ షేర్ చేశారు. సెల్ఫీ పిక్ తో పాటు హృతిక్ రాసిన క్యాప్ష‌న్ ఆస‌క్తిక‌రం.. డియ‌ర్ నువ్వు ఇప్పుడెలాంటి పాత్ర కోసం సెర్చ్ చేస్తున్నావ్? అని ఒకరు నన్ను అడిగారు. దానికి నా మనసులోంచి వచ్చిన సమాధానం నాకే ఆశ్చర్యాన్ని కలిగించింది. `లక్ బై ఛాన్స్` సినిమాలో నేను చేసిన `జాఫర్` పాత్ర మీకు గుర్తుందా? సరిగ్గా అలాంటి రోల్ కోసమే నేను చూస్తున్నాను! అని హృతిక్ రాసుకొచ్చారు.

అంతేకాదు .. అలాంటి భిన్నమైన పాత్ర వస్తే నేను వెంటనే ఎగిరి గంతేసి ఒప్పుకుంటాను. కానీ దర్శకులు నన్ను కేవలం మంచి అబ్బాయిగానే చూడాలనుకుంటున్నారు.. ఇది బాధాకరం! అంటూ హృతిక్ రోషన్ తన ఆవేదనను క్యాప్షన్‌లో జ‌త చేసారు. 2009లో జోయా అక్తర్ రచన, దర్శకత్వంలో వచ్చిన `లక్ బై ఛాన్స్` చిత్రంలో హృతిక్ రోషన్ ఒక ప్రత్యేక పాత్రలో మెరిశారు. అందులో అత‌డు పోషించిన జాఫర్ అనే సినీ స్టార్ పాత్ర.. ఎంతో ఆకర్షణీయంగా ఉంటూనే.. ఇన్‌సైడ్ స్వార్థప‌రుడిగా, లోపాలున్న‌వాడిగా నెగెటివ్ షేడ్స్‌తో సాగుతుంది. సినిమాలో కొద్దిసేపే కనిపించినా హృతిక్ కెరీర్‌లోనే అది ఒక ప్ర‌త్యేక‌మైన‌... మరపురాని పాత్ర‌గా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. హృతిక్ చేసిన ఈ ఇన్‌స్టా పోస్ట్‌పై దర్శకురాలు జోయా అక్తర్ వెంటనే స్పందిస్తూ.. ``త్వరలోనే కాఫీ తాగుతూ దీని గురించి చర్చిద్దాం`` అంటూ సరదాగా కామెంట్ చేయడం విశేషం.

ఒకప్పుడు `కహో నా ప్యార్ హై` చిత్రంతో బాలీవుడ్‌లో హీరోగా ఘనమైన అరంగేట్రం చేసిన హృతిక్ రోషన్.. ఇటీవల వచ్చిన భారీ యాక్షన్ చిత్రం `వార్ 2` లో కనిపించారు. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి ఫలితాన్ని అందుకోవడంలో విఫలమైంది. ఈ నేపథ్యంలోనే అతడు తన కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు అర్థ‌మ‌వుతోంది.

ప్రస్తుతం హృతిక్ రోషన్ తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన `క్రిష్ 4` చిత్రం కోసం సన్నద్ధమవుతున్నారు. యష్ రాజ్ ఫిల్మ్స్- రాకేష్ రోషన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ సూపర్ హీరో చిత్రంతో హృతిక్ దర్శకుడిగా కూడా పరిచయం కాబోతుండటం విశేషం. ఇందులో నటించడంతో పాటు ఆయనే మెగాఫోన్ పట్టనున్నారు. ఇవే కాకుండా... ప్రైమ్ వీడియో కోసం ముంబై నేపథ్యంలో రాబోతున్న `స్టార్మ్` అనే క్రేజీ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌తో ఆయన ఓటీటీ రంగంలోకి నిర్మాతగానూ అడుగుపెడుతున్నారు. మరి `క్రిష్ 4` కంటే ముందే హృతిక్ రోషన్ కోరుకున్నట్లు ఏదైనా డార్క్ లేదా విలనిజం ఉన్న పాత్ర లభిస్తుందేమో చూడాలి. బ‌హుశా వార్ 2 ఫేమ్ అయాన్ ముఖ‌ర్జీ లాంటి ద‌ర్శ‌కుడు కాకుండా ఒక ఉత్త‌మ‌మైన పాన్ ఇండియ‌న్ సౌత్ ద‌ర్శ‌కుడే ఇలాంటి ఒక అవ‌కాశం క‌ల్పిస్తారేమో!

Tags:    

Similar News