టాలీవుడ్‌లో కొత్త రూల్‌.. ఇకపై పేమెంట్స్ వారికే!

తెలుగు సినిమా కార్మికులు దాదాపు రెండు వారాలు చేసిన సమ్మె ముగించి షూటింగ్స్‌కు హాజరు అవుతున్న విషయం తెల్సిందే.;

Update: 2025-08-29 09:30 GMT

తెలుగు సినిమా కార్మికులు దాదాపు రెండు వారాలు చేసిన సమ్మె ముగించి షూటింగ్స్‌కు హాజరు అవుతున్న విషయం తెల్సిందే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి చొరవతో ఈ సమ్మెకు ముగింపు పలికినట్లు పలువురు నిర్మాతలు, కార్మిక సంఘాల వారు చెప్పుకొచ్చారు. సమ్మె పూర్తి చేసుకుని షూటింగ్స్‌కు హాజరు అవుతున్న కార్మికులకు నిర్మాతల నుంచి అందుతున్న చెల్లింపుల గురించి చర్చ జరుగుతోంది. సమ్మె సమయంలో నిర్మాతలు పలు సార్లు భేటీ అయ్యి కార్మికులతో చర్చలు జరిపి, సంఘాల వారితో చర్చలు జరిపి ఒక నిర్ణయానికి వచ్చిన విషయం తెల్సిందే. ముఖ్యంగా కార్మికులు లాభం పొందకుండా, పడ్డ కష్టంకు ప్రతిఫలం అందుకోకుండా మధ్యలో యూనియన్స్ వారు లాభం పొందుతున్నారని, అందువల్ల నిర్మాతలకు కూడా ఇబ్బందులు ఎదురు అవుతున్నాయని గుర్తించారు.

టాలీవుడ్‌లో షూటింగ్స్‌ పునః ప్రారంభం

ప్రముఖ నిర్మాతలు చాలా మంది యూనియన్స్‌కి చెల్లింపులు చేయకూడదు అంటూ డిమాండ్‌ చేశారు. కానీ సంఘాల వారు మాత్రం చెల్లింపులు మాకే చేయాల్సిందే అంటూ పట్టుబడుతున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం గురించి ఒక క్లారిటీ రాక ముందే షూటింగ్స్‌కు వెళ్లిన నేపథ్యంలో నిర్మాతలు ఎవరికి పేమెంట్స్ ఇవ్వాలి అనే విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. గతంలో మాదిరిగానే పేమెంట్స్ జరుగుతున్నాయి. ఈ సమయంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. ఫిల్మ్‌ ఛాంబర్‌ నుంచి వచ్చిన ప్రకటన అనుసారం ఖచ్చితంగా నిర్మాతలు తమ చెల్లింపులను యూనియన్స్‌కి కాకుండా కార్మికులకు నేరుగా చెల్లించాలి. అలా కాదని చెల్లింపులు చేయడం ద్వారా ఖచ్చితంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని సూచించారు.

ఫిల్మ్ ఛాంబర్‌ కీలక ఆదేశాలు

తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ వారు జారీ చేసిన మీటింగ్ మినిట్స్ ప్రకారం అందులో తీసుకున్న నిర్ణయాలను కఠినంగా అమలు చేయాల్సిందే అని ఫిల్మ్‌ ఛాంబర్‌ నిర్ణయించింది. అందులో భాగంగానే నిర్మాణ సంస్థలు తమ సినిమాలకు సంబంధించిన షూటింగ్స్‌ లో పాల్గొన్న కార్మికులకు చెందిన బిల్లులను తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్ కామర్స్ కు సమర్పించాలి. అక్కడ నుంచి రోజు వారి వేతనాలను చెల్లించాల్సి ఉంటుంది. రోజు వారి చెల్లింపులు తప్పనిసరిగా చెల్లించాల్సిన అవసరం ఉంది, కొందరు బిల్లుల చెల్లింపు విషయంలో యూనియన్స్‌ను ఆశ్రయిస్తున్నారు. వారిని కాకుండా సొంతంగానే కార్మికులకు చెల్లించే విధంగా ఫిల్మ్‌ ఛాంబర్‌ నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి.

తెలుగు నిర్మాతలను బ్లాక్‌మెయిల్‌

ప్రస్తుతానికి నేరుగా నిర్మాతలు కార్మికులకు చెల్లింపులు చేయాల్సి ఉంటుందని.. ప్రస్తుతం ఈ విషయమై చర్చలు జరుగుతున్నాయని, తుది నిర్ణయం తీసుకున్న తర్వాత యూనియన్స్ విషయమై చర్చ ఉంటుందని తెలుస్తోంది. యూనియన్‌ సభ్యులు సభ్యత్వం కోసం లక్షల రూపాయలు వసూళ్లు చేయడంతో పాటు, నిర్మాతలను బ్లాక్ మెయిల్‌ చేయడం, కార్మికులకు ఇవ్వాల్సిన మొత్తం ఇవ్వడం లేదు అంటూ వెళ్లడి అయింది. అందుకే చాలా మంది నిర్మాతలు సొంతంగా కార్మికులను తీసుకు వస్తున్నారు. అంతే కాకుండ ఇండస్ట్రీ తరపున ట్యాలెంట్‌ టెస్ట్‌ నిర్వహించి కూడా సినీ కార్మికులను తీసుకునేందుకు గాను చర్యలు తీసుకుంటున్నారు. యూనియన్స్ పరిధి తగ్గించడం, వాటి బ్లాక్‌ మెయిల్‌ ను తగ్గించడం కోసం ఈ నిర్ణయాలు తీసుకున్నట్లుగా ఫిల్మ్‌ ఛాంబర్‌ వారు అంటున్నారు.

Tags:    

Similar News