12 ఎకరాల్లో 30-కాటేజ్ రిసార్ట్ నిర్మిస్తున్న హీరో
ధర్మేంద్ర మహారాష్ట్రలో రూ. 17 కోట్లకు పైగా ఆస్తులను సొంతం చేసుకున్నారు. దాదాపు రూ. 88 లక్షలకు పైగా విలువైన వ్యవసాయ భూమి.. రూ. 52 లక్షల విలువైన వ్యవసాయేతర భూమి కూడా అతడికి ఉన్నాయి.;
రంగుల ప్రపంచంలో స్టార్ డమ్ ఛేజిక్కించుకుంటే, దాంతో పాటే ఆదాయం గ్రాఫ్ దానంతట అదే స్కైని తాకుతుంది. దశాబ్ధాల పాటు సినీరంగాన్ని ఏలిన ప్రముఖ వెటరన్ నటుడు ధర్మేంద్ర తన జీవితకాలంలో ఏకంగా 335 కోట్లు సంపాదించాడు. అతడి నికర ఆస్తుల విలువ ఇటీవల అంతకంతకు పెరుగుతోందనేది ఆర్థిక వేత్తల సర్వే. అతడు వ్యవసాయ భూములు కొన్నాడు. రియల్ వెంచర్లలో పెట్టుబడులు పెట్టాడు. రిసార్ట్స్ సహా ఆతిథ్య రంగంలో కోట్లాది రూపాయలను వెచ్చించాడు. ఇప్పుడు ఈ వ్యాపారాలన్నీ దినదినాభివృద్ధి చెంది భారీ ఆదాయాలను తెస్తున్నాయి. సినీ నిర్మాతగాను ఇండస్ట్రీలో పాపులరయ్యారు ధర్మేంద్ర. అతడు ఆస్పత్రి పాలయ్యారని, కండిషన్ క్రిటికల్ గా ఉందని ప్రచారమైన నేపథ్యంలో తన గురించి అభిమానుల్లో విస్త్రతంగా చర్చ సాగుతోంది.
ఫామ్ హౌస్ లో విన్యాసాలు:
89ఏళ్ల ధర్మేంద్ర కేవలం నటుడు మాత్రమే కాదు.. తెలివైన నిర్మాత. అందుకే అతడు తన ఆదాయాన్ని గణనీయంగా పెంచుకోగలిగారు.. అతడికి 100 ఎకరాల్లో విశాలమైన ఫామ్ హౌస్ ఉంది. ముంబై ఔటర్ లో ప్రశాంతంగా ఉండే లోనవాలా లో ఈ వ్యవసాయ క్షేత్రం ఉందని తెలిసింది. ఇక్కడ సకల సౌకర్యాలు ఉన్నాయి. అతడు ఇక్కడ ఉన్న వేడినీళ్ల పూల్ లో ఆక్వా థెరపీతో రిలాక్సవుతుంటారు. ధర్మేంద్ర పూల్ సైడ్ రిలాక్స్ థెరపీకి సంబంధించిన ఫోటోలు ఇప్పటికే అంతర్జాలంలోకి వచ్చాయి.
తన పేరుతోనే రెస్టారెంట్లు:
నిజానికి ధర్మేంద్రను హీ-మ్యాన్ అని, గరం ధరమ్ అని కూడా పిలుస్తారు. ఈ పేర్లను అతడు తన రెస్టారెంట్లకు కూడా పెట్టుకున్నాడు. 2015లో న్యూఢిల్లీలో గరం ధరమ్ ధాబాతో రెస్టారెంట్ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. 2022లో కర్నాల్ హైవేలో హీ-మ్యాన్ అనే మరో భోజనశాలను ప్రారంభించాడని బిజినెస్ పత్రికలు వెల్లడించాయి.
ఆస్తులు - వ్యాపారాలు:
ధర్మేంద్ర మహారాష్ట్రలో రూ. 17 కోట్లకు పైగా ఆస్తులను సొంతం చేసుకున్నారు. దాదాపు రూ. 88 లక్షలకు పైగా విలువైన వ్యవసాయ భూమి.. రూ. 52 లక్షల విలువైన వ్యవసాయేతర భూమి కూడా అతడికి ఉన్నాయి. ప్రస్తుతం లోనావాలా ఫామ్‌హౌస్ సమీపంలో ఒక రిసార్ట్‌ను అభివృద్ధి చేయడం ద్వారా హాస్పిటాలిటీ వ్యాపారంలోకి మరింత విస్తరించాలని యోచిస్తున్నట్లు సమాచారం. అతడు లోనవాలా ఆస్తికి సమీపంలో 12 ఎకరాల స్థలంలో 30-కాటేజ్ రిసార్ట్‌ను నిర్మించడానికి పాపులర్ రెస్టారెంట్ చైన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నాడు.
లగ్జరీ కార్లంటే ఆసక్తి:
ధర్మేంద్ర విలాసపురుషుడు. అతడికి లగ్జరీ కార్లంటే విపరీతమైన ఆసక్తి. ఆయన మొదటి బహుమతిగా పొందిన వింటేజ్ ఫియట్ కారు ఇప్పటికీ తనతో ఉంది. రూ.85.74 లక్షల విలువైన రేంజ్ రోవర్ ఎవోక్, రూ.98.11 లక్షల విలువైన మెర్సిడెస్-బెంజ్ ఎస్.ఎల్ 500 తన గ్యారేజీలో ఉన్నాయి. అవన్నీ అధునతన సాంకేతికతతో అబ్బురపరిచే కార్లు.
వారసుల పరిచయం:
ధర్మేంద్ర సినీనిర్మాతగాను పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. 1983లో ఆయన తన నిర్మాణ సంస్థ విజయత ఫిల్మ్స్‌ను ప్రారంభించారు. ఈ బ్యానర్ లో తన కుమారులు సన్నీ డియోల్, బాబీ డియోల్‌లను వరుసగా బేతాబ్ (1983), బర్సాత్ (1995) చిత్రాలతో బాలీవుడ్‌కు పరిచయం చేశారు. ధర్మేంద్ర తన మనవడు కరణ్ డియోల్ తొలి చిత్రం `పాల్ పాల్ దిల్ కే పాస్`(2019)ను నిర్మించారు.
అవన్నీ ఫేక్:
వెటరన్ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ చివరి దశలో ఉన్నారని పుకార్లు షికార్ చేసాయి. కానీ ఇంతలోనే కుటుంబీకులు ఇవి ఫేక్ వార్తలు అంటూ కొట్టి పారేసారు. ధర్మేంద్ర కోలుకుంటున్నారన్న ప్రకటన వెలువడటంతో అభిమానులు రిలాక్స్ డ్ గా ఉన్నారు.