శంకర్ కు నిర్మాత సెట్ అయ్యారా? కానీ ఆ కండీషన్లతోనేనా?
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ పేరు వినిపిస్తే ఒకప్పుడు భారీ బడ్జెట్‌లు, అద్భుతమైన విజువల్స్, రికార్డు స్థాయి కలెక్షన్లు గుర్తుకు వచ్చేవి.;
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ పేరు వినిపిస్తే ఒకప్పుడు భారీ బడ్జెట్‌లు, అద్భుతమైన విజువల్స్, రికార్డు స్థాయి కలెక్షన్లు గుర్తుకు వచ్చేవి. కానీ కొంతకాలంగా శంకర్ కు ఆశించిన స్థాయిలో ఫలితాలు దక్కడం లేదు. రోబో 2.0, ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ వంటి భారీ అంచనాలతో వచ్చిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. ముఖ్యంగా ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ సినిమాలు నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చాయి!
వరుస ఫ్లాపుల ప్రభావంతో శంకర్ ప్రస్తుతం కొత్త ప్రాజెక్టులకు సంబంధించి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కోలీవుడ్ లో చర్చ జరుగుతోంది. పెద్ద హీరోలను ఒప్పించడం, తన విజన్ కు తగ్గ బడ్జెట్ ను సమకూర్చగల నిర్మాతలను కనుగొనడం శంకర్ కు సవాలుగా మారిందని కొంతకాలంగా టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ వేల్పారి విషయంలో ఆ సమస్య మరింత తీవ్రమైందని తెలుస్తోంది.
తమిళ సాహిత్యంలో ఎంతో ప్రాచుర్యం పొందిన వేల్పారి నవల ఆధారంగా భారీ పీరియాడిక్ డ్రామా తెరకెక్కించాలని శంకర్ చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. చారిత్రక నేపథ్యం, గ్రాండ్ సెట్స్, భారీ విజువల్ ఎఫెక్ట్స్ అవసరమైన ఆ కథకు భారీ బడ్జెట్ తప్పనిసరి. అయితే గత చిత్రాల నష్టాల నేపథ్యంలో అంత పెద్ద మొత్తాన్ని వెచ్చించేందుకు నిర్మాతలు ముందుకు రాకపోవడంతో ప్రాజెక్ట్ ఆగిపోయిందనే ప్రచారం జరిగింది.
తాజా సమాచారం ప్రకారం, శంకర్‌కు ఎట్టకేలకు ఒక నిర్మాత దొరికినట్లు తెలుస్తోంది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ, పంపిణీ సంస్థ పెన్ స్టూడియోస్, వేల్పారి ప్రాజెక్ట్ ను నిర్మించేందుకు ఆసక్తి చూపినట్లు కోలీవుడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇది శంకర్ అభిమానులకు కాస్త ఊరట కలిగించే వార్త అని చెప్పాలి. కానీ ఆ ఒప్పందం మాత్రం అంత సులభంగా కుదరలేదని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి..
పెన్ స్టూడియోస్ శంకర్ కు కొన్ని కఠినమైన షరతులు విధించినట్లు సమాచారం. ముఖ్యంగా సినిమా బడ్జెట్ విషయంలో పూర్తిస్థాయి నియంత్రణ ఉండాలనే తేల్చి చెప్పారట. సినిమా కోసం ఎంత బడ్జెట్ అవసరమో, ఎంత కాలంలో షూటింగ్ పూర్తవుతుందో ప్లాన్ ముందుగానే సమర్పించాలని శంకర్ ను కోరినట్లు తెలుస్తోంది. ఏ పరిస్థితుల్లోనూ బడ్జెట్ ను మించకుండా చూసుకుంటానని రాతపూర్వక హామీ ఇవ్వాలని చెప్పారని టాక్.
గతంలో శంకర్ సినిమాలు అనుకున్నదానికంటే ఎక్కువ రోజులు షూటింగ్ జరుపుకోవడం, బడ్జెట్ పెరగడం వంటి అంశాలు చోటుచేసుకొన్న నేపథ్యంలో ఈసారి పెన్ స్టూడియోస్ అప్రమత్తంగా వ్యవహరిస్తోందని టాక్. ఆ షరతులకు శంకర్ పూర్తిగా అంగీకరించారా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు. నిర్మాతతో తుది ఒప్పందం కుదిరిన తర్వాతే వేల్పారి సెట్స్ పైకి వెళ్లే అవకాశముందని తెలుస్తోంది. మరి చూడాలి ఏం జరుగుతుందో..