ఎకో: మిస్టరీ కుక్కలతో వృద్ధురాలు.. నెట్‌ఫ్లిక్స్ లో ఈ సినిమా చూశారా?
ఇక కథ విషయానికి వస్తే.. కేరళ, కర్ణాటక బోర్డర్ లోని ఒక దట్టమైన అడవిలో ఒక వృద్ధురాలు ఒంటరిగా ఉంటుంది.;
ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. కంటెంట్ ఉంటే చాలు బడ్జెట్ తో పనిలేదని నిరూపిస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి కోవలోకే వస్తుంది మలయాళ చిత్రం 'ఎకో'. కేవలం 5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా 50 కోట్లు వసూలు చేసిందట. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ లో తెలుగులో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
'కిష్కింధకాండం' లాంటి మిస్టరీ థ్రిల్లర్ ను అందించిన దింజిత్ అయ్యతన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. మలయాళ సినిమాలు ఇష్టపడే వారికి ఈయన మేకింగ్ స్టైల్ మీద ఒక ఐడియా ఉంటుంది. ఈసారి కూడా అలాంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తోనే వచ్చారు. అడవి నేపథ్యంలో సాగే ఈ కథలో మనం ఊహించని ట్విస్టులు ఉంటాయని చూసిన వారు చెబుతున్నారు. రొటీన్ ఫార్మాట్ కు దూరంగా సాగే కథనం దీని ప్రత్యేకత.
ఇక కథ విషయానికి వస్తే.. కేరళ, కర్ణాటక బోర్డర్ లోని ఒక దట్టమైన అడవిలో ఒక వృద్ధురాలు ఒంటరిగా ఉంటుంది. ఆమెకు తోడుగా కొన్ని భయంకరమైన కుక్కలు ఉంటాయి. తప్పించుకు తిరుగుతున్న ఆమె భర్త కోసం పోలీసులు వెతుకుతుంటారు. అసలు ఆ బామ్మ అక్కడ ఎందుకుంది, ఆ కుక్కల వెనుక ఉన్న మిస్టరీ ఏంటి అనేది ఆసక్తికరంగా ఉంటుంది. లైన్ సింపుల్ గా అనిపించినా ట్రీట్ మెంట్ కొత్తగా ఉందని అంటున్నారు.
సినిమా చూసిన ఆడియన్స్ నుంచి వినిపిస్తున్న ప్రధానమైన పాజిటివ్ పాయింట్ క్లైమాక్స్. చివరి అరగంట సినిమాకు ప్రాణం పోసిందని అంటున్నారు. ముఖ్యంగా కుక్కలకు సంబంధించిన సన్నివేశాలు భయాన్ని పుట్టిస్తాయని, ఆ సౌండ్ డిజైన్ కూడా బాగుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. సస్పెన్స్ ను చివరి వరకు మెయింటైన్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడని మెజారిటీ వర్గాల అభిప్రాయం.
అయితే ప్రతి మలయాళ సినిమాకు ఉండే చిన్న కంప్లైంట్ దీనికి కూడా ఉంది. కథనం చాలా నెమ్మదిగా సాగుతుందని, ఫాస్ట్ పేస్ కోరుకునే వారికి అక్కడక్కడ బోర్ కొట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు. క్యారెక్టర్ల ఎస్టాబ్లిష్ మెంట్ కు ఎక్కువ టైమ్ తీసుకోవడం, కొన్ని చోట్ల లాగ్ అనిపించడం మైనస్ గా చెబుతున్నారు. కానీ థ్రిల్లర్ జానర్ ఇష్టపడే వారికి ఈ స్లో నరేషన్ పెద్దగా ఇబ్బంది పెట్టకపోవచ్చు.
మొత్తానికి ఎకో ఒక డీసెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ అని పబ్లిక్ టాక్. ఎలాంటి అంచనాలు లేకుండా చూస్తే మంచి థ్రిల్ ఇస్తుందని అంటున్నారు. ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ క్లీన్ కంటెంట్ కావడం, తెలుగు ఆడియో కూడా అందుబాటులో ఉండటంతో ఈ వీకెండ్ వాచ్ లిస్ట్ లో చేర్చుకోవచ్చు. కమర్షియల్ హంగులు ఆశించకుండా ఒక మంచి మిస్టరీ కథను చూడాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.