మేకర్స్ ఏం చేస్తున్నారు..?
ఇలాంటి సమయంలో ఒక సినిమాను తీసుకు వస్తున్నామంటే కంటెంట్ కంటే ప్రమోషన్‌కి, పబ్లిసిటీకి ఎక్కువ శ్రద్ద పెట్టాల్సి ఉంటుంది.;
గత కొన్నాళ్లుగా బాలీవుడ్ ఇండస్ట్రీ పరిస్థితి ఏ మాత్రం బాగాలేదు. స్టార్ హీరోల సినిమాలు, పెద్ద దర్శకుల సినిమాలు, పెద్ద బడ్జెట్ సినిమాలు ఇలా అన్ని రకాల సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడుతున్నాయి. గతంతో పోల్చితే సక్సెస్ రేటు దారుణంగా పడిపోయింది. కనీసం అయిదు శాతం కూడా సక్సెస్ రేటు నమోదు కావడం లేదు అనేది బాక్సాఫీస్ వర్గాల టాక్. ఇలాంటి సమయంలో ఒక సినిమాను తీసుకు వస్తున్నామంటే కంటెంట్ కంటే ప్రమోషన్‌కి, పబ్లిసిటీకి ఎక్కువ శ్రద్ద పెట్టాల్సి ఉంటుంది. కానీ బాలీవుడ్ సూపర్ హిట్ ప్రాంచైజీ మూవీ హౌస్‌ఫుల్ 5 కి మాత్రం లో ఫ్రొఫైల్ మెయింటెన్ చేస్తున్నారు. ఇది కావాలని చేస్తున్నారా.. లేదంటే పబ్లిసిటీ చేయడం తెలియడం లేదా అంటూ ఇండస్ట్రీలో చెవులు కొరుక్కుంటున్నారు.
హౌస్‌ఫుల్ ప్రాంచైజీకి ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఈ సినిమాను ఏకంగా 15 కి పైగా స్టార్స్‌తో రూపొందించారు. ఈ సినిమాలో నటించిన హీరోలు, హీరోయిన్స్, ముఖ్య నటీనటుల జాబితా చెబితే చాలా పెద్దగానే ఉంటుంది. అయినా కూడా ప్రమోషన్ విషయంలో కొత్త హీరో సినిమా స్థాయిలోనే ఉంది. ఇంత మంది తారాగణం ఉన్నారు అంటే హడావుడి అదే రేంజ్‌లో ఉండాలి. కానీ ఆ హడావిడి పెద్దగా కనిపించడం లేదు. సినిమాను జూన్ 6న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. విడుదలకు ఇంకా రెండు వారాల సమయం మాత్రమే ఉంది. ఒకటి రెండు రోజుల్లో అడ్వాన్స్ బుకింగ్ మొదలు పెట్టబోతున్నారు. అయినా పబ్లిసిటీ హడావుడి కనిపించడం లేదు.
గతంలో వచ్చిన హౌస్‌ఫుల్ ప్రాంచైజీ సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ సినిమా ఈజీగానే సక్సెస్ అవుతుందని మేకర్స్ భావిస్తూ ఉన్నారేమో.. అందుకే పబ్లిసిటీ విషయంలో పెద్దగా ఆసక్తి చూపడం లేదు అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. సినిమా విడుదల సమయంలో చేసే పబ్లిసిటీ కచ్చితంగా ఓపెనింగ్ కలెక్షన్స్ పై పడుతుంది. కనుక ఈ సినిమాకు పబ్లిసిటీ చేయక పోవడం అనేది తెలివి తక్కువ తనం అవుతుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అక్షయ్ కుమార్ ఈ మధ్య కాలంలో చాలా సినిమాలతో వచ్చారు. ఆయన సినిమాల ఫలితాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెజారిటీ సినిమాలు కనీసం వసూళ్లు రాబట్టడంలో విఫలం అయ్యాయి. అందుకే హౌస్ ఫుల్ 5 విషయంలో జాగ్రత్త అవసరం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
హౌస్‌ఫుల్ 5 సినిమాలో అక్షయ్ కుమార్‌తో పాటు రితేష్ దేశ్ముఖ్, అభిషేక్ బచ్చన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సోనమ్ బజ్వా, సంజయ్ దత్, జాకీష్రాఫ్, నానా పటేకర్, చంకీ పాండే, జానీ లివర్, నర్గీస్ ఫక్రీ ఇంకా ఎంతో మంది ప్రముఖ నటీనటులు గెస్ట్ రోల్స్‌లో కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన పాటతో ఆ మధ్య సినిమా గురించి కాస్త హడావిడి జరిగింది. కానీ పాట మెల్ల మెల్లగా కనుమరుగు అయింది. ఆ పాటను విడుదల ముందు అంటే ఇప్పుడు విడుదల చేసి ఉంటే సినిమాకు బజ్ క్రియేట్ చేయడంలో సఫలం అయ్యి ఉండేది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి బాలీవుడ్‌కు అత్యంత కీలకమైన ఈ సమయంలో హౌస్‌ఫుల్ 5 హిట్ కొట్టేనా చూడాలి.