‘గాడ్ ఆఫ్ వార్’ పోస్టర్లో ఏం చెప్పారు?
నిన్న అనౌన్స్ చేసిన జూనియర్ ఎన్టీఆర్- త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా గురించి దేశవ్యాప్తంగా పెద్ద చర్చే జరిగింది.
నిన్న అనౌన్స్ చేసిన జూనియర్ ఎన్టీఆర్- త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా గురించి దేశవ్యాప్తంగా పెద్ద చర్చే జరిగింది. ఇంతకుముందు ‘అరవింద సమేత’ లాంటి సూపర్ హిట్ సినిమాను అందించింది ఈ జోడీ. కానీ ఈసారి వాళ్లు చేయబోయే సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కబోయే భారీ ఈవెంట్ ఫిలిం. మైథాలజీ సినిమాలు పూర్తిగా కనుమరుగైపోయిన సమయంలో ఈ ఇద్దరూ కలిసి ఈ జానర్ చిత్రం చేయడం అమితాసక్తిని రేకెత్తిస్తోంది. ఐతే ఈ ప్రాజెక్టు ఎగ్జైటింగ్‌గానే అనిపిస్తున్నప్పటికీ.. అనౌన్స్‌మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ మీద మాత్రం విమర్శలు తప్పలేదు.
ఇది ఇది డిజైనర్స్ తయారు చేసింది కాదని.. ఏఐ ద్వారా మొక్కుబడిగా క్రియేట్ చేశారని.. పోస్టర్ అనుకున్నంత గొప్పగా, క్రియేటివ్‌గా లేదనే కామెంట్లు వినిపించాయి. ఐతే ప్రస్తుతం త్రివిక్రమ్ అంత ఖాళీగా లేడు. ‘ఆదర్శ కుటుంబం’ పనిలో బిజీగా ఉన్నాడు. ‘గాడ్ ఆఫ్ వార్’ మీద ఆయన దృష్టిపెట్టే పరిస్థితి లేదు. ఈ ప్రాజెక్టు గురించి ఊహాగానాలకు తెరదించి, ఒక క్లారిటీ ఇవ్వడానికే ఈ పోస్టర్ రిలీజ్ చేశారని అర్థమవుతోంది. కాబట్టి పోస్టర్ క్వాలిటీ గురించి మరీ ఎక్కువ చర్చ అనవసరం.
ఇక ఈ పోస్టర్లో ప్రస్తావించిన సంస్కృత శ్లోకం గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. సుబ్రహ్మణ్యస్వామి తమిళ దేవుడని, ఏదైనా శ్లోకం పెట్టాలంటే తమిళంలో ఉండాల్సిందంటూ తమిళులు తమదైన శైలిలో అభ్యంతరాలు పెడుతున్నారు. ఐతే అది శంకరాచార్యులు సంస్కృతంలో రచించిన శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం నుంచి తీసుకున్నది కాబట్టి ఆ భాషలోనే శ్లోకాన్ని పెట్టారన్నది స్పష్టం. ఇక ఆ శ్లోకానికి అర్థమేంటన్నది కూడా డీకోడ్ చేశారు నెటిజన్లు.
‘‘న జానామి శబ్దం న జానామి చార్థం .. న జానామి పద్యం న జానామి గద్యమ్ .. చిదేకా షడాస్యా హృది ద్యోతతే మే ముఖాన్నిఃసరంతే గిరశ్చాపి చిత్రమ్’’ ఇదీ పోస్టర్ మీద ఉన్న సంస్కృత శ్లోకం. దీనికి ‘‘నాకు శబ్ద జ్ఞానం లేదు. పదాల అర్థం తెలియదు. పద్యాలు రచించడం రాదు. గద్యం చెప్పడమూ రాదు. అయినప్పటికీ ఆరు ముఖాల షణ్ముఖుడు నా హృదయంలో ప్రకాశిస్తున్నాడు. అందుకే నా నోటి నుంచి స్తోత్రాలు అనర్గళంగా వస్తున్నాయి’’ అన్నది దీని అర్థం.