తాతయ్య చెప్పాడని చేస్తే కెరీరే నాశనం!
దిష్మిఖ నగ్బాల్ పరిచయం అవసరం లేని పేరు. కోయిల, బాద్ షా, దిల్లగీ, పార్టనర్ లాంటి చిత్రాల్లో నటించింది.;
దిష్మిఖ నగ్బాల్ పరిచయం అవసరం లేని పేరు. కోయిల, బాద్ షా, దిల్లగీ, పార్టనర్ లాంటి చిత్రాల్లో నటించింది. బుల్లి తెరపైనా సీరియల్ నటిగా పేరుంది. బిగ్ బాస్ సీజన్ 8 లోనూ సత్తా చాటింది. ఇలా ఇండస్ట్రీలో చాలా కాలంగా ఉంది సీనియర్ బ్యూటీ. కానీ కెరీర్ లో మాత్రం ముందుకెళ్లలేకపోయింది. అందుకు కారణంగా తాను తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాలే కారణమంటోంది.
ఎవరైనా సీరియల్స్ నుంచి సినిమాలకు ప్రమోట్ అవుతారు. కానీ తాను మాత్రం సినిమాల నుంచి సీరియల్ కి ప్రమోట్ అయిన దాన్ని అంటూ అసంతృప్తిని వ్యక్తం చేసింది. అందుకు కొన్ని ప్రత్యేకమైన కారణాలు తెరపైకి తెచ్చింది. `అప్పట్లో యశ్ రాజ్, సుభాష్ వంటి వారు నిర్మించేవే ఏగ్రేడ్ సినిమాలుగా పరిగణించేవారు. కొత్త నిర్మాణ సంస్థ సినిమా చేస్తుందంటే అది బీ గ్రేడ్ సినిమాగా చిత్రీకరించేవారు.
ఈ విషయంలో చాలా గందరగోళానికి గురయ్యేదాన్ని. నాకు వెనుక గైడ్ చేసే వాళ్లు లేరు. ఈ రంగంలో సలహాలు ఇచ్చేవారుంటే బాగుండేనిపించేది. ఓసారి మా తాతయ్య ఏ పని చిన్నగా భావించకు. దొరికిన దాన్ని సీరియస్ గా తీసుకుని పనిచేయ్ అన్నారు. ఆయన మాటతో ఎలాంటి అవకాశం వచ్చినా చేసాను. ఈ క్రమంలో చాలా చెత్త సినిమాలు చేసాను. వాటిలో చాలా సినిమాలు రిలీజ్ కాకుండాపోయాయి. రిలీజ్ అయిన సినిమాలు కెరీర్ ని దెబ్బ కొట్టాయి.
`ట్రేడ్ గైడ్` సినిమా పోస్టర్ రిలీజ్ చేసారు. అప్పటికే నేను కొన్ని పెద్ద సినిమాలకు సంతకం చేసాను. కానీ ట్రేడ్ గైడ్ పోస్టర్ చూసి నిర్మాతలు నాతో ఒప్పందం రద్దు చేసుకున్నారు. బి గ్రేడ్ నటిగా భావించి పక్కన బెట్టారు. నాకు ఈ విషయం చాలా కాలం పాటు తెలియలేదు. ఛాన్స్ ఇవ్వండని రిక్వెస్ట్ చేసినా? నోఛాన్స్ అంటూ నిర్మొహమాటంగా రిజెక్ట్ చేసేవారు. ఆ కోపంతోనే సినిమాలను వదిలేసి సీరియల్స్ వైపు వచ్చాను` అంది.