ఫిష్ వెంకట్ మృతి.. ఎవరి పనుల్లో వారు బిజీ: నట్టి కుమార్
అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో సహాయం కోసం ఆయన కుటుంబ సభ్యులు ఇండస్ట్రీని అభ్యర్థించారు. కానీ ఎవరూ రెస్పాండ్ అవ్వలేదని నెటిజన్లు తప్పుబట్టారు.;
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఫిష్ వెంకట్.. రీసెంట్ గా మరణించిన విషయం తెలిసిందే. కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యతో కొంతకాలంగా తీవ్రంగా బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.
అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో సహాయం కోసం ఆయన కుటుంబ సభ్యులు ఇండస్ట్రీని అభ్యర్థించారు. కానీ ఎవరూ రెస్పాండ్ అవ్వలేదని నెటిజన్లు తప్పుబట్టారు. చనిపోయాక కూడా ఎవరూ సానుభూతి తెలపలేదని విమర్శించారు. కనీస సాయం, స్పందన కనిపించలేదని ఆరోపించారు. దీంతో ఇప్పుడు నిర్మాత నట్టి కుమార్ స్పందించారు.
ఫిష్ వెంకట్ కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారని నట్టి కుమార్ అన్నారు. పరిశ్రమతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న వారు చనిపోతే సినిమా సెలబ్రిటీలంతా వెళ్తుంటారని తెలిపారు. అయినా సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక బిజీ ప్రపంచమని, ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉంటారని చెప్పారు.
ఎక్కడ ఎవరు మరణించారోనని అని తెలుసుకునేంత టైమ్ ఎవరికీ ఉండదని అభిప్రాయపడ్డారు. అయినా తన వ్యాఖ్యలు ఇప్పుడు ఫిష్ వెంకట్ కుటుంబానికి బాధ కలిగించవచ్చని అన్నారు. కానీ రేపు తన కుటుంబానికి కూడా ఇదే పరిస్థితి రావచ్చని వ్యాఖ్యానించారు. ఫిలిం ఛాంబర్ తో ఎప్పుడూ టచ్ లో ఉన్న వారికి ఏదైనా జరిగితే సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు వెళ్తారని అన్నారు.
ఫిష్ వెంకట్ ఎప్పుడూ గబ్బర్ సింగ్ గ్యాంగ్ తోనే టచ్ లో ఉంటారని, అందుకే వాళ్లు మాత్రమే ఆయన చనిపోతే వెళ్లారని తెలిపారు. ఫిష్ వెంకట్ మా అసోసియేషన్ లో మెంబర్ కాదని, ఆయనకు సభ్యత్వం కూడా లేదని నట్టి కుమార్ తెలిపారు. అయితే ఎప్పుడూ ఎవరూ సహాయం చేస్తారని ఆశించకండని, ఎవరి జాగ్రత్తలో వారు ఉండాలని సూచించారు.
దానికి తోడు ఒక రోజుకు మూడు వేలు రెమ్యూనరేషన్ తీసుకునే రేంజ్ నుంచి రూ.30 వేలు రెమ్యూనరేషన్ తీసుకునే స్థాయికి ఫిష్ వెంకట్ ఎదిగారని నట్టి తెలిపారు. మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలని, లేకుంటే ఇబ్బందులు తప్పని చెప్పారు. డబ్బు సహాయం అందరూ చేయని అన్నారు. మాట సాయం మాత్రం చేస్తారని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.