తెలుగు రాష్ట్రాల్లో E-టికెటింగ్ వ్యవస్థ? లెక్కలన్నీ 100% కరెక్ట్!!

తాజాగా కేరళ ప్రభుత్వం తమ రాష్ట్రంలో ఈ- టికెటింగ్ వ్యవస్థతో సినీ రంగాన్ని ఆధునీకరించనుంది. ఈ మేరకు అగ్రిమెంట్ కూడా చేసుకుంది.;

Update: 2025-09-30 11:21 GMT

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఏటా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో స్థూల ఆదాయాన్ని సాధిస్తున్న విషయం తెలిసిందే. 2023లో రూ.12వేల కోట్లకు పైగా స్థూల బాక్సాఫీస్ ఆదాయాన్ని సాధించిన భారతీయ చలనచిత్ర పరిశ్రమ.. 2024లో రూ. 11,833 కోట్లకుపై గా రాబట్టింది. చరిత్రలో రెండు అత్యధిక వసూళ్లు ఇవే.

అలా భారత్ లో సినిమాలకు భారీ మార్కెట్ ఉండటం వల్ల టికెటింగ్ వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకునే అవకాశం ఉందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. తాజాగా కేరళ ప్రభుత్వం తమ రాష్ట్రంలో ఈ- టికెటింగ్ వ్యవస్థతో సినీ రంగాన్ని ఆధునీకరించనుంది. ఈ మేరకు అగ్రిమెంట్ కూడా చేసుకుంది.

కేరళ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ (KSFDC), డిజిటల్ విశ్వవిద్యాలయం ఆఫ్ కేరళ ఒక అవగాహన ఒప్పందంపై ఇటీవల సంతకం చేశాయి. టికెట్స్ విషయంలో పారదర్శకత, రియల్ టైమ్ అమ్మకాల డేటా, ఆదాయ నిర్వహణ లక్ష్యంగా వ్యవస్థను సిద్ధం చేయనున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి ఈ- టికెటింగ్ వ్యవస్థను సిద్ధం చేయనుంది.

ఆ వ్యవస్థ.. సినీ ఇండస్ట్రీకి పూర్తి పారదర్శకతను కచ్చితంగా తీసుకురానుంది. పన్ను ఎగవేతను అరికడుతుంది. బాక్సాఫీస్ నెంబర్స్ ను పెర్ఫెక్ట్ గా ఇస్తుంది. ఆడియన్స్ నెంబర్స్ సహా అన్ని వంద శాతం లెక్కలు కరెక్ట్ గా చెబుతుంది. అదే సమయంలో టికెట్ బుకింగ్‌ లను సులభతరం చేస్తుంది. ప్రేక్షకులకు మంచి అనుభవాన్ని అందిస్తుంది.

దీంతో ఇప్పుడు ఆ వ్యవస్థను తెలుగు రాష్ట్రాల్లో అమలు చేయాలని డిమాండ్ వినిపిస్తోంది. అప్పుడే మాలీవుడ్ లా టాలీవుడ్ సినీ ఎన్విరాన్మెంట్ పారదర్శకంగా ఉంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో అలాంటి వ్యవస్థను గత ప్రభుత్వం ప్రవేశ పెట్టేందుకు ప్రతిపాదించింది. అమెరికాలోని రెంట్రాక్ మాదిరి వ్యవస్థను తీసుకొద్దామని అనుకుంది.

కానీ అప్పుడు అది జరగలేదు. ఇప్పుడు ఈ- టికెటింగ్ వ్యవస్థను తెలుగు రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలని అనేక మంది నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఏ సినిమా సత్తా అయినా అప్పుడే స్పష్టంగా తెలుస్తుందని చెబుతున్నారు. నిజమైన వసూళ్లు సహా అన్ని వివరాలు క్లారిటీగా తెలుస్తాయని అంటున్నారు. మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ- టికెటింగ్ వ్యవస్థను ఎప్పుడు తీసుకొస్తారో వేచి చూడాలి.

Tags:    

Similar News