తానా అంటే తందానతాన అనే బ్యాచ్ ని ఎలా చూడాలి?
సొంత ఆలోచనలు, ప్రశ్నించే తత్వం లోపించి ఒకరు ఏం చెప్పినా గుడ్డిగా సమర్థించే `తానా అంటే తందానాస` అనే వర్గంపై ఓ ప్రముఖ నటి చక్కని విశ్లేషణ చేశారు.
సొంత ఆలోచనలు, ప్రశ్నించే తత్వం లోపించి ఒకరు ఏం చెప్పినా గుడ్డిగా సమర్థించే `తానా అంటే తందానాస` అనే వర్గంపై ఓ ప్రముఖ నటి చక్కని విశ్లేషణ చేశారు. బుర్రకథలో కథకుడు చెప్పే ప్రతి మాటకూ పక్కనున్నవారు ఆలోచించకుండా `తందానా` అని వంత పాడినట్లుగానే నేటి సమాజంలోనూ అనేకమంది స్వతంత్రతను కోల్పోయి వ్యక్తమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎదుటివారు చెబుతున్నది నిజమా? కాదా? అనే ప్రాథమిక విచక్షణను కూడా పక్కనపెట్టి ప్రయోజనాల కోసం ఊకొట్టే ధోరణిని తీవ్రంగా నిరసించారు.
ఈ రకమైన `తందానా బ్యాచ్` అమాయకత్వంతోనే అలా చేయడం లేదని, దీని వెనుక వారి స్వార్థ ప్రయోజనాలు, మనుగడ అవసరాలు దాగి ఉన్నాయని నటి విశ్లేషించారు. వ్యవస్థలో నిర్ణయాధికారం ఉన్నవారు లేదా పవర్‌లో ఉన్నవారు ఎలాంటి తప్పుడు ప్రకటన చేసినా? తమ ఉనికికి లేదా అవకాశాలకు ఎక్కడ గండి పడుతుందోననే భయంతో చాలామంది నోరు మెదపరు. అవసరాల నిమిత్తం మారు మాట్లాడకుండా ఉండటమే కాకుండా పైస్థాయి వ్యక్తులని సంతోషపెట్టడానికి వారు చెప్పే ప్రతి అబద్ధాన్ని సత్యంగా ప్రచారం చేయడానికి కూడా వెనుకాడరని సదరునటి ఎత్తి చూపారు.
ఈ తరహా ధోరణి వల్ల సమాజంలో నిజమైన ప్రతిభకు, ప్రజాస్వామ్యబద్ధమైన చర్చలకు తావు లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక రంగంలో లేదా సమాజంలో మార్పు రావాలంటే ప్రశ్నించే గొంతులు చాలా అవసరమని కానీ అందరూ `ఔను` అని తలలూపే సమూహాలుగా మారిపోతే తప్పులను సరిదిద్దే అవకాశమే ఉండదని వ్యాఖ్యానించారు. గుడ్డి సమర్థన అనేది వ్యవస్థలోని అక్రమాలకు, ఏకపక్ష నిర్ణయాలకు బలాన్ని చేకూరుస్తుందని ఇది అంతిమంగా సమాజ వికాసానికే హానికరమని అభిప్రాయపడ్డారు.
సోషల్ మీడియా, గ్లామర్ రంగాల్లో ఈ బ్యాచ్ ప్రభావం మరీ ఎక్కువగా కనిపిస్తుందని నటి పేర్కొన్నారు. నిజానిజాలు తెలుసుకోకుండా గుంపులో గోవిందా అంటూ అందరితో కలిసి జై కొట్టడం లేదా ప్రతికూల ప్రభావాన్ని తట్టుకోలేక మిన్నకుండిపోవడం అనేవి వ్యాధిలా విస్తరిస్తున్నాయన్నారు. నైతిక విలువలను పక్కనపెట్టి, కేవలం తాత్కాలిక లాభాల కోసమే శృతి మించిన భజన సంస్కృతికి అలవాటు పడటం వల్ల వ్యక్తిగత విశ్వసనీయత దెబ్బతింటుందని హెచ్చరించారు.
ఇలాంటి పరిస్థితుల్లో నిజాయితీగా, నిష్పాక్షికంగా మాట్లాడే వ్యక్తులు ఒంటరిగా మారే ప్రమాదం ఉందని విచారం వ్యక్తం చేశారు. నిజం చెప్పేవారిని పక్కనపెట్టి `తందానా` అనే అవకాశవాదులకే ప్రాధాన్యత దక్కే వాతావరణం నెలకొనడం దురదృష్టకరమన్నారు. అయినా సరే సమాజంలో నిలకడైన గుర్తింపు పొందాలంటే తాత్కాలిక ప్రయోజనాల కోసం రాజీ పడకుండా సొంత ఆలోచనలు కలిగి ఉండటమే ఏకైక మార్గమని స్పష్టం చేశారు.
చివరగా ప్రజలు .. వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఈ `తానా అంటే తందానా` ధోరణి నుంచి బయటపడాలని పిలుపు నిచ్చారు. ప్రతీ విషయాన్ని విశ్లేషించే చైతన్యం పెరిగినప్పుడే ఆరోగ్యకరమైన సమాజం నిర్మాణం అవుతుందని తెలిపారు. భయాన్నో, అవసరాన్నో ఆసరాగా చేసుకుని సత్యాన్ని దాచిపెట్టడం కన్నా.. నిజాయితీగా మాట్లాడే ధైర్యాన్ని పెంపొందించుకోవడమే నిజమైన వ్యక్తిత్వానికి నిదర్శనమని సదరు నటి పిలుపునిచ్చారు.