గౌతమ్ మీనన్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు!

గౌతమ్ మీనన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ప్రతిష్టాత్మక చిత్రం `నీతానే ఎన్ పొన్వసంతమ్` నిర్మాణ సమయం నుండి సాగుతున్న ఆర్థిక వివాదం తాజాగా సుప్రీంకోర్టు తీర్పుతో మరింత ముదిరింది.

Update: 2026-07-19 19:05 GMT

గౌతమ్ మీనన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ప్రతిష్టాత్మక చిత్రం `నీతానే ఎన్ పొన్వసంతమ్` నిర్మాణ సమయం నుండి సాగుతున్న ఆర్థిక వివాదం తాజాగా సుప్రీంకోర్టు తీర్పుతో మరింత ముదిరింది. సుమారు 4.25 కోట్ల రూపాయల రుణాన్ని వడ్డీతో సహా తిరిగి చెల్లించాలంటూ గతంలో వచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించడంతో దర్శకుడికి పెద్ద ఆర్థిక భారం ఎదురైంది. ఈ తీర్పు కోలీవుడ్ వర్గాల్లో చ‌ర్చ‌నీయాశంగా మారింది. ఏళ్ల తరబడి సాగుతోన్న కేసులో గౌతమ్ మీనన్ వాదనలను న్యాయస్థానం తిరస్కరించింది. చిత్ర నిర్మాణ సమయంలో చేసుకున్న ఆర్థిక ఒప్పందాలు, పూచీకత్తులు , రుణాల చెల్లింపుల్లో జరిగిన జాప్యం పట్ల అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

గౌతమ్ మీనన్ సమర్పించిన ప్రతివాదనలు కోర్టును మెప్పించలేకపోవడంతో బాకీ మొత్తం భారీ వడ్డీతో కలిపి చెల్లించాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. దర్శకుడిగా, నిర్మాతగా గౌతమ్ మీనన్ చిత్రపరిశ్రమలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇలాంటి చట్టపరమైన చిక్కులు ఆయన వృత్తిపరమైన ప్రయాణానికి ఆటంకంగా మారుతున్నాయి. గతంలోనే పలుమార్లు ఆర్థిక వివాదాలతో వార్తల్లో నిలిచిన ఆయన సుప్రీంకోర్టు తీర్పుతో మరింత ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. సృజనాత్మక రంగంలో ఉన్న కళాకారులు ఆర్థిక నిర్వహణ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ కేసు నిదర్శనంగా నిలుస్తోంది.

సినిమా రంగంలో పారదర్శకత లేని ఆర్థిక ఒప్పందాలు ఇలాంటి పరిణామాలకు దారితీస్తుంటాయి. నిర్మాతలకు ..దర్శకులకు మధ్య ఉండే ఒప్పందాలు బాధ్యతాయుతంగా లేకపోవడం వల్లే ఇలాంటి సుదీర్ఘ న్యాయపోరాటాలు జరుగుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. `నీతానే ఎన్ పొన్వసంతమ్` సినిమా విడుదలై చాలా కాలమైనా? ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్థిక భారాలు ఇంకా వెంటాడుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఈ తీర్పు గౌతమ్ మీనన్ తదుపరి ప్రాజెక్టుల మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. పెద్ద మొత్తంలో వడ్డీని చెల్లించాల్సి రావడం వల్ల ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలు , ప్రణాళికలు ఆర్థిక ఇబ్బందుల్లో ప‌డొచ్చు. కళాత్మక విజయాలతో పాటు ఆర్థికంగా కూడా నిలదొక్కుకోవడం ఒక సృజనాత్మక దర్శకుడికి ఎంత ముఖ్యమో? ఈ ఘటన మ‌రోసారి గుర్తుచేస్తోంది. ఇండస్ట్రీలోని ఇతర మేకర్స్ కూడా ఈ ఉదంతం నుండి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.

సుప్రీంకోర్టు తీర్పుతో గౌతమ్ మీనన్ ఆర్థిక పోరాటంలో కీలక ఘట్టం ముగిసినట్లయింది. ఆయన ఇకనైనా బాకీల చెల్లింపుపై దృష్టి సారించి కెరీర్‌ను తిరిగి గాడిలో పెట్టుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. చట్టపరమైన అంశాలను సకాలంలో పరిష్కరించుకోవడం ద్వారానే ఇలాంటి చిక్కుల నుండి దూరంగా ఉండొచ్చ‌ని ఈ ఉదంతం హెచ్చరిస్తోంది.

Tags:    

Similar News