ఈ హీరో ప‌ని ఖ‌త‌మ్ అనుకుంటే కాపాడిన ఫ్రాంఛైజీ!

ఇటీవలి కాలంలో అజయ్ దేవగన్ కెరీర్‌లో సరైన హిట్లు లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో ఆ ఒక్క ఫ్రాంఛైజీ అత‌డికి ఔషధంలా పనిచేసి నిలబెట్టిందనే చెప్పాలి.

Update: 2026-10-03 19:30 GMT

ఇటీవలి కాలంలో అజయ్ దేవగన్ కెరీర్‌లో సరైన హిట్లు లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో ఆ ఒక్క ఫ్రాంఛైజీ అత‌డికి ఔషధంలా పనిచేసి నిలబెట్టిందనే చెప్పాలి. ఖాన్‌లు, కపూర్‌లు బాలీవుడ్‌‌ను ఏలుతున్న కాలంలోనే ఒక యాక్షన్ హీరోగా తంటూకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను తెచ్చుకున్న అజయ్ దేవగన్ కాప్ డ్రామాలతో పాపులర్ అయ్యారు. ఆ తర్వాత `దృశ్యం` లాంటి క్రైమ్ థ్రిల్లర్‌తో తన స్థానాన్ని అత్యంత తెలివిగా కాపాడుకుంటూ వస్తున్నారు. నిజానికి ఊపు తెచ్చే ఇలాంటి ఒక ఫ్రాంఛైజీ లేక‌పోతే దేవ‌గ‌న్ ప‌రిస్థితి ఎలా ఉండేదో. వ‌ర‌స‌గా కొన్ని ఫ్లాపులు స‌తాయిస్తూ నీర‌సం పుట్టించిన స‌మ‌యంలో ఇది ఉత్సాహం తెచ్చిన ఫ్రాంఛైజీ. ప్రతి హీరో కెరీర్‌లోనూ ఇలాంటి ఒక పవర్‌ఫుల్ ఫ్రాంఛైజీ ఉండటం ఎంతైనా అవసరం.

తాజాగా విడుదలైన `దృశ్యం 3` బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లతో చరిత్ర సృష్టించింది. ఈ సినిమా అధికారిక మొదటి రోజు నికర వసూళ్లు రూ. 62 కోట్లతో ఘన విజయాన్ని నమోదు చేశాయి. ట్రేడ్ అంచనాలు రూ. 65 కోట్ల నికర వసూళ్లను దాటగా... నిర్మాత తెలిపిన సంఖ్య దీనికి కాస్త తక్కువగా ఉంది. ఏది ఏమైనా రణ్‌వీర్ సింగ్ నటించిన `ధురంధర్: ది రివెంజ్` షారుఖ్ ఖాన్ `జవాన్` చిత్రాల తర్వాత బాలీవుడ్ చరిత్రలోనే మూడో అతిపెద్ద ఓపెనింగ్‌‌ను `దృశ్యం 3` సొంతం చేసుకుంది. ఇక `పుష్ప‌ 2: ది రూల్` చిత్రాన్ని కూడా కలుపుకుంటే హిందీ బెల్ట్‌లో ఆల్-టైమ్ నాలుగో అతిపెద్ద ఓపెనర్‌గా ఈ సినిమా నిలిచింది.

`దృశ్యం: ది కన్‌క్లూజన్` సాధించిన ఈ భారీ ఓపెనింగ్ మరింత ప్రత్యేకంగా నిలవడానికి ప్రధాన కారణం.. ఇది పూర్తి స్థాయి యాక్షన్ సినిమా కాకపోవడమే. సాధారణంగా ఫ్యామిలీ థ్రిల్లర్ జానర్‌కు చెందిన సినిమాలు ఇంత భారీ ఓపెనింగ్స్ సాధించడం అరుదు. అయినా కానీ..`దృశ్యం` బ్రాండ్ ఇమేజ్ ప్రజల్లో దానికి ఉన్న క్రేజ్ అలాగే మాస్ వర్గాల్లో అజయ్ దేవగన్‌కు ఉన్న బలమైన పట్టు ఈ బంపర్ ఓపెనింగ్‌కు దోహదపడ్డాయి.

మహారాష్ట్ర - ఎన్‌సీఆర్ సర్క్యూట్‌లలో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించింది. అంతేకాకుండా అజయ్ దేవగన్ గత చిత్రమైన `సింఘం అగైన్` రూ. 43.7 కోట్ల నికర వసూళ్ల ఓపెనింగ్ రికార్డును భారీ మార్జిన్‌తో అధిగమించి దేవ‌గ‌న్ కెరీర్‌‌లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది. ఓవర్సీస్‌లోనూ ఈ థ్రిల్లర్ చిత్రం అంచనాలను తలక్రిందులు చేస్తూ దాదాపు 2 మిలియన్ డాలర్లు రాబట్టింది. ఇది కూడా అజయ్ దేవగన్ కెరీర్‌లో రికార్డే.

ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు వసూళ్లు రూ. 93 కోట్ల గ్రాస్‌ను దాటడం విశేషం. కొన్ని ప్రాంతాలలో థియేటర్ల కెపాసిటీ సమస్యలు ఎదురైనా.. ఒకవేళ అవి లేకపోతే ఈ సినిమా సులువుగా వంద కోట్ల మార్క్‌‌ను దాటేది. విడుదలైన తొలి రోజే బ్లాక్‌బస్టర్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమా.. మునుముందు రోజుల్లో మరిన్ని బాక్సాఫీస్ రికార్డులను ఏ విధంగా తిరగరాస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News