ఫౌజి.. ఈసారి రాజాసాబ్‌లా కాకుండా ఈ రూట్లో..
‘ఫౌజి’ డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో సినిమాను తీసుకొస్తున్నారు.
ప్రభాస్ సినిమా ప్రమోషన్స్ అంటే గత కొన్నేళ్లుగా చాలా లిమిట్‌గానే ఉంటున్నాయి. సినిమా ఎంత పెద్దదైనా ఆయన వరుస ఇంటర్వ్యూలు, సిటీ టూర్స్ చేయడం చాలా అరుదు. ‘ది రాజాసాబ్’ సమయంలో కూడా ఒక స్పెషల్ ఇంటర్వ్యూ రికార్డ్ చేసి రిలీజ్ చేశారు తప్ప, దేశమంతా తిరిగి ప్రమోట్ చేయలేదు. కానీ ‘ఫౌజి’ దగ్గర మాత్రం ఆ పద్ధతి మారబోతోందని సమాచారం. ఈసారి ప్రభాస్‌ను ప్రమోషన్స్‌లో ఎక్కువగా ముందుకు తీసుకురావాలని టీమ్ ప్లాన్ చేస్తోందట.
‘ఫౌజి’ డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో సినిమాను తీసుకొస్తున్నారు. ప్రభాస్‌కు అన్ని భాషల్లో మార్కెట్ ఉన్నా, ఒక్క పోస్టర్ లేదా ట్రైలర్‌తో సరిపెట్టకుండా ఆయా మార్కెట్లలో డైరెక్ట్ గా సినిమా గురించి మాట్లాడేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా హిందీ బెల్ట్‌లో ప్రభాస్ తో ఈవెంట్స్, ఇంటర్వ్యూలు ఉండే అవకాశం ఉందట.
ఇందుకు సినిమా కథ కూడా ఒక కారణం కావచ్చు. హను రాఘవపూడి ‘ఫౌజి’ని పీరియడ్ కథగా తెరకెక్కిస్తున్నారు. 1940ల నేపథ్యం, సుభాష్ చంద్రబోస్ సైన్యంలోని సైనికుడి ప్రయాణం చుట్టూ కథ సాగుతుందని ఇప్పటివరకు వచ్చిన సమాచారం. ప్రభాస్ రెగ్యులర్ యాక్షన్ సినిమా కాకుండా వేరే ప్రపంచంలో కనిపించబోతున్నాడు. అలాంటి కథను ప్రేక్షకులకు ముందుగానే పరిచయం చేయడానికి హీరో ప్రమోషన్స్‌లో ఉంటే టీమ్‌కు మరింత ఉపయోగపడుతుంది.
పైగా మైత్రీ మూవీ మేకర్స్‌కు దేశవ్యాప్తంగా పెద్ద సినిమాలను ప్రమోట్ చేసిన అనుభవం ఉంది. టీ సిరీస్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమైంది. ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తుండగా, మిథున్ చక్రవర్తి, జయప్రద, అనుపమ్ ఖేర్ లాంటి పేర్లు కూడా సినిమాలో ఉన్నాయి. ఒక్క ప్రభాస్ మార్కెట్ మీదే వదిలేయకుండా, ఈ కాస్ట్‌ను కూడా ప్రమోషన్స్‌లో ఉపయోగించుకునే స్కోప్ ఉంది.
ప్రభాస్ మాత్రం ప్రస్తుతం తన లైనప్ తో చాలా బిజీగానే ఉన్నాడు. ‘ఫౌజి’ పనులతో పాటు సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ కూడా చేస్తున్నాడు. తర్వాత ‘కల్కి 2’, ‘సలార్ 2’ ఉన్నాయి. అలాంటి బిజీ షెడ్యూల్ మధ్య ‘ఫౌజి’ కోసం ప్రత్యేకంగా టైమ్ కేటాయిస్తే, ప్రమోషన్స్ విషయంలో నిజంగానే ఆయన పాత పద్ధతి నుంచి బయటకు వచ్చినట్టే.
ఇప్పటివరకు ‘ఫౌజి’ నుంచి రిలీజ్ డేట్ పోస్టర్ సహా కొన్ని అప్డేట్స్ మాత్రమే వచ్చాయి. అసలు క్యాంపెయిన్ మాత్రం ఇంకా మొదలుకావాల్సి ఉంది. ప్రభాస్ దేశంలోని మెయిన్ సిటీలకు వెళితే వచ్చే బజ్ మామూలుగా ఉండదు. ఆమధ్య రాధే శ్యామ్ కోసం కూడా ప్రభాస్ చాలా వరకు ప్రమోషన్ లో పాల్గొన్నారు. బాహుబలి టైమ్ లో కూడా మాట్లాడడానికి ఇబ్బంది పడిన డార్లింగ్ ఆ తరువాత మెల్లమెల్లగా ఆ లిమిట్ ను దాటే ప్రయత్నం అయితే అప్పుడు చేశాడు. ఇక మళ్ళీ ఇన్నాళ్లకు ఫౌజి తో మళ్ళీ ఆ డార్లింగ్ వైబ్స్ చూసే చాన్స్ ఉంటుంది. మరి ప్రమోషన్ డోస్ ఎప్పుడూ పెంచుతారో చూడాలి.