రూ.155 కోట్లు... ఇది ఎన్టీఆర్ డ్రాగన్ రేంజ్!
ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే.
ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉన్నా షూటింగ్‌కు అంతరాయం, ఎన్టీఆర్‌కి గాయం, స్క్రిప్ట్‌లో చిన్న చిన్న మార్పులు వంటి కారణాల వల్ల ఆలస్యం అవుతూ వస్తోంది. ప్రస్తుతానికి ఎన్టీఆర్ చేతి గాయం కారణంగా షూటింగ్ వాయిదా పడింది. అతి త్వరలోనే సినిమా షూటింగ్ ను పునః ప్రారంభించబోతున్నట్లు ఇటీవలే ఎన్టీఆర్ డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా చెప్పుకొచ్చిన విషయం తెల్సిందే. ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ చేతి నొప్పితో ఇంకా బాధ పడుతున్నట్లు గా కనిపించింది. మరో నెల రోజుల పాటు ఎన్టీఆర్ విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత డ్రాగన్ షూటింగ్‌లో పాల్గొంటాడని, అందుకోసం ప్రశాంత్ నీల్ ఏర్పాట్లు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
డ్రాగన్ ఓటీటీ డీల్ క్లోజ్...?
ఒక వైపు సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తున్నా సినిమా బజ్ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే పలు ఏరియాల్లో భారీ మొత్తాల్లో బిజినెస్ డీల్స్ క్లోజింగ్ దశలో ఉన్నాయి. ఇక అత్యంత ఆసక్తిని రేకెత్తించిన ఓటీటీ డీల్ సైతం దాదాపుగా ఫైనల్ అయిందనే వార్తలు వస్తున్నాయి. ప్రముఖ ఓటీటీ డ్రాగన్ సినిమాను ఏకంగా రూ.155 కోట్లకు కొనుగోలు చేసేందుకు రెడీగా ఉందని, ఇతర ఓటీటీలు వంద కోట్లు, అంతకు మించి ఆఫర్ చేశాయని, ఒక ఓటీటీ మాత్రం రూ.155 కోట్లు ఆఫర్ చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఓటీటీ డీల్ విషయమై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ప్రముఖంగా ఈ విషయం గురించి చర్చ జరుగుతోంది. సినిమా విడుదల సమయంకు మరింతగా బజ్ క్రియేట్ అయ్యి ఈ రేటు మరింత పెరిగినా ఆశ్చర్యం లేదని కొందరు అంటున్నారు.
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్...
ఓటీటీ డీల్ క్లోజ్ చేస్తే రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయాల్సి ఉంటుంది. అయితే ఎన్టీఆర్ చేతి గాయంతో పాటు, పలు కారణాల వల్ల సినిమా ఆలస్యం అవుతున్న కారణంగా ఎప్పటికి సినిమా పూర్తి అవుతుంది, విడుదల ఎప్పుడు ఉంటుంది అనే విషయంలో స్పష్టత లేదు. కనుక కాస్త ఆలస్యంగానే ఓటీటీ డీల్ ను క్లోజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఒక రిలీజ్ డేట్‌ను అనుకున్నప్పటికీ ఆ తేదీలో అయినా సినిమా వస్తుందా అంటే ఏమో డౌటే అన్నట్లుగా యూనిట్ సభ్యులు సైతం నమ్మకంగా చెప్పలేక పోతున్నారు. ఎన్టీఆర్ పూర్తి ఆరోగ్యంతో వచ్చినప్పుడే షూటింగ్ మొదలు పెట్టాలని ప్రశాంత్ నీల్ భావిస్తున్నాడట. అందుకే రిలీజ్ మళ్లీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి అనేది కొందరి మాట. మొత్తానికి డ్రాగన్ సినిమా ఓటీటీ డీల్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
సలార్, కేజీఎఫ్...
ఇంకా షూటింగ్ చాలానే ఉంది, సినిమా నుంచి టీజర్, పాటలు రాలేదు. అయినా కూడా రూ.155 కోట్ల ను ఇచ్చేందుకు ఓటీటీ సంస్థ ముందుకు వచ్చిందంటే సినిమాకు ఏ స్థాయిలో బజ్ క్రియేట్ అయిందో అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో ఓటీటీ డీల్‌కు సంబంధించిన చర్చ జరుగుతున్న నేపథ్యంలో నందమూరి ఫ్యాన్స్ ఇది మా ఎన్టీఆర్ డ్రాగన్ రేంజ్ అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సౌత్ ఇండియన్ సినిమాల్లో చాలా తక్కువ సినిమాలు మాత్రమే రూ.150 కోట్లు అంతకు మించిన ఓటీటీ డీల్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ జాబితాలో ఎన్టీఆర్ డ్రాగన్ చేరిన నేపథ్యంలో అభిమానులతో పాటు అన్ని వర్గాల వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేజీఎఫ్, సలార్‌లను మించి డ్రాగన్ సినిమా ఉంటుంది అంటూ చాలా నమ్మకంగా ప్రశాంత్ నీల్ సన్నిహితులతో చెబుతున్నాడట. ఎన్టీఆర్ కి ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలువబోతుందని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.