సీనియర్ హీరోల సీక్రెట్ లుక్ సస్పెన్స్!
దశాబ్దాలుగా ఏలుతున్న సీనియర్ స్టార్ హీరోలు తమ సినిమాల ప్రమోషన్స్ విషయంలో సరికొత్త వ్యూహాన్ని అనుసరిస్తున్నారు.
దశాబ్దాలుగా ఏలుతున్న సీనియర్ స్టార్ హీరోలు తమ సినిమాల ప్రమోషన్స్ విషయంలో సరికొత్త వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. సినిమా షూటింగ్ దశ నుంచే లీకులు రాకుండా జాగ్రత్త పడుతూ సరికొత్త మేకోవర్ .. లుక్స్‌పై సస్పెన్స్‌ను మెయింటైన్ చేస్తున్నారు. సాధారణ అప్‌డేట్స్ కాకుండా హీరోల పుట్టినరోజులు .. ప్రత్యేక పండుగ సందర్భాలను ఎంచుకుని ఫస్ట్ లుక్ పోస్టర్లు .. టీజర్‌లను విడుదల చేసే సంప్రదాయానికి ఇండస్ట్రీలో పెద్దపీట వేస్తున్నారు. ఈ ట్రెండ్‌లో ముందు వరుసలో ఉన్న కింగ్ నాగార్జున ప్రతిష్టాత్మకమైన 100వ సినిమా లుక్‌ను గోప్యంగా ఉంచు తున్నారు.
నాగ్ కెరీర్‌లోనే ఇది మైలురాయి చిత్రంగా నిలవనుండటంతో ఇందులో ఆయన గెటప్ ఎలా ఉండబోతుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రత్యేకమైన లుక్‌ను నాగ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రకటన కోసం అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ మెగా 158 లుక్ విషయంలో ఎలాంటి వార్తా బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ..టీజర్‌ను మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్ 22న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. బాబీ లాంటి దర్శకులతో వరుస హిట్లతో దూసుకుపోతున్న చిరంజీవి ఈసారి ఎలాంటి భిన్నమైన మేకోవర్‌లో కనిపించబోతున్నారనేది టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు నటసింహం బాలకృష్ణ సైతం జోరును కొనసాగిస్తూ ఏకకాలంలో రెండు సినిమాలను సెట్స్‌పైకి తీసు కెళ్లారు. ఆ చిత్రాలకు సంబంధించిన టైటిల్స్ .. ఫస్ట్ లుక్స్ ఇప్పటికే అంచనాలను పెంచగా మిగిలిన పాత్రల గెటప్స్, యాక్షన్ మోషన్ పోస్టర్ల విషయమై అంతే ఆసక్తి నెలకొంది.
బాలయ్య ప్రతి సినిమాలోనూ వైవిధ్యమైన మాస్ లుక్‌తో అలరిస్తుండటంతో తాజా రెండు ప్రాజెక్ట్‌లలో ఆయన రూపం ఎలా ఉండబోతుందనే దానిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇలా సీనియర్ హీరోలు తమ చిత్రాల గెటప్స్‌ను చివరి వరకు సస్పెన్స్‌గా ఉంచడం వల్ల సోషల్ మీడియాలో నిత్యం ట్రెండింగ్‌లో ఉండేందుకు వీలవుతుంది. అభిమానులలో అంచనాలను పీక్స్‌కు చేర్చడానికి అలాగే ప్రీ-రిలీజ్ బిజినెస్ పరంగా హైప్ క్రియేట్ చేయడానికి సీక్రెట్ లుక్ పాలసీ చక్కగా ఉపయోగపడుతోంది. డిజిటల్ యుగంలో ఫోటోలు లీకయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నా? చిత్ర యూనిట్ పకడ్బందీంగా భద్రతా చర్యలు తీసుకుంటూ కేవలం అధికారిక ప్రకటనల ద్వారానే ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తోంది.
ప్రస్తుతం సీనియర్ హీరోల సరికొత్త వ్యూహం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో వరుసగా రానున్న స్టార్ హీరోల ఫస్ట్ లుక్స్ టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. అప్పట్లో సినిమా విడుదలతోనే మ్యాజిక్ చేసిన సీనియర్లు ఇప్పుడు పబ్లిసిటీ ట్రెండ్స్‌ను కూడా తమదైన శైలిలో మలుచుకుని యువ హీరోలకు పోటీగా నిలుస్తున్నారు.