సౌత్ మార్కెట్లో పాగా వేయడానికి దిగ్గజ కార్పొరేట్ల మాస్టర్ ప్లాన్.. అసలు వ్యూహం ఇదే!

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రాంతీయ మార్కెట్లు, ముఖ్యంగా సౌత్ సినిమా మార్కెట్ ఊహించని రేంజ్‌లో దూసుకుపోతోంది.

Update: 2026-07-01 00:30 GMT

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రాంతీయ మార్కెట్లు, ముఖ్యంగా సౌత్ సినిమా మార్కెట్ ఊహించని రేంజ్‌లో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో దక్షిణ భారత మార్కెట్‌తో పాటు దేశవ్యాప్తంగా పాగా వేయడానికి దిగ్గజ కార్పొరేట్ సంస్థలు ఒక భారీ మాస్టర్ ప్లాన్‌తో రంగంలోకి దిగుతున్నాయి. గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫైనాన్సింగ్ ప్లాట్‌ఫార్మ్ `సినీనౌ` ప్రముఖ మీడియా నిపుణుడు సిద్ధార్థ్ రాయ్ కపూర్‌ను తమ ప్రధాన సలహాదారుగా ఎంపిక చేసుకుని ఏకంగా 1,350 కోట్ల భారీ సినిమా ఐపీ (IP) పెట్టుబడుల విస్తరణకు శ్రీకారం చుట్టింది. దశాబ్దాల అనుభవజ్ఞుడైన సిద్ధార్థ్ రాయ్ కపూర్ వ్యూహాత్మక మార్గదర్శకత్వంలో భారీ ఎత్తున పాన్-ఇండియా సినిమాలను ప్లాన్ చేస్తూ వినోద రంగంలో సరికొత్త ఆర్థిక విప్లవానికి ఈ సంస్థ పునాది వేస్తోంది.

కార్పొరేట్ సంస్థలు నమ్ముతున్న ఈ `ఐపి` (ఇంటెలెక్చువ‌ల్ ప్రాప‌ర్టీ) ఇన్వెస్ట్‌మెంట్ పుష్ విధానం సాంప్రదాయ సినిమా పెట్టుబడుల కంటే పూర్తిగా భిన్నమైనది. సాధారణంగా సినిమాల్లో పెట్టే పెట్టుబడులు కేవలం ఒకే ఒక సినిమా థియేటర్ కలెక్షన్లపై (ఫ్రైడే బాక్సాఫీస్) ఆధారపడి ఉంటాయి. కానీ ఐపి పెట్టుబడి విధానంలో.. సినిమా కథలు, ఓటీటీ హక్కులు, శాటిలైట్, మ్యూజిక్ రైట్స్, రీమేక్ -డబ్బింగ్ హక్కులతో పాటు భవిష్యత్తులో వచ్చే సీక్వెల్స్-ఫ్రాంచైజీల వంటి ప‌లు రకాల `హక్కుల`ద్వారా వచ్చే దీర్ఘకాలిక ఆదాయాన్ని లక్ష్యంగా చేసుకుంటారు. సినీనౌ సంస్థ ఈ 1,350 కోట్ల నిధితో ప‌లు భాషలలో దాదాపు 30కి పైగా చిత్రాల `పోర్ట్‌ఫోలియో-స్లేట్ ను నిర్మించనుంది. దీనివల్ల ఒక సినిమా ఆశించిన విజయం సాధించకపోయినా...ఇతర సినిమాల రైట్స్ ఆదాయం ఇన్వెస్టర్లకు రక్షణగా నిలుస్తుంది. పైగా విజయం సాధించిన సినిమాలకు ఇతర భాషల్లోనూ రీమేక్, డబ్బింగ్ రైట్స్ పరంగా భారీ డిమాండ్ ఏర్పడి అదనపు ఆదాయం సమకూరుతుంది.

ఇదే సమయంలో మరో దిగ్గజ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ (YRF) కూడా సౌత్ మార్కెట్-నేటి తరం డిజిటల్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ సరికొత్త ఐపి రిజిస్ట్రేషన్ల వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా వైఆర్ఎఫ్ సంస్థ రస్క్ మీడియాతో చేతులు కలిపి `ఒరిజినల్ యానిమేషన్`.. మొబైల్ స్క్రీన్‌లపై నిలువుగా చూసేందుకు వీలుగా ఉండే `వర్టికల్ మైక్రో-డ్రామాలు` రూపొందిస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం.. రూపొందే అన్ని ఒరిజినల్ ప్రాజెక్టుల సృజనాత్మకతను, కథా విధానాన్ని వైఆర్ఎఫ్ సంస్థ పర్యవేక్షిస్తుంది. మరోవైపు రస్క్ మీడియా ఆ కంటెంట్‌ను నిర్మించడమే కాకుండా... తమ సొంత డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ అయిన `ఆల్‌రైట్! టీవీ`.. ఇతర గ్లోబల్ డిజిటల్ ఛానెల్‌ల ద్వారా ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేయనుంది.

ప్రస్తుతం మొబైల్ - ఇంటర్నెట్ వాడకం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో గ్లోబల్ `వర్టికల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎకానమీ`లో భారతదేశాన్ని ఒక బలమైన సృజనాత్మక శక్తిగా నిలబెట్టడం ఈ కూటమి ముఖ్య ఉద్దేశం. నేటి యువతరం స్మార్ట్‌ఫోన్‌లలో కంటెంట్‌ను ఎక్కువగా ఆస్వాధిస్తుండటంతో... వారిని ఆకట్టుకునేలా చిన్న నిడివి కథలను రీజినల్ .. పాన్-ఇండియా లెవెల్లో ప్రసారం చేయడానికి వైఆర్ఎఫ్ పక్కా ప్లాన్ చేస్తోంది. భారీ బడ్జెట్ సినిమాలతో పాటు ఇలాంటి సరికొత్త డిజిటల్ ఐపిలను సృష్టించడం ద్వారా సౌత్ మార్కెట్‌లోని ప్రతి ఒక్క వినియోగదారుడిని చేరుకోవచ్చని ఈ సంస్థలు భావిస్తున్నాయి.

మొత్తంగా చూసుకుంటే... సినీనౌ సంస్థ తెస్తున్న 1,350 కోట్ల భారీ ఫండ్, వైఆర్ఎఫ్ సంస్థ డిజిటల్ ఐపిల రూపంలో చేస్తున్న ప్రయోగాలు భారతీయ సినిమా మార్కెట్‌ను సరికొత్త లీగ్‌లోకి తీసుకెళ్తున్నాయి. ఒకవైపు సిద్ధార్థ్ రాయ్ కపూర్ వంటి అనుభవజ్ఞులైన లీడర్ల సలహాలు, మరోవైపు అధునాతన ఐపి రిజిస్ట్రేషన్ల రక్షణతో కార్పొరేట్ శక్తులు టాలీవుడ్, కోలీవుడ్ వంటి సౌత్ మార్కెట్లలో బలమైన పునాది వేయ‌బోతున్నాయి. మునుముందు రోజుల్లో ఈ మాస్టర్ ప్లాన్ బాక్సాఫీస్ వద్ద, డిజిటల్ మార్కెట్లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Tags:    

Similar News