$110 బిలియన్ల భారీ డీల్: స్కైడాన్స్ గా మారిన‌ పారామౌంట్ - వార్నర్ బ్రోస్ ఉమ్మడి సంస్థ!

హాలీవుడ్‌లో అతిపెద్ద విలీన ఒప్పందానికి మార్గం సుగమమైన వేళ ఓ సంచలన నిర్ణయం వెలుగులోకి వచ్చింది.

Update: 2026-10-03 10:29 GMT

హాలీవుడ్‌లో అతిపెద్ద విలీన ఒప్పందానికి మార్గం సుగమమైన వేళ ఓ సంచలన నిర్ణయం వెలుగులోకి వచ్చింది. పారామౌంట్ స్కైడాన్స్ -వార్నర్ బ్రోస్ డిస్కవరీ విలీనం అనంతరం ఏర్పడే ఉమ్మడి సంస్థకు `స్కైడాన్స్` అని పేరు పెట్టనున్నట్లు పారామౌంట్ స్కైడాన్స్ సిఈఓ డేవిడ్ ఎల్లిసన్ ప్రకటించారు. రెండు దిగ్గజ స్టూడియోల చారిత్రక గుర్తింపును, బ్రాండ్ విలువను అలాగే కాపాడుతూనే ఉమ్మడి సంస్థకు కొత్త గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

ఈ పేరును ఎంచుకోవడానికి గల కీలక కారణాలను వివరించారు. పారామౌంట్- వార్నర్ బ్రోస్ రెండింటికీ వినోద ప్రపంచంలో ఎంతో విశిష్టమైన చరిత్ర, గుర్తింపు ఉన్నాయని పేర్కొన్నారు. ఒక కొత్త కార్పొరేట్ పేరు ద్వారా ఈ రెండు ఐకానిక్ బ్రాండ్‌ల ప్రాముఖ్యత తగ్గకూడదనే భావనతో ఉమ్మడి సంస్థకు ప్రత్యేక ఐడెంటిటీని ఇస్తూనే ఆయా బ్రాండ్‌లను యథాతథంగా కొనసాగించనున్నట్లు స్పష్టం చేశారు. కార్పొరేట్ నిబంధనల ప్రకారం ఈ కంపెనీ తన చట్టబద్ధమైన పేరును `స్కైడాన్స్ కార్పొరేషన్` గా అక్టోబర్ 6న అధికారికంగా మార్చుకోనుంది.

అదే రోజున సంస్థ క్లాస్ బి షేర్లు నాస్‌డాక్ నుంచి న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్ కి మారనున్నాయి. అక్కడ ఇవి ప్రస్తుత `PSKY' అనే టిక్కర్ బదులుగా `SKYD` అనే కొత్త శీర్షిక కింద ట్రేడ్ కానున్నాయి. సుమారు $110 బిలియన్ల (110 బిలియన్ డాలర్లు) విలువైన ఈ భారీ విలీన ఒప్పందానికి అమెరికా న్యాయస్థానం ఇటీవల ఆమోదం తెలిపింది. ఈ విలీనం వల్ల సినిమా, టీవీ రంగాల్లో ధరలు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేస్తూ కాలిఫోర్నియాతో పాటు 12 రాష్ట్రాలు దాఖలు చేసిన పిటిషన్‌పై సెప్టెంబర్ 21న కుదిరిన ఒప్పందాన్ని కోర్టు ఆమోదించింది.

దీంతో నెలల తరబడి కొనసాగిన ఆటంకాలు తొలగి విలీన ప్రక్రియ తుది దశకు చేరుకుంది. కంపెనీ నిర్వహణ పరంగా కూడా డేవిడ్ ఎల్లిసన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మ్యాటెల్ సిఈఓగా ఉన్న ఐనాన్ క్రెయిజ్ ను సహ-సిఈఓ గా నియమించారు. ఐనాన్ క్రెయిజ్ రోజువారీ కార్యకలాపాలు, విలీన ప్రక్రియను పర్యవేక్షిస్తుండగా, ఎల్లిసన్ సృజనాత్మక అంశాలు -వ్యూహాత్మక నిర్ణయాలపై దృష్టి సారిస్తారు. కొత్తగా ఏర్పాటైన ఈ దిగ్గజ సంస్థ దాదాపు $80 బిలియన్ల అప్పులను నిర్వహిస్తూనే $6 బిలియన్ల వ్యయాన్ని తగ్గించుకోవాలనే సవాలుతో కూడిన లక్ష్యాలను నిర్దేశించుకుంది.

అయితే మీడియా విశ్లేషకులు ఈ పేరు మార్పును భిన్న కోణంలో చూస్తున్నారు. సంస్థకు `స్కైడాన్స్` అని పేరు పెట్టడం ఎల్లిసన్ నాయకత్వ శైలికి - హాలీవుడ్ ప్రముఖ బ్రాండ్‌లపై ఆయన సాధించిన ఆధిపత్యానికి నిదర్శనమని ఈమార్కెటర్ సీనియర్ అనలిస్ట్ రాస్ బెనెస్ అభిప్రాయపడ్డారు. ఏదేమైనా? హాలీవుడ్‌లో సరికొత్త శకానికి నాంది పలుకుతూ రూపొందుతున్న మీడియా దిగ్గజం రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.

Tags:    

Similar News