12 ఏళ్ల నరకం.. చివరికి ఆఖరి చూపుకు కూడా రానివ్వలేదు!
బాలీవుడ్ సీనియర్ నటి జీనత్ అమన్ వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలు, వైవాహిక బంధంలోని మానసిక క్షోభ గురించి ఇటీవల సంచలన విషయాలను పంచుకున్నారు.
బాలీవుడ్ సీనియర్ నటి జీనత్ అమన్ వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలు, వైవాహిక బంధంలోని మానసిక క్షోభ గురించి ఇటీవల సంచలన విషయాలను పంచుకున్నారు. వెండితెరపై ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న జీనత్ వ్యక్తిగత జీవితంలో మాత్రం తీవ్రమైన ఒడిదొడుకులను ఎదుర్కొన్నారు. నటుడు మజార్ ఖాన్‌తో జీనత్ సాగించిన 12 ఏళ్ల వివాహ జీవితంలో పరాయి స్త్రీ సంబంధాలు, భర్త తీవ్ర అనారోగ్యం, కుటుంబ పర మైన వేధింపులు వంటి అనేక కష్టాలు అనుభవించాల్సి వచ్చింది. ఓ టాక్ షోలో వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్ గా మారాయి.
వివాహమైన మొదటి ఏడాదే తాను తప్పుడు నిర్ణయం తీసుకున్నానని జీనత్ గ్రహించారు. మొదటి కుమారుడు అజాన్ గర్భంలో ఉన్న సమయంలోనే మజార్ ఖాన్ మరొక మహిళతో సంబంధం పెట్టుకున్నారనే వార్తలు పత్రికల్లో వచ్చాయి. వాస్తవానికి తల్లి కావాలనే ఆకాంక్షతోనే ఈ పెళ్లి చేసుకున్నానని, కానీ మొదటి సంవత్సరం నుంచే భర్త నుంచి ఎలాంటి మద్దతు లభించలేదని పేర్కొన్నారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, వారి కోసం ఈ చేదు బంధంలోనే 12 సంవత్సరాల పాటు కొనసాగవలసి వచ్చిందన్నారు.
చిన్న కుమారుడు జహాన్‌కు ఐదేళ్లు వచ్చాక బంధం నుంచి బయటపడి తిరిగి నటనపై దృష్టి పెట్టాలని జీనత్ అనుకున్నారు. అదే సమయంలో మజార్ ఖాన్ తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యారు. 18 నెలల పాటు ఆయన శరీరం వెలుపల మెడికల్ బ్యాగ్‌తో జీవించాల్సి రాగా, జీనత్ స్వయంగా ఆయనకు పరిచర్యలు చేస్తూ అండగా నిలిచారు. సుదీర్ఘ కాలం పాటు రోగికి సేవలు చేయడం వల్ల ఆమె తీవ్ర మానసిక ఒత్తిడికి గురై నెర్వస్ బ్రేక్‌డౌన్ అయ్యేంత ప్రమాదకర స్థితికి చేరుకున్నారు.
అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత మజార్ ఖాన్ ప్రిస్క్రిప్షన్ పెయిన్‌కిల్లర్స్ కు తీవ్రంగా బానిసయ్యారు. రోజుకు ఏడు మాత్రల వరకు మింగుతూ ఆరోగ్యాన్ని దెబ్బతీసుకున్నారు. భార్యాపిల్లలు ఎంత వేడుకున్నా ఆయన ఆ అలవాటును మానలేదు. చివరికి ఆ మాత్రల ప్రభావం వల్ల మూత్రపిండాలు చెడిపోయి 1998లో తుదిశ్వాస విడిచారు. అయితే అంతకంటే ముందే జీనత్ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ఆ బంధం నుంచి వేరుపడ్డారు.
మజార్ మరణం తర్వాత ఆయన కుటుంబ సభ్యులు జీనత్ పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించారు. ఆయన అంత్యక్రియలకు కూడా జీనత్‌ను అనుమతించకుండా ఆఖరి చూపుకు దూరంగా ఉంచారు. `నేను ఆయన ప్రాణాలు కాపాడటానికి ఎంతో పోరాడాను. కానీ ఆయన కుటుంబం నన్ను నిందించడానికే ప్రయత్నించింది` అని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే మజార్ వద్ద ఉన్న ప్రతి పైసాని ఆయన తల్లి .. సోదరి తీసుకున్నారని, తన పిల్లలను కూడా తనకి దూరం చేయడానికి ప్రయత్నించారని జీనత్ ఆరోపించారు.
`విజయాలు నమ్మకాన్ని ఇస్తే, గుండెకోత సరిహద్దులను నేర్పిస్తుంది` అని జీనత్ వ్యాఖ్యానించారు. మరొకరి కోసం మిమ్మల్ని మీరు నాశనం చేసుకుంటూ ఎవరినీ కాపాడలేరని గ్రహించారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో క్రియాశీలకంగా ఉంటూ కుమారులతో కలసి జీవిస్తున్న జీనత్ అమన్ ఇటీవల ఒటిటిలోకి అడుగు పెట్టారు.