500 కోట్ల క్ల‌బ్: 3 రోజుల్లో దురంధ‌ర్ 2 సంచ‌ల‌నం

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో `దురంధర్: ది రివెంజ్` (దురంధర్ 2) సరికొత్త చరిత్ర సృష్టించింది. విడుదలైన కేవలం మూడు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 501.04 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది.;

Update: 2026-03-22 17:55 GMT

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో `దురంధర్: ది రివెంజ్` (దురంధర్ 2) సరికొత్త చరిత్ర సృష్టించింది. విడుదలైన కేవలం మూడు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 501.04 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. మార్చి 19న విడుదలైన ఈ సినిమా కేవలం రెండు రోజుల్లోనే ఇండియాలో 500 కోట్ల గ్రాస్ వసూళ్లను అధిగ‌మించింది. మూడవ రోజు ఏకంగా 113 కోట్లు రాబట్టడంతో దేశీయంగా మొత్తం వసూళ్లు 339.27 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు సాధ్య‌మైంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇప్ప‌టికి 500కోట్ల గ్రాస్ వ‌సూలైంద‌ని `సాక్ నిల్క్` త‌న క‌థ‌నంలో పేర్కొంది. రణవీర్ సింగ్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్ వంటి భారీ తారాగణంతో తెర‌కెక్కిన ఈ చిత్రానికి ఆదిత్యాధ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

ఈ సినిమా సక్సెస్ కేవలం భారత్‌కే పరిమితం కాకుండా గ్లోబల్ స్థాయిలో మార్మోగిపోతోంది. న్యూయార్క్‌లోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్‌లో `దురంధర్ 2` పోస్టర్లు, డిజిటల్ బిల్‌బోర్డ్‌లు ప్రదర్శితం కావడంతో అంతర్జాతీయంగా ఈ చిత్రం క్రేజ్ ప్ర‌జ‌ల‌కు అర్థ‌మ‌వుతోంది. రణవీర్ సింగ్ దురంధరుని లుక్ టైమ్స్ స్క్వేర్ స్క్రీన్‌లపై మెరవడం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే వాణిజ్య కేంద్రంలో మన ఇండియన్ సినిమా తళుక్కుమనడం భారతీయ సినిమా గర్వించదగ్గ విషయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సాక్ నిల్క్ బాక్సాఫీస్ లెక్కల ప్రకారం.. అతి తక్కువ కాలంలో 500 కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రాల జాబితాను పరిశీలిస్తే.. `దురంధర్ 2` అగ్రస్థానంలో నిలుస్తుంది. గతంలో బాహుబలి 2 (హిందీ వెర్షన్ ఇత‌ర వెర్ష‌న్లు క‌లుపుకుని వరల్డ్ వైడ్) కేవలం 3 నుండి 4 రోజుల్లో ఈ మైలురాయిని అందుకుంది. అలాగే ఆర్‌ఆర్ఆర్, కేజీఎఫ్ 2 చిత్రాలు కూడా విడుదలైన 3-4 రోజుల్లోనే 500 కోట్ల గ్రాస్ మార్కును చేరుకున్నాయి. షారుఖ్ ఖాన్ నటించిన `జవాన్` చిత్రం కేవలం 4 రోజుల్లో ఈ ఘనత సాధించగా, రజనీకాంత్ జైలర్ 7 రోజుల్లో ఈ మార్కును దాటింది. రిషబ్ శెట్టి కాంతార, విక్కీ కౌశల్ చావా చిత్రాలు లాంగ్ రన్‌లో ఈ వసూళ్లను సాధించాయి.

ప్రస్తుతం `దురంధర్ 2` వసూళ్ల ప్రవాహం చూస్తుంటే ఇది వెయ్యి కోట్ల క్లబ్ వైపు శరవేగంగా దూసుకుపోతుందని స్పష్టమవుతోంది. ఆదిత్యా ధర్ టేకింగ్ , నటీనటుల పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నాయి. ముఖ్యంగా రణవీర్ సింగ్ కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలవనుంది. బాక్సాఫీస్ వద్ద ఈ రేంజ్ ఊచకోత కోస్తున్న ఈ సినిమా భవిష్యత్తులో ఇంకెన్ని రికార్డులను బద్దలు కొడుతుందో వేచి చూడాలి.

ద‌ర్శ‌క‌ధీరుడి ప్ర‌శంస‌లు:

ఇప్ప‌టికే దురంధ‌ర్ 2 పై టాలీవుడ్ టాప్ స్టార్లు అంద‌రూ ప్ర‌శంస‌లు కురిపించారు. దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సైతం ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించారు. దురంధర్ -1 త‌న‌కు బాగా న‌చ్చింద‌ని.. కానీ దురంధర్ 2 స్కేల్ - సోల్ పరంగా మొదటి భాగాన్ని మించిపోయిందని ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పేర్కొన్నారు. నాలుగు గంటల నిడివి ఉన్న సినిమాను తీయడానికి ఎంతో ధైర్యం కావాలని.. ప్రేక్షకులు చివరి ఫ్రేమ్ వరకు సీటుకే అతుక్కుపోయేలా ఆదిత్యా ధర్ మాయ చేశారని రాజమౌళి కొనియాడారు. రైటింగ్, కాస్టింగ్, మ్యూజిక్, ఎమోషనల్ పతాక స్థాయి సన్నివేశాలు ఈ సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లాయని ఆయన ప్రశంసించారు.

Tags:    

Similar News