దీపికకు డ్యామేజ్ సరే.. మరి కల్కికి జరిగే నష్టం?
వరుసగా రెండు భారీ చిత్రాల నుంచి ఇలా తప్పుకోవడం దీపిక ఇమేజ్‌ను బాగా డ్యామేజ్ చేసేదే అన్నది స్పష్టం. ఆమె కెరీర్ మీద ఈ పరిణామాలు ప్రతికూల ప్రభావం చూపుతాయని భావిస్తున్నారు.;
ఈ రోజుకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ న్యూస్ అంటే.. దీపికా పదుకొనే ‘కల్కి’ పార్ట్-2 నుంచి తప్పుకోవడమే. ఇది అన్ని భాషల సినీ పరిశ్రమల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఒక సినిమాకు సంతకం చేశాక.. ఏదో ఒక దశలో ఆర్టిస్టులు తప్పుకోవడం కొత్తేమీ కాదు. కానీ ఒక భారీ చిత్రం పార్ట్-1 సూపర్ సక్సెస్ అయ్యాక రెండో భాగం నుంచి కథానాయిక తప్పుకోవడం మాత్రం బహుశా ఇదే తొలిసారి కావచ్చు.
ఈ విషయంలో అందరూ దీపికా పదుకొనేనే నిందిస్తున్నారు. ఆమె ఈ మధ్య నిర్మాతలను బాగా ఇబ్బంది పెడుతోందని.. రకరకాల కండిషన్లు, డిమాండ్లతో చుక్కలు చూపిస్తోందని.. ఈ నేపథ్యంలోనే ‘స్పిరిట్’ నుంచి దీపికను సందీప్ రెడ్డి వంగ తప్పించాడని.. అయినా ధోరణి మారకపోవడంతో ఇప్పుడు ‘కల్కి’ టీం ఆమెకు గుడ్ బై చెప్పేసిందనే ప్రచారం సోషల్ మీడియా గట్టిగా జరుగుతోంది. దీపికను సోషల్ మీడియా జనాలు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
వరుసగా రెండు భారీ చిత్రాల నుంచి ఇలా తప్పుకోవడం దీపిక ఇమేజ్‌ను బాగా డ్యామేజ్ చేసేదే అన్నది స్పష్టం. ఆమె కెరీర్ మీద ఈ పరిణామాలు ప్రతికూల ప్రభావం చూపుతాయని భావిస్తున్నారు. ఐతే దీని వల్ల దీపికకు జరిగే నష్టం గురించి పక్కన పెడదాం. కానీ దీపిక తప్పుకోవడం వల్ల ‘కల్కి-2’కు జరిగే నష్టం సంగతేంటి అన్నది ఇప్పుడు ప్రశ్న. ‘కల్కి-2’ ఆషామాషీ సినిమా కాదు.
వందల కోట్ల బడ్జెట్‌తో ముడిపడింది. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్‌లో అదొకటి. ‘కల్కి’లో దీపిక చేసింది చిన్నా చితకా పాత్ర కాదు. కథ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంది. పార్ట్-1లో హీరో ప్రభాస్, అశ్వత్థామ పాత్ర చేసిన అమితాబ్‌లను మించి ఆమె పాత్ర హైలైట్ అయింది. ఆ క్యారెక్టర్లో దీపిక పెర్ఫామెన్స్ కూడా సూపర్ అనడంలో సందేహం లేదు.
ఆ పాత్రకు ప్రేక్షకులు బాగా అలవాటు పడ్డారు. ఇప్పుడు ఆ పాత్రలో మరొకరిని నటింపజేస్తే ఫీల్ దెబ్బ తినడం ఖాయం. స్టార్ స్టేటస్ ఉన్న ఇంకో మంచి నటిని తీసుకొచ్చినా.. ఆమెను రీప్లేస్ చేయడం అంత తేలిక కాదు. దీని వల్ల సినిమా ఎసెన్స్ దెబ్బ తినే ప్రమాదం కూడా ఉంటుంది. ఇది సినిమాకు చాలా నెగెటివ్ అవుతుందని తెలిసి కూడా దీపికను తప్పించారు అంటే.. ఆమె వల్ల ‘కల్కి’ టీం ఎంత ఇబ్బంది పడి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మరి ఈ సవాలును ‘కల్కి’ టీం ఎలా అధిగమిస్తుందో.. మరో నటితో ఆ పాత్రను చేయించి ప్రేక్షకులను ఎలా కన్విన్స్ చేస్తుందో చూడాలి.