ధమాల్ 4 ట్రైలర్: కాలం చెల్లిన అదే మూసలోనే మళ్లీ మళ్లీ!
బాలీవుడ్ పాపులర్ కామెడీ ఫ్రాంచైజీ నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న `ధమాల్ 4` (టోటల్ ధమాల్ సిరీస్) ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది.
బాలీవుడ్ పాపులర్ కామెడీ ఫ్రాంచైజీ నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న `ధమాల్ 4` (టోటల్ ధమాల్ సిరీస్) ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది. ఇంద్ర కుమార్ దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రం జూలై 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సరికొత్త ట్రైలర్ ఆద్యంతం వినోదం, సాహసం, గందరగోళం వంటి అంశాలతో నిండిపోయింది. అయితే అప్పటి పాత క్రేజ్‌ను గుర్తుచేసేలా ఈ సినిమాని తెరకెక్కించారని మరోసారి ట్రైలర్ గుర్తు చేసింది. అయితే ఈ ట్రైలర్‌పై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు కూడా వ్యక్తమవుతున్నాయి. కొన్నేళ్ల క్రితం ఈ ఫ్రాంచైజీ ప్రారంభమైనప్పటి ఫ్లేవర్‌కు, ఇప్పటి ఫ్లేవర్‌కు పెద్దగా మార్పు లేకపోవడం దీనికి పెద్ద మైనస్ గా మారింది. ప్రస్తుతం సినిమా రంగం ఎంతో ఎదిగింది.. ప్రేక్షకుల అభిరుచులు కూడా పూర్తిగా మారాయి. అయినప్పటికీ ప్రస్తుత `జెన్ జీ` తరానికి నచ్చే విధంగా సరికొత్త కంటెంట్‌ను అందించడంలో ధమాల్ టీమ్ వెనుకబడిందా అనే సందేహాలు వస్తున్నాయి.
సినిమాలో అజయ్ దేవగన్, అర్షద్ వార్సి, రితీష్ దేశ్‌ముఖ్, జావేద్ జాఫేరి, సంజయ్ మిశ్రా వంటి స్టార్ కాస్ట్‌తో పాటు ఇషా గుప్తా, సంజీదా షేక్, అంజలి ఆనంద్, రవి కిషన్ వంటి భారీ తారాగణం నటిస్తున్నారు. అయితే మారిన పాన్ ఇండియా ట్రెండ్‌కు అనుగుణంగా కంటెంట్‌లో మార్పులు చేయాల్సి ఉంటుంది. కేవలం పాత ఫార్ములాతోనే విజువల్ గ్రాండియర్‌గా సినిమాను నిర్మించడం కాకుండా, నేటి కాలానికి తగ్గ కొత్తదనాన్ని చూపించడం చాలా అవసరం. సీనియర్ నటుడు, నిర్మాత అయిన అజయ్ దేవగన్ - దర్శకుడు ఇంద్ర కుమార్ ఈ బేసిక్ రూల్‌ను మర్చిపోయి కేవలం పాత కామెడీ ట్రాక్‌లనే నమ్ముకున్నారా అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
ఈ చిత్రాన్ని టి-సిరీస్ ఫిలిమ్స్, మారుతి ఇంటర్నేషనల్ - పనోరమా స్టూడియోస్ బ్యానర్లపై అజయ్ దేవగన్, భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, అశోక్ థాకేరియా, ఆనంద్ పండిట్, కుమార్ మంగత్ పాఠక్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భారీ నిర్మాణ విలువలు, నటీనటుల క్రేజీ పర్ఫార్మెన్స్ ట్రైలర్‌లో స్పష్టంగా కనిపిస్తున్నా కథనంలో కొత్తదనం ఎంతవరకు ఉందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పాత తరం ధమాల్ లవర్స్‌ను ఆకట్టుకునేలా ఉన్న ఈ కంటెంట్, మారుతున్న నేటి సినిమా ట్రెండ్‌ను ఎంతవరకు తట్టుకుంటుందో చూడాలి.
నిజానికి `ధమాల్` సిరీస్ అనేది బాలీవుడ్‌లో ఇప్పటివరకూ క్రేజీ సిట్యుయేషన్స్, అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో ఫ్యామిలీ ఆడియన్స్‌ను అలరించింది. ఇప్పుడు వస్తోన్న నాలుగో భాగం అంతకుమించి ఏదైనా కొత్తదనంతో - కొత్త ఎనర్జీతో అందిస్తుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది. మిశ్రమ స్పందనలు వస్తున్నా.. జూలై 10న థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో మరియు మారిన ప్రేక్షకుల అభిరుచిని ఎంతవరకు మెప్పిస్తుందో వేచి చూడాలి.