గేమ్ ఛేంజర్ ఎఫెక్ట్... ఆ డ్రీమ్ ప్రాజెక్ట్ అసాధ్యం!
శంకర్ ప్రస్తుతం తదుపరి సినిమా పనిలో ఉన్నాడని అంతా భావిస్తున్నారు. కానీ ఆయనతో వర్క్ చేయడంకు ఏ హీరో కూడా ముందుకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.;
రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొంది ఈ ఏడాది ఆరంభంలో సంక్రాంతి కానుకగా వచ్చిన 'గేమ్ ఛేంజర్' తీవ్రంగా నిరాశ పరిచిన విషయం తెల్సిందే. శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించాడు. గేమ్ ఛేంజర్ సినిమాతో చాలా నష్టపోయాం అని స్వయంగా నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ లు పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. గేమ్ ఛేంజర్ సినిమా తర్వాత దర్శకుడు శంకర్ కనీసం మాట్లాడలేదని నిర్మాత శిరీష్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. శంకర్ ప్రస్తుతం తదుపరి సినిమా పనిలో ఉన్నాడని అంతా భావిస్తున్నారు. కానీ ఆయనతో వర్క్ చేయడంకు ఏ హీరో కూడా ముందుకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
శంకర్ ఒకప్పుడు సౌత్ ఇండియాలోనే కాకుండా పాన్ ఇండియా రేంజ్‌లో టాప్ డైరెక్టర్. ఆయన నుంచి వచ్చిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకున్నాయి. కానీ అది అంతా గతం.. ఇప్పుడు మాత్రం ఆయన సినిమాలు అసలు ఆడటం లేదు. గత దశాబ్ద కాలంగా ఆయన తీవ్రమైన ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాడు. ఇండియన్ 2 అంటూ చేసి అట్టర్ ఫ్లాప్ అయ్యాడు, ఇండియన్ 3 విడుదల ఉందని అంటున్నారు. అది ఉంటుందా లేదా అనేది ఇంకా తెలియడం లేదు. ఇక గేమ్ ఛేంజర్ తెలుగు, తమిళ భాషల్లో చవిచూసిన ఫలితం మెగా ఫ్యాన్స్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శంకర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
గేమ్ ఛేంజర్ సినిమా హిట్ అయ్యి ఉంటే దర్శకుడు శంకర్ ఇప్పటికే ఇండియన్ 3 సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేసే వాడు, అంతే కాకుండా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన 'వేల్పారి' ని కూడా మొదలు పెట్టేవాడు. గేమ్ ఛేంజర్ ప్రమోషన్ సమయంలో దర్శకుడు శంకర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వెంకటేషన్ రాసిన తమిళ నవల 'వీర యుగ నాయగన్ వేల్పరి' ను సినిమా రూపంలో తీసుకు వచ్చేందుకు స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఆ సమయంకు స్క్రిప్ట్ వర్క్ సగానికి పైగానే పూర్తి అయిందని, మూడు పార్ట్‌లుగా వేల్పరి సినిమాను తీసుకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నట్లుగా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
భారీ బడ్జెట్‌తో, భారీ స్టార్ కాస్టింగ్‌తో వేల్పరి సినిమాను శంకర్ అనుకున్నాడు. కానీ గేమ్ ఛేంజర్ మొత్తం మార్చేసింది. ఆయన వింటేజ్ సినిమాలను చూసి ఇప్పుడు ఆయనతో సినిమాలు చేసేందుకు నిర్మాతలు ముందుకు వచ్చే పరిస్థితి లేదు. కొత్త నిర్మాణ సంస్థలకు ఇప్పటికే లైకా ప్రొడక్షన్స్, దిల్ రాజు ప్రొడక్షన్స్‌కి ఏం జరిగిందో తెలుసు. అందుకే శంకర్‌తో సినిమా అంటే బాబోయ్ నీకో దండం అన్నట్లుగా వెనక్కి తగ్గుతున్నారు. ఇక స్టార్ హీరోలు ఇంతకు ముందు శంకర్ దర్శకత్వంలో నటించాలని కలలు కంటూ ఉండే వారు. కానీ ఇప్పుడు ఆ స్టార్ దర్శకులు శంకర్‌కి దొరక్కుండా తిరుగుతున్నారు.
చిన్న హీరోలు కూడా శంకర్ సర్‌తో అవసరమా అన్నట్లుగా భయపడుతున్నారు. ఇలాంటి సమయంలో శంకర్ తేరుకోవాలన్నా, ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కాలన్నా దాదాపు అసాధ్యం అనే అభిప్రాయంను వ్యక్తం చేస్తున్నారు. మొదట ఆయన అంతా కొత్త వారితో చిన్న సినిమాను తీసి, తనను తాను నిరూపించుకోవాల్సి ఉంది. అప్పుడు ఆయన మళ్లీ ఫామ్‌లోకి వచ్చినట్లు అవుతుందని నెట్టింట కొందరు చర్చించుకుంటున్నారు. మరి శంకర్ పూర్వ వైభవం సాధించే అవకాశాలు ఉన్నాయా అనేది కాలమే నిర్ణయించాలి.