ఆ విషయాలు జీవితాంతం గుర్తుంటాయి
తాజాగా ఒక తమిళ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగార్జున ఒక దిగ్గజ నటుడని ధనుష్ కొనియాడాడు.;
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రల్లో క్లాసికల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న సినిమా కుబేర. వచ్చే నెల 20వ తేదీన ఈ సినిమాను వరల్డ్ వైడ్‌గా విడుదల చేసేందుకు సినిమా యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ పాన్ ఇండియా మూవీ రిలీజ్ కోసం తెలుగు, తమిళ అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ధనుష్ కెరీర్‌లో ఈ సినిమా 51వది కాగా, తాజాగా అతడు ఈ మూవీ గురించి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నాగార్జునపై ప్రశంసల వర్షం కురిపించాడు.
తాజాగా ఒక తమిళ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగార్జున ఒక దిగ్గజ నటుడని ధనుష్ కొనియాడాడు. నాగార్జున వంటి దిగ్గజ నటుడితో కలిసి కుబేరలో నటించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని ధనుష్ తెలిపాడు. నాగార్జున సార్ నటించిన ఎన్నో ఎవర్‌గ్రీన్ సినిమాలను ఇప్పటికీ అభిమానులు ఆరాధిస్తారని ధనుష్ చెప్పాడు. నాగార్జున సార్ పని విధానంకు తను పెద్ద అభిమానినని తెలిపాడు. ముఖ్యంగా నాగార్జున నటించిన తమిళ సినిమా రచ్చగాన్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పాడు.
నాగార్జున సార్‌తో కలిసి ఈ సినిమాలో పని చేయడం తన అదృష్టమని ధనుష్ చెప్పాడు. నాగ్ సార్ నటించడం చూసి చాలా నేర్చుకున్నానని, ఆయన ఒక స్ఫూర్తిదాయకమైన వ్యక్తి అని కొనియాడాడు. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా ఆయన నుంచి నేర్చుకున్న విషయాలను జీవితాంతం గుర్తుంటాయని చెప్పాడు. నాగ్ సార్ నుంచి నేర్చుకున్న విషయాలు భవిష్యత్‌లో తాను ఆచరించడానికి కచ్చితంగా ప్రయత్నిస్తానని ధనుష్ తెలిపాడు. నాగార్జున అంటే తనకు చాలా గౌరవమని చెప్పాడు.
నాగార్జున సార్ సినిమాలను, నటనను ఎంతో కాలంగా చూస్తూ వచ్చిన తనకు ఆయనతో కలిసి నటించే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ శేఖర్ కమ్ములకు నిజంగా కృతజ్ఞతలు తెలపాలని చెప్పాడు. ఇక, తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్ కూడా అభిమానులను బాగా ఆకట్టుకుంది. ధనుష్, నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాను ఏషియన్ సునీల్ నారంగ్, రామ్ మోహన్‌రావు సంయుక్తంగా నిర్మించారు. టీజర్‌లో దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం విన్నాక ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ధనుష్ ఈ సినిమా టీజర్‌లో ధనికుడు, బిచ్చగాడిగా విభిన్న పాత్రల్లో కనిపించగా నాగార్జునను ఈడీ అధికారి పాత్రలో డైరెక్టర్ చూపించారు.