పోగొట్టుకున్న చోటే వెతుక్కుంటున్న దిల్ రాజు
టాలీవుడ్ లో అగ్ర నిర్మాతగా వెలుగొందుతున్న దిల్ రాజుకు బాలీవుడ్ మీద ఎప్పటి నుంచో కన్నుంది.;
టాలీవుడ్ లో అగ్ర నిర్మాతగా వెలుగొందుతున్న దిల్ రాజుకు బాలీవుడ్ మీద ఎప్పటి నుంచో కన్నుంది. అక్కడ కూడా తన మార్క్ చూపించాలని చాలా ప్రయత్నాలు చేశారు. కానీ దురదృష్టవశాత్తు ఆయన వేసిన ప్లాన్స్ బాక్సాఫీస్ దగ్గర బెడిసికొట్టాయి. అయినా సరే వెనక్కి తగ్గకుండా, ఇప్పుడు మరో భారీ ప్రయోగానికి సిద్ధమయ్యారు. ఈసారి మామూలు కంటెంట్ తో కాదు, తెలుగు బాక్సాఫీస్ ను షేక్ చేసిన ఒక మాస్ మసాలా సబ్జెక్ట్ తో నార్త్ ఆడియన్స్ ను టార్గెట్ చేశారు.
గతంలో కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలను నమ్మి హిందీలో రీమేక్ చేస్తే దిల్ రాజుకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. నాని 'జెర్సీ', విశ్వక్ సేన్ 'హిట్' వంటి సినిమాలు తెలుగులో ఎంత పెద్ద హిట్టయ్యాయో తెలిసిందే. కానీ హిందీలో మాత్రం అవి డిజాస్టర్స్ గా మిగిలాయి. థియేట్రికల్ గా అవి నిర్మాతలకు నష్టాలనే మిగిల్చాయి. అందుకే ఈసారి స్ట్రాటజీ మొత్తం మార్చేశారు. క్లాస్ సినిమాలు కాకుండా, పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ ను ఎంచుకున్నారు.
అసలు విషయం ఏంటంటే.. తెలుగులో ఏకంగా 300 కోట్లు కొల్లగొట్టి సంక్రాంతి విన్నర్ గా నిలిచిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాను దిల్ రాజు హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం బాలీవుడ్ ఖలాడీ అక్షయ్ కుమార్ ను హీరోగా లాక్ చేశారు. కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన డైరెక్టర్ అనీస్ బాజ్మీ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ తో దిల్ రాజు బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.
గతంలో హిందీలో చేసిన సినిమాలు వేరే నిర్మాతలతో కలిసి చేసిన జాయింట్ వెంచర్స్. కానీ ఈసారి దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ ను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. మరీ ఎక్కువ మంది పార్ట్నర్స్ లేకుండా, తానే దగ్గరుండి నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్ట్ సినిమాలు, ప్రయోగాత్మక చిత్రాల జోలికి పోకుండా, ఆడియన్స్ కు నచ్చే పక్కా మాస్ ఎంటర్టైనర్ అయితేనే సేఫ్ అని ఆయన బలంగా ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది. అందుకే ఈ బ్లాక్ బస్టర్ కథను ఎంచుకున్నారు.
ఈ సినిమాను 2026 క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి.. అనే సామెతను దిల్ రాజు గట్టిగా ఫాలో అవుతున్నారు. గత పరాజయాల నుంచి పాఠాలు నేర్చుకుని, ఈసారి ఎలాగైనా బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర హిట్టు కొట్టాలని కసిగా ఉన్నారు. అక్షయ్ కుమార్ కామెడీ టైమింగ్, అనీస్ బాజ్మీ మేకింగ్ స్టైల్ ఈ సినిమాకు ప్లస్ అవుతాయని నమ్ముతున్నారు.
దిల్ రాజు వేస్తున్న ఈ కొత్త స్కెచ్ వర్కవుట్ అయితే, బాలీవుడ్ లో ఆయన జెండా పాతినట్లే. తెలుగులో 300 కోట్లు సాధించిన ఈ సినిమా, హిందీలో అక్షయ్ మార్క్ తో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి. వరుస ప్లాపుల్లో ఉన్న అక్షయ్ కి, బాలీవుడ్ లో సాలిడ్ హిట్ కోసం చూస్తున్న దిల్ రాజుకు ఈ సినిమా చాలా కీలకం కానుంది.