తండ్రి బాటలో ధృవ్ విక్రమ్?
ఇప్పుడు మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు ధృవ్. ఈ సినిమా టైటిల్ బిషన్- కాలమదన్.;
ఈ రోజుల్లో ప్రజలను థియేటర్లకు రప్పించాలంటే సినిమా కంటెంట్‌లో ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి. డిఫరెంట్ సినిమాలకే జనం ప్రాధాన్యతనిస్తున్నారు. సినిమాలో నటించే హీరో కూడా ఏదో ఒక కొత్తదనం ప్రదర్శించేవాడైతేనే ఆదరణ పొందుతున్నాడు. కోలీవుడ్ లో రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్, విజయ్, సూర్య లాంటి దిగ్గజ హీరోలు ఉన్నా, తనదైన అద్భుత నటన, ప్రయోగాలతోనే నిలబడగలిగాడు చియాన్ విక్రమ్. అతడు తన కెరీర్ ఆద్యంతం ప్రయోగాలు చేస్తూ ఉత్తమ నటుడిగా ఎదిగాడు. జాతీయ ఉత్తమ నటుడు కూడా అయ్యాడు.
చియాన్ విక్రమ్ నటించిన సేతు, శివపుత్రుడు, అన్నియన్, నాన్న, ఐ.. ఇలా నటించిన ప్రతి సినిమా ప్రయోగమే. ప్రతి సినిమాలో ప్రయోగాత్మక పాత్రలతో ఆకట్టుకున్నాడు. వేషం, నటన పరంగా కమల్ హాసన్ తర్వాత చియాన్ మాత్రమే అన్ని ప్రయోగాలు చేయగలిగారు. అందుకే విక్రమ్ నటవారసుడు ధృవ్ విక్రమ్ సినీపరిశ్రలో ప్రవేశిస్తున్నాడు అనగానే సర్వత్రా ఆసక్తి నెలకొంది. ధృవ్ కెరీర్ ఆరంభం చాక్లెట్ బోయ్ లుక్ తో ఎంట్రీ ఇచ్చాడు. అర్జున్ రెడ్డి రీమేక్ `ఆదిత్య వర్మ`తో ఆరంగేట్రం చేసిన అతడు నటుడిగా ఫర్వాలేదనిపించాడు. ఆ తర్వాత వర్మ, మహాన్ అనే సినిమాలలో నటించాడు. మహాన్ చిత్రంలో చియాన్ విక్రమ్ తో కలిసి నటించడం అతడికి మరపురాని సందర్భం. ఈ చిత్రంలో ధృవ్ నటనకు మంచి పేరొచ్చింది.
ఇప్పుడు మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు ధృవ్. ఈ సినిమా టైటిల్ బిషన్- కాలమదన్. ఈ కొత్త సినిమా కోసం గెటప్ ఛేంజ్ చేసాడు. చాక్లెట్ బోయ్ లాంటి ధృవ్ రఫ్ లుక్ ట్రాన్స్ ఫర్మేషన్ ఆశ్చర్యపరుస్తోంది. ఇది చూడగానే చియాన్ వారసుడి సాహసాలు మొదలయ్యాయా? ధృవ్ విక్రమ్ ప్రయోగాలకు శ్రీకారం చుడుతున్నాడా? అంటూ అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఈ సినిమా నుంచి రెండు సింగిల్స్ విడుదలై ఆకట్టుకున్నాయి. తాజాగా రిలీజైన రెక్క రెక్క పాటలో ధ్రువ్ విక్రమ్ కఠినమైన వ్యాయామాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఈసారి ధ్రువ్ రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తున్నాడు. లుక్ పరంగా అనూహ్యమైన మార్పులు చూపిస్తున్నాడు. యువనటుడి అంకితభావానికి అభిమానుల నుండి చాలా ప్రశంసలు అందుతున్నాయి. రెక్క రెక్క పాటలో అతను కబడ్డీ ప్లేయర్‌గా ప్రాక్టీస్ చేసే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకర్షించాయి. అతని పరివర్తనను చూసి, అభిమానులు యువనటుడి సినీ కెరీర్‌లో ఇది ఒక పెద్ద మలుపు అవుతుందని ఆశిస్తున్నారు.
మారి సెల్వరాజ్ మరోసారి నిజఘటనల ఆధారంగా సినిమాని తెరకెక్కిస్తుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంటోంది. ఈ సినిమాపై అభిమానులలో గొప్ప అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా తండ్రి బాటలో ధృవ్ విక్రమ్ కూడా ప్రయోగాత్మక పాత్రలతో మెప్పించాలనే కసితో పని చేస్తుండడం సర్వత్రా ఆసక్తిని కలిగిస్తోంది.