జక్కన్న కోటలో 'గ్లోబ్ ట్రాటర్'.. టాప్ అప్డేట్స్
కౌంట్‌డౌన్ ముగిసింది. దేశం మొత్తం ఇప్పుడు హైదరాబాద్ వైపు చూస్తోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో రాజమౌళి ఒక అద్భుతానికి తెరలేపారు.;
కౌంట్‌డౌన్ ముగిసింది. దేశం మొత్తం ఇప్పుడు హైదరాబాద్ వైపు చూస్తోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో రాజమౌళి ఒక అద్భుతానికి తెరలేపారు. ఈ రోజు (నవంబర్ 15) సాయంత్రం, ఇండియన్ సినిమా చరిత్రలోనే అతిపెద్ద ఈవెంట్ జరగబోతోంది. 'గ్లోబ్ ట్రాటర్' పేరుతో జక్కన్న ప్లాన్ చేసిన ఈ సెటప్, అక్కడి ఏర్పాట్లు చూసి ఇండస్ట్రీ వర్గాలకే మైండ్ బ్లాంక్ అవుతోంది. ఇంతకీ లోపల ఏం జరగబోతోంది?
ఇది మామూలు సినిమా ఈవెంట్ కాదు. రాజమౌళి దీన్ని ఒక యుద్దంలా ప్లాన్ చేశారు. 'పాస్‌పోర్ట్' స్టైల్ పాసులతో లక్ష మందికి పైగా అభిమానులు ఇప్పటికే ఆర్ఎఫ్‌సికి తరలివస్తున్నారు. అయితే, లోపలికి వెళ్లిన తర్వాత వాళ్లు చూడబోయేది ఏంటి? జక్కన్న విజన్ ఏంటి? అనేదానిపై కొన్ని మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
అందులో మొదటిది.. ఈవెంట్ కోసం వాడుతున్న స్క్రీన్. ఇండియాలో ఇప్పటివరకు ఏ సినిమా ఈవెంట్‌కూ వాడని విధంగా ఏకంగా 130 అడుగుల భారీ ఎల్‌ఈడీ స్క్రీన్‌ను ఏర్పాటు చేశారు. ఈవెంట్‌కు అసలైన హైలైట్ మొత్తం కేవలం మూడు నిమిషాలే ఉండబోతోందట. ఆ మూడు నిమిషాల స్పెషల్ వీడియోలోనే సినిమా అఫీషియల్ టైటిల్, కాన్సెప్ట్, మహేష్ బాబు ఫస్ట్ లుక్‌ను రివీల్ చేయనున్నారు.
ఇక ఈ విజువల్ ఫీస్ట్‌కు స్టార్ల మెరుపులు కూడా తోడవుతున్నాయి. సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్న ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇప్పటికే సిటీకి చేరుకున్నారు. అయితే, అందరి కళ్లూ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంట్రీ కోసమే ఎదురుచూస్తున్నాయి. రాజమౌళి, ఎస్.ఎస్. కార్తికేయ ఇద్దరూ కలిసి.. మహేష్ కోసం ఊహించని రేంజ్‌లో, ఒక భారీ ఎంట్రీని ప్లాన్ చేశారట. ఈ ఎంట్రీ ఈవెంట్‌కే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుందని టాక్.
ఈ అద్భుతాన్ని ప్రపంచానికి చూపించడానికి కూడా జక్కన్న ప్లానింగ్ వేరే లెవెల్‌లో ఉంది. ఈవెంట్‌కు ఏ మీడియా కెమెరాలకు 'నో ఎంట్రీ' బోర్డు పెట్టేశారు. ఇండియాలో 'జియో హాట్‌స్టార్' మాత్రమే ఈ ఈవెంట్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా లైవ్ స్ట్రీమ్ చేయనుంది. ఇక ఓవర్సీస్ ఆడియన్స్ కోసం, ఏకంగా హాలీవుడ్ మీడియా దిగ్గజం 'వెరైటీ' యూట్యూబ్ ఛానెల్‌లో లైవ్ ఇవ్వబోతున్నారు. ఒక్క విజువల్ కూడా బయటకు లీక్ కాకుండా ప్లాన్ చేశారు.
లక్ష మందికి పైగా ఫ్యాన్స్ హాజరవుతుండటంతో పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజమౌళి కూడా ఫ్యాన్స్‌కు స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు. మొత్తానికి, ఈ 'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్ కేవలం ఒక టైటిల్ రివీల్ లా కాకుండా.. ఒక గ్లోబల్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌కు నాందిలా నిలవబోతోంది. ఈ సాయంత్రం జక్కన్న, మహేష్ బాబు కలిసి ఎలాంటి సంచలనం సృష్టిస్తారో చూడటానికి ఫ్యాన్స్ ఊపిరి బిగబట్టి ఎదురుచూస్తున్నారు.