తెలుగు హీరోని నెత్తిన పెట్టుకున్న హిందీ నిర్మాతలు! అసలు కారణం ఇదేనా!
సినీ పరిశ్రమలో టాలెంట్ ఉన్నా ఒక్కోసారి ఆశించిన చోట అవకాశాలు లేకపోవచ్చు... కానీ ఎక్కడో ఒకచోట ఆ ప్రతిభకు తగిన గుర్తింపు లభించడం ఖాయం.
సినీ పరిశ్రమలో టాలెంట్ ఉన్నా ఒక్కోసారి ఆశించిన చోట అవకాశాలు లేకపోవచ్చు... కానీ ఎక్కడో ఒకచోట ఆ ప్రతిభకు తగిన గుర్తింపు లభించడం ఖాయం. నటుడు హర్షవర్ధన్ రాణే కెరీర్ చూస్తే ఇది నిజమనిపిస్తుంది. అతడు భూమికా చావ్లా, భరత్ ఠాకూర్ సంయుక్తంగా నిర్మించిన `తకిట తకిట` అనే డిజాస్టర్ సినిమాతో తెలుగులో హీరోగా పరిచయమయ్యాడు. సినిమా రంగానికి రాకముందు సికింద్రాబాద్‌లో పాత సోఫాలు రిపేర్ చేసి అమ్మే సాధారణ జీవితాన్ని గడిపిన హర్షవర్ధన్ ఓవర్‌నైట్ హీరో అయినా టాలీవుడ్‌లో ఆశించిన సక్సెస్ అందుకోలేకపోయాడు. ఒక రకంగా ఈ తెలుగు హీరోని టాలీవుడ్ వదులుకోగా, బాలీవుడ్ మాత్రం ఇప్పుడు అతడి ప్రతిభను నమ్మి నెత్తిన పెట్టుకుంటోంది.
తెలుగులో సరైన బ్రేక్ రాకపోవడంతో కొన్నాళ్ల క్రితమే హర్షవర్ధన్ బాలీవుడ్‌కు షిఫ్ట్ అయ్యాడు. అయితే అక్కడ కూడా ప్రారంభంలో తీవ్రంగానే శ్రమించాల్సి వచ్చింది. అతడు నటించిన `సనమ్ తేరి కసమ్` సినిమా రీ-రిలీజ్ అయి సంచలన విజయం సాధించే వరకు బాలీవుడ్‌లోనూ అతనికి సరైన గ్రిప్ దొరకలేదు. కానీ `సనమ్ తేరి కసమ్`, `ఏక్ దీవానే కీ దీవానియాత్` వంటి చిత్రాల ఘనవిజయం తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది. హిందీ చిత్రసీమలోని అగ్ర నిర్మాతలకు అతడి నటనపై పూర్తి నమ్మకం ఏర్పడింది. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ హీరో, నిర్మాత జాన్ అబ్రహం, అగ్ర నిర్మాత ఏక్తా కపూర్ వంటి వారు హర్షవర్ధన్‌ను నెత్తిన పెట్టుకుని భారీ ప్రాజెక్టులతో వరుసగా అవకాశాలిస్తూ ప్రోత్సహిస్తున్నారు.
కథను నమ్మకంగా.. ప్రామాణికంగా తెరపైకి తీసుకురాగల ప్రతిభావంతులైన నటుల కోసం ఫిలింమేకర్స్ ఎప్పుడూ అన్వేషిస్తూనే ఉంటారు. హర్షవర్ధన్ రాణే అథ్లెటిక్ బాడీ-కండలు తిరిగిన శరీరం.. కళ్లలో కనిపించే ఇంటెన్సిటీ గతంలో రొమాంటిక్ సినిమాలకు ఎంతగానో ప్లస్ అయ్యాయి. అయితే ఇదే శారీరక దారుఢ్యాన్ని సరైన రీతిలో వాడుకుంటే ఒక పవర్‌ఫుల్ యాక్షన్ హీరోను సృష్టించవచ్చని బాలీవుడ్ నిర్మాతలు గుర్తించారు. కేవలం భారీ పంచ్ డైలాగులపైనే ఆధారపడకుండా.. తన బలమైన స్క్రీన్ ప్రెజెన్స్, బాడీ బిల్డింగ్ తో అతడు సరికొత్త యాక్షన్ హీరోగా దూసుకొస్తున్నాడు.
ఈ కెరీర్ మార్పులో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. దర్శకుల కంటే ముందే నిర్మాతలే అతడిలోని యాక్షన్ యాంగిల్‌ను పసిగట్టడం. జాన్ అబ్రహం నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక యాక్షన్ ఫ్రాంచైజీ `ఫోర్స్ 3`లో .. ఏక్తా కపూర్ నిర్మించే భారీ యాక్షన్ చిత్రంలో హర్షవర్ధన్ కీలక పాత్రలకు ఎంపికయ్యాడు. ముఖ్యంగా `ఫోర్స్ 3` సినిమా హర్షవర్ధన్ కెరీర్‌లోనే ఒక బిగ్ గేమ్ చేంజర్ కాబోతోంది. ఇండియన్ సినిమాలో రొమాన్స్ - యాక్షన్ రెండింటినీ ఒకేలా పండించగల నటులు చాలా అరుదు. ప్రస్తుతం హర్షవర్ధన్ చేతిలో ఉన్న పెద్ద ప్రాజెక్టులను చూస్తుంటే... బాలీవుడ్ మేకర్స్ అతడిలోని పూర్తి నైపుణ్యాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సిద్ధమైనట్లు స్పష్టమవుతోంది.
యాక్షన్ స్టార్‌గా రాణించడానికి అవసరమైన అన్ని లక్షణాలు హర్షవర్ధన్‌లో మొదటి నుంచీ ఉన్నా అవకాశాలే రాలేదు. అతడిని మునుపెన్నడూ చేయని విభిన్నమైన పాత్రల్లో ఊహించిన ఘనత పూర్తిగా ఏక్తా, జాన్ లకే దక్కుతుంది. ఈ అవకాశాలతో హర్షవర్ధన్ రాణే తన అభిమానుల పరిధిని మరింతగా విస్తరించుకుంటున్నాడు. హర్షవర్ధన్ కెరీర్ తీసుకుంటున్న ఈ కొత్త మలుపుపై `సనమ్ తేరి కసమ్` చిత్ర దర్శకుడు వినయ్ సప్రు స్పందిస్తూ.. అతడిలో రొమాన్స్, యాక్షన్, అడ్వెంచర్, డ్రామా వంటి అన్ని జానర్లలో రాణించగల బహుముఖ ప్రజ్ఞ ఎప్పుడూ ఉంది. భావోద్వేగాలను పండిస్తూనే, యాక్షన్ కథలను తన భుజాలపై మోయగల శారీరక సామర్థ్యం ఉందని మేము ముందే ఊహించాము. హిందీ సినిమాలో ఒక నటుడు రొమాన్స్, యాక్షన్ రెండింటినీ సమర్థవంతంగా చేయగలిగితే.. వారికి అవకాశాలు అపరిమితంగా ఉంటాయి. `ఫోర్స్ 3` చిత్రం అతడిలోని పూర్తి నటనా విశ్వరూపాన్ని ప్రపంచానికి పరిచయం చేయబోతోంది! అని విశ్లేషించారు. హర్షవర్ధన్ ఎప్పటికీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టి తనను తాను నిరూపించుకుని ముందుకు సాగాల్సి ఉంది.